చదరంగం దయ్యాల ఆటా?
మతచాందసం ఏదైనా దాని తీరుతెన్నుల్లో మార్పు వుండదు. ఇప్పుడు సౌదీ అరేబియాలో ముఫ్తీ షేక్ అబ్దుల్లాజిజ్ అల్ షేక్ అనే మతాధిపతి చదరంగం ఇస్లామిక్ వ్యతిరేకమని ప్రకటించారు. అది సమయం వృధా చేయడమేనంటూ అంతటితో ఆగక సైతాన్ ఆడించే ఆట అని తిట్టిపోశాడు. చదరంగ క్రీడ ఆడేవారి మధ్య ద్వేషం రగిలిస్తుందని శాంతివచనాలు చెప్పాడు. శతాబ్దాలుగా దేశ దేశాలలో కొన్ని తరాలను ఆకర్షించడమే గాక మేధకు పదునుపెట్టేదిగి పేరొందిన చదరంగం లేదా చెస్ ఈ మతాధిపతికి తాగుడుతో జూదంతో సమానంగా కనిపిస్తుంది. పశ్చిమాసియాలోని అరబ్ ప్రపంచంలో కూడా విస్తారంగా చదరంగం ఆడతారు. దాన్ని నిషేదిస్తూ ఫత్వా జారీ చేసినట్టు ముఫ్తీషేక్ ప్రకటించారు గాని ఎప్పుడు జారీ చేశారో తెలియదంటున్నారు పరిశీలకులు. ఆధునిక దేశంగా చెప్పుకునే సౌదీలో స్త్రీ పురుషులు స్వేచ్చగా మాట్లాడుకోవడం నిషిద్దం. చాలా రకాలైన సంగీతాలపైనా అక్కడ నిషేదం వుంది. ఫత్వాలు చట్టాలుగా పరిగణించరు గనక ఇళ్లలో మామూలుగానే వుంటారని కొన్ని వార్తా సంస్థల కథనం. అయితే వాస్తవానికి సౌదీతో సహా చాలా పశ్చిమాసియా ప్రభుత్వాలు ఇస్లామిక్ చాందసాన్ని ప్రోత్సహిస్తాయి. అంతే గాక ఆ దేశాలు టెర్రరిజానికి కూడా ప్రాపు నిస్తుంటే అమెరికా బ్రిటన్ వంటివి ఏ మాత్రం పట్టించుకోకుండా వాటికి అండగా నిలుస్తున్నాయి. దీనిపై ఆ దేశాలలో తీవ్ర విమర్శలున్నాయి. గార్డియన్ పత్రిక దీనిపై సుదీర్ఘ వ్యాసమే ప్రచురించింది. కతార్ జుబాత్ అల్ నస్రా అనే టెర్రరిస్టు సంస్థనూ, కువైట్ రివైవల్ ఆఫ్ ఇస్లామిక్ హెరిటేజి సొసైటీని ప్రోత్సహిస్తున్నాయి. ఇక సౌదీ అరేబియా అల్‌ఖైదా పుట్టినిల్లనేది అందరికీ తెలుసు. బిన్‌లాడెన్ ఆ దేశం నుంచి వచ్చిన ఒక మహాకోటీశ్వరుడి కుమారుడే! ఇప్పటికి అక్కడ అల్‌ఖైదా అనుబంధ సంస్థలు నిక్షేపంగా చలామణి అవుతుంటాయి. మాట్లాడితే టెర్రరిజంపై యుద్ధం అనే అమెరికా గాని దానితో చేతులు కలిపే మన పాలకులు గాని ఈ ప్రాథమిక ప్రత్యక్ష సత్యాలను పట్టించుకోరు. ఐఎస్‌ఐఎస్ ఒక జర్నలిస్టును ఉరితీయడంపై ఆగ్రహం సమంజసమే గాని అదే రోజున సౌదీలో 24 మందిని ఉరితీస్తే ఎందుకు పట్టించుకోలేదు? ఈ దేశాలన్నిటిలోనూ మానవ హక్కుల ఉల్లంఘనను చూసీ చూడనట్టు వదిలేస్తూ వందలకోట్ల సహాయం ఎందుకు పంపిస్తున్నారు? ఆఖరుకు 9/11 దాడిలో పాల్గొన్న 19 మందిలో 15 మంది సౌదీ నుంచే వచ్చినట్టు తెలిసినా ఎందుకు చర్య తీసుకోరు? పక్కనున్న పాకిస్తాన్ విషయంలో వారి బూటకత్వం బాగా తెలిసిందే. నామకార్థంగా ఖండిస్తూనే మరోవైపున తమ సైనిక ఆర్థిక సహాయాలు కొనసాగిస్తుంటారు. అందుకే అమెరికాతో కలసి టెర్రరిజంపై పోరాట్టం అంటే కొరివితో తలగోక్కోవడమే!
ఆ సంగతి అలా వుంచితే చదరంగంపైన గాని లేక మరే మానవాసక్తికర ప్రక్రియపైన గాని మతాల ఆంక్షలు మహాదారుణమైనవి. మన దేశంలోనూ శ్రీరాం సేన నాయకుడు ముతాలిక్ వలైంటైన్స్ డేపై ఆంక్షలు ప్రకటించి అబ్బాయిలు అమ్మాయిలను వేధించడం మనం చూశాం. ఏ దుస్తులు వేసుకోవాలో ఎలా వుండాలో నీతులు వల్లించడం చూస్తుంటాం. సౌదీ మతాధిపతికి మరో అడుగు ముందుకేసి చదరంగంపై దాడికి దిగారు. అయితే సౌదీ చదరంగ సమాఖ్య సభ్యుడు మూసా బిన్ థాలీ తమ ఈ ఆట జూదం ఎంతమాత్రం కాదని ఖండించాడు. ఇప్పటికి 70 ఈవెంట్లు జరిపామనీ,వాటిలో రాజకుటుంబీకులు కూడా పాల్గొన్నారని గుర్తు చేశాడు. అసలు దేశంలో జరగనున్న చదరంగం టోర్నమెంటుకు ప్రచారం కల్పించేందుకే షేక్ ఈ సమస్యను లేవనెత్తారన్న ఆరోపణలూ వున్నాయి. మొత్తంపైన మతతత్వం తలకెక్కితే ప్రమాదం ఏమిటో మరోసారి నిరూపించాడు.

