అటు నివాళి- ఇటు నిర్బంధం!

307A292700000578-3412528-Students_protested_against_the_Rohith_suicide_case_However_they_-a-40_1453498254118 Dalit-logo_jpg_2703957g

హైదరాబాద్‌ యూనివర్సిటీ అమరుడు వేముల రోహిత్‌ మృతికి ప్రధాని నరేంద్ర మోడీ ఆలస్యంగా అనివార్యంగా సానుభూతి వచనాలు పలికారు. కాని ఆయన ఆ వ్యాఖ్యలు చేయవలసిన పరిస్థితి కల్పించిన దళిత విద్యార్థులు మాత్రం నిర్బంధానికి గురి కావడం దేశంలో నడుస్తున్న వింత న్యాయానికి తాజా ఉదాహరణ. లక్నోలోని డాక్టర్‌ బాబాసాహెబ్‌ భీమ్‌రావ్‌ అంబేద్కర్‌ యూనివర్సిటీలో ప్రధాని ప్రసంగానికి ముందు రాం కరణ్‌ నిర్మల్‌, అమరేందు కుమార్‌ ఆర్య అనే ఇద్దరు స్కాలర్లు నినాదాలు చేశారు. మోడీ గోబ్యాక్‌, మోడీ ముర్దాబాద్‌, విప్లవం వర్థిల్లాలి అని బిగ్గరగా అరిచారు. తర్వాత మోడీ రోహిత్‌ గురించి విచారం వ్యక్తం చేసి వెళ్లిపోయారు. అంతవరకూ బాగానే వుంది. పోలీసులు ఆ ఇద్దరు స్కాలర్ల నోళ్లు నొక్కి బలవంతంగా నిర్బంధంలోకి తీసుకుని నానా ప్రశ్నలతోవేధించారు. 151వ సెక్షన్‌ కింద కేసు నమోఆదు చేసి బెయిలుపైనే విడుదల చేశారు. పైగా ఇలాటి పనులు చేయొద్దని బెదిరించి పంపించారు. మూడోవాడైన సురేంద్ర నిగమ్‌పై కేసు నమోదు చేయలేదు. ఇక మరోవైపున వారు ముందుగా బుక్‌చేసుకున్నప్పటికీ హాస్టల్‌ గదినుంచి కూడా పంపించివేశారు అధికారులు. దాంతో వారు రాత్రి చలికి ఆరుబయిటే వుండిపోయారు. రోహిత్‌ విషయంలో ఏం జరిగిందో తమకూ అదే పరిస్థితి ఎదురైందని నిర్మల్‌ వ్యాఖ్యానించారు.

కౌశాంబికి చెందిన నిర్మల్‌ రజక కుటుంబం నుంచి వచ్చిన పరిశోధక విద్యార్థి. మానవ హక్కుల అధ్యయనంలో బంగారు పతక గ్రహీత.ఇక అమరేందు జాతావుల కుటుంబంలో పుట్టిన ప్రతిభాశాలి. తమపై పోలీసుల ప్రవర్తనకు ఏమాత్రం విచారించడం లేదని వారు ప్రకటించారు. దళితులు మైనార్టీ ముస్లింల పట్ల ప్రతిచోటా ఇలాగే చేస్తున్నారు. ఆ అన్యాయాలను కొంతైనా వినిపించగలిగినందుకు సంతోషంగా వుందని వారు చెప్పారు. ఇంతకూ వీరంతా న్యాయ పరీక్ష రాసేందుకు సిద్దమవుతున్నారు. దేశంలో సామాజిక న్యాయం మాత్రం లేదని తెలిసిందంటున్నారు.

దళితులలో కొత్తకదలిక

హైదరాబాద్‌ యూనివర్సిటీలో రోహిత్‌ విషాద మరణం ఒక సంచలనం కలిగించింది. కాని దేశంలోని అనేక ఇతర యూనివర్సిటీలలోనూ దళిత వర్గాలలో కదలిక బాగా పెరిగిందని మీడియాకథనాలు తెలియజేస్తున్నాయి. రోహతక్‌ లోని మహర్షిదయానంద్‌ యూనివర్సిటీలో డాక్టర్‌ అంబేద్కర్‌ స్టూడెంట్స్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా(డిఎఎస్‌ఎప్‌ఐ) పేరిట కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.జనవరి 3వ తేదీన వారు సావిత్రిభాయి ఫూలే జన్మదినాన్ని తమ టీచర్స్‌డేగా జరుపుకొన్నారు. మామూలుగా సెప్టెంబర్‌5న సర్వేపల్లి రాధాకృష్ణన్‌ పుట్టిన రోజున ఇది జరిగే పద్ధతిని ధిక్కరించారు. దేశంలోని చాలా రాష్ట్రాలలో దీనికి శాఖలున్నాయి. ఇక జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సీటీలో యునైటెడ్‌ దళిత్‌ స్టూడెంట్స్‌ ఫోరం(యుడిఎస్‌ఎప్‌) కార్యకలాపాలు నిర్వహిస్తూన్నది. ఈ సంస్థలలో కొన్ని ఎన్నికలలో పాల్గొనవు. మరికొన్ని వామపక్ష సంఘాలతో కలసి పోరాడుతుంటాయి. మనువాద భావజాలాన్ని ప్రచారం చేసే ఆరెస్సెస్‌ మాత్రం తమకు శత్రువనీ గట్టిగా ప్రకటిస్తాయి. వామపక్ష సంఘాల కార్యకలాపాలకు తమకూ తేడా వున్నా వాటిని వ్యతిరేకులుగా భావించడం లేదని వీరంటారు.రోహిత్‌ ప్రాణబలి తర్వాత ఇలాటి సంఘాల ప్రాధాన్యత పెరిగినట్టు భావిస్తున్నారు. హెచ్‌సియులోని అంబేద్కర్‌ స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ కూడా ఎస్‌ఎప్‌ఐతో కలసి ఎన్నికలలో పాల్గొని రెండు సార్లు విజయం సాధించింది. ప్రస్తుతం ఈ అసోసియేషన్‌ ప్రతినిధుల సమావేశం గుంటూరులో ఏర్పాటైంది. తాజా పరిణామాల తర్వాత ఇలాటి కార్యాచరణ మరింత పెరిగే అవకాశం వుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *