హెరాల్డ్‌ రభస రాజకీయ తప్పిదం

హెరాల్డ్‌ రభస రాజకీయ తప్పిదం

నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్‌ నాయకులు పార్లమెంటులో రభస చేయడం అర్థరహితం. అభ్యంతర కరం. జవహర్‌లాల్‌ నెహ్రూ స్థాపించిన పత్రికగా దాన్ని అభివృద్ధి చేయదల్చుకుంటే వారికి దశాబ్దాల తరబడి అధికారం హంగులూ వున్నప్పుడు పట్టించుకోలేదే? 2008లో అధికారికంగా మూసేయవలసిన దురవస్థ ఎందుకు వచ్చింది? యంగ్‌ ఇండియా అనే కంపెనీ సోనియా రాహుల్‌ గాంధీల ప్రత్యక్ష ఆధ్వర్యంలో ఏర్పడటం, హెరాల్డ్‌ను ప్రచురించే అసోసియేట్‌ జర్నల్స్‌లో ప్రవేశించి యాజమాన్యం పొందడం, ఆ వెంటనే కాంగ్రెస్‌కు ఇవ్వాల్సిన 90 కోట్ల బకాయిలు రద్దు చేయడం అంతా నాటకీయంగా అనుమానాస్పదంగా వుందనడంలో సందేహం లేదు. ఈ కేసు వేసిన సుబ్రహ్మణ్యస్వామి వివాదాస్పద నేపథ్యం ఇక్కడ ప్రధానం కాదు. అత్యున్నత స్థానాల్లో వున్న అధినేతలు ప్రత్యక్ష భాగస్వాములుగా ఈ తరహా వ్యవహారాలకు ఆస్కారం ఇవ్వడమే తప్పు. ఇందిర కోడలుగా తనకు భయం లేదని చెప్పే సోనియా గాంధీ హైకోర్టులో గాని ఇతర చోట్ల గాని తన వాదన తను వినిపించవచ్చు. అంతే తప్ప అత్యున్నత చట్టసభలలో రాజకీయ రభస చేయడం తగని పని. ఒక వేళ అవతలివారికి ఉద్దేశాలు వున్నాయని ఆరోపించినంతమాత్రాన తమపై వచ్చిన ఆరోపణలకు జవాబు చెప్పుకునే బాధ్యత వుండకుండా పోదు. యాభై లక్షలు పెట్టుబడి పెట్టిన యంగ్‌ ఇండియాకు 90 కోట్ల అప్పు రద్దు చేయడం ఎవరూ ఒప్పుకునేది కాదు. ఇక నెలకు రు.20 లక్షలు అద్దెలు ఒక్క ఢిల్లీలోనే తెస్తూ, వేల కోట్ల విలువ చేసే ఆస్తులు స్వాధీన పర్చడం లాభాపేక్ష రహిత వ్యవహారం అనడం నమ్మశక్యం కానిది. విచారణకు సిద్ధంగా వున్నామంటూనే రాజకీయ రభస చేయడం విశ్వసనీయతకే విఘాతం. కాంగ్రెస్‌ అధికారంలో వుండగా పెంచుకున్న నేషనల్‌ హెరాల్డ్‌ ఆస్తుల విలువ 2000 – 5000 కోట్ల మధ్య చెబుతున్నారు గనక వాటిని దేశానికి అప్పగించడం చాలా మంచిది. ఒక వేళ ఈ కేసే పొరబాటైతే రాహుల్‌గాంధీ బ్రిటిష్‌ పౌరుడన్నట్టు వేసిన కేసులాగే ఇదీ వీగిపోవచ్చు. ఈ లోగా కంగారు పడడం అంటే తప్పు వుందని ఒప్పుకోవడమే! రాజకీయ రంగంలో అగ్రభాగాన వున్నవారు ప్రత్యర్థులు చేసే ఆరోపణలను చట్టబద్దంగా ఎదుర్కొవచ్చు గాని చట్టసభల సమయాన్ని బలిపెట్టకూడదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *