సంగీత భరిత ప్రేమకథ అనార్కలి
నిరంకుశత్వంపై తిరుగుబాటు అనేక రూపాల్లో వుండొచ్చు. వాటిలో ప్రేమికుల ధిక్కారం కూడా వాటిలో ఒకటి. పాత కాలపు ప్రేమ కథలన్నీ ఆధిపత్యంపైన సంప్రదాయాలపైన తిరుగుబాట్లుగానే కనిపిస్తాయి. వాటిలో చాలా భాగం విషాదంగా ముగిసిపోయాయి. అందుకొక కారణం ఏమంటే ఆ కథల్లో నాయికలు వున్నంత ధైర్యంగా నాయకులు లేకపోవడం! దేవదాసు పిరికితనం అందరికీ తెలుసు. అలాటి మరో కథ చరిత్ర గాని చరిత్ర అనార్కలిది.భారతీయ భాషల్లో పలుసార్లు నిర్మాణమైన ఈ కథకు అద్భుత సంగీత భరితంగా అందించింది అంజలీ పిక్చర్స్. వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో అక్కినేని అంజలీ జంటగా నటించిన అనార్కలి 1955 ఏప్రిల్28న అంటే అరవై ఏళ్ల కిందట విడుదలైంది. అప్పట్లో అనేక రికార్డులు సృష్టించింది.
కథా గమనం
మహాసామ్రాట్ అక్బర్ (ఎస్విఆర్) కుమారుడైన సలీం అనారు పూల తోటలో కనిపించిన సామాన్య యువతిని ప్రేమిస్తాడు. ఆమె అసలు పేరు నదీరా. అప్పుడాయన కూడా సామాన్య సైనికుడి వేషంలోనే వుంటాడు. యువరాజునని చెప్పకుండా అసలు సంగతి దాచిపెడతాడు. ఆ సమయంలోనే అక్బర్ అటుగా రావడంతో తప్పుకుంటాడు. అక్బర్ కూడా ఆమె గాన నాట్యాలకు ముగ్దుడై ఆస్థాన నర్తకిగా ఆహ్వానిస్తాడు. ఆ తోటలో కనిపించింది గనక అనార్కలి బిరుదునిస్తాడు. సలీంమేనమామ సైన్యాధిపతి మాన్సింగ్(నాగయ్య) ఈ ప్రేమ విషయం తెలుసుకుని అనార్కలిని మరచిపొమ్మని హెచ్చరిస్తాడు. పైగా సలీంను తనతో యుద్ధానికి తీసుకుపోతాడు. అక్కడ శత్రువులు బానిసల స్థావరంపై దాడి చేసి అనార్కలిని తీసుకుపోయి వేలానికి పెడితే సలీం తను తెచ్చుకుంటాడు. తర్వాత అతను యుద్దంలో గాయపడితే అనార్కలి సపర్యలతో సంగీతంతో కాపాడుకుంటుంది. అయితే అతను మామూలు సైనికుడు కాదని భావి భారత సామ్రాట్టని తెలుసుకుంటుంది. దాంతో అనార్కలి సంకోచిస్తే నాట్యంతో మెప్పించి ప్రేమ వరం పొందవచ్చని సలీం నచ్చజెబుతాడు. సలీంపై ఎప్పటినుంచో ఆశలు పెంచుకున్న గుల్నాం(బాలసరస్వతి) ఆమె నాట్య ప్రదర్శన రోజున మత్తు కలిపిన పానీయం ఇచ్చి మోసం చేస్తుంది. దాంతో అనార్కలికి శిక్ష పడుతుంది. ఆ సమయంలో సలీం తన ప్రేమ సంగతి తల్లి జోదాభాయి(కన్నాంబ)కు చెప్పి గట్టిగా వాదిస్తాడు. ఇది తండ్రీ కొడుకుల మధ్య యుద్ధానికి దారి తీస్తుంది. తండ్రిపై వేటు వేయబోయి తల్లిని చూసి ఆగిపోతాడు సలీం.
అక్బర్ పాదుషా వారిద్దరికీ మరణ శిక్ష విధిస్తాడు. అయితే కుమారుడికి అమలు చేయడు. అతను వచ్చే సరికి అనార్కలికి మాత్రం సజీవ సమాధి కట్టేస్తారు. ఈ సమాధి దగ్గర విషాద గీతాలు ఆలపించే సలీంను చూపించడంతో చిత్రం మొదలవుతుంది. అక్కడే ముగుస్తుంది.
అందరూ దిగ్గజాలే
లవకుశ తర్వాత అంజలి అంటే సీతమ్మ తల్లిగా స్థిరపడిపోయింది గాని మొదట ఆమె అందాల నాట్యతారగానే రంగ ప్రవేశం చేసింది. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంకు చెందిన అంజలి అసలు పేరు అంజనీ కుమారి. ఆమె నాట్య ప్రతిభ చూసి తీర్చిదిద్దిన వాడు సంగీత దర్శకుడు ఆదినారాయణ రావు. అప్పటికే వివాహితుడైనా తర్వాత అతన్నే పెళ్లి చేసుకుని స్థిరంగా వుండిపోయింది. ఈ జంట స్థాపించిన అంజలీ పిక్చర్స్ ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు అందించింది. వాటిలో మొదటిది పరదేశి. రుణానుబంధం తర్వాత కాలంలో అనార్కలి. 1953లో ప్రదీప్ కుమార్, బీనారారులు జంటగా నటించిన అనార్కలి హిందీ చిత్రం తరహాలోనే తెలుగులో దీన్ని తీశారు. సముద్రాల సీనియర్ రచన చేశారు. నటీనటులందరూ గొప్ప ప్రతిభా వంతులు కావడంతో గొప్పగా విజయవంతమైంది. అక్బర్‌గా ఎస్వీఆర్, మాన్‌సింగ్‌గా నాగయ్య, జోదాభారుగా కన్నాంబ పాత్రలకు ప్రాణం పోశారు. వారి ముందు కాస్త తేలిపోయేట్టుగా వుండే అక్కినేని కూడా సలీం పాత్ర మానసిక ఘర్షణనూ వూగిసలాటలనూ సమర్థంగా అభినయించి ఆకట్టుకున్నారు. బలహీనులు కాకండి జహాపనా అని సలీం అంటే, రాజ మర్యాదలు కూడా మర్చిపోయి షేకూ అని అక్బర్ సంబోధించిన ఘట్టం గొప్పగా వుంటుంది. చివరకు రాజరికమే పై చేయి అవుతుంది. అయితే ప్రధానాకర్షణగా నిలిచింది మాత్రం అంజలి పాత్రే. టైటిల్ పాత్ర మాత్రమే గాక నిర్మాతలు కూడా వారే కావడంతో ఆమెకు కావలసినంత ప్రాధాన్యత లభించింది. ఆ ఏడాది ఆమె అరడజను చిత్రాల్లో రకరకాల పాత్రలు ధరించి చెరగని ముద్ర వేసింది.
మరపురాని పాటలు
అనార్కలి చిత్రానికి ప్రత్యేకాకర్షణ సంగీతం. తెలుగులో చిరస్మరణీయంగా నిలిచిపోయిన అనేక పాటలు ఆ చిత్రం లో వే. వాటన్నిటికీ తలమానికమైంది రాజశేఖరా నీపై మోజు తీరలేదురా అన్న పాట. మదన మనోహర సుందర నారి, మధుర దరస్మిత నయన చకోరి, మందగమన జిత రాగమరాళి నార్కలి అనార్కలి అంటూ ఘంటసాల గంభీర మధుర నాదం వినిపిస్తుండగానే వహ్వా అంటూ ఎస్వీఆర్ బాణీ మాట.. ఆదినారాయణ రావు సంగీత ఝరి.. రాజ శేఖరా పాట.. ఎప్పటికీ ఆపాత మధురంగా వినిపిస్తూనే వుంది. మరో గొప్ప పాట జీవితమే మధురమూ, రాగసుధా భరితమూ ప్రేమ కథా మధురమూ.. ఇది మాత్రం హిందీలోని ‘ ఎ జిందగీ హై… అన్న బాణీతో రూపొందింది. కలిసె నెలరాజు ప్రణయ సఖిని కలిసె యువరాజు అనార్కలిని అంటూ మరో పాట.. విశేషమేమంటే ఇన్నేళ్ల తర్వాత కూడా ఈ పాటలు వినసొంపుగానే వుండటం ఆదినారాయణ రావు సంగీత మహత్యమే.వాస్తవానికి ఆయన సంగీతం అందించిన చాలా పాటలు హిట్స్‌గా నిలిచాయి. తెలుగు సినిమా అయినప్పటికీ నిద్రిస్తున్న అనార్కలిని సలీం చూసే సన్నివేశంలో ‘సోజా రాజకుమారి’ అంటూ ఎఎం రాజా పాట పెట్టడం మరో విశేషం. రాచరికం క్రౌర్యాన్ని శపిస్తూ అనార్కలిని కీర్తిస్తూ ఘంటసాల గానంలో ప్రత్యేకంగా పాటలు పెట్టిన వేదాంతం రాఘవయ్య ప్రేమ సందేశం వినిపించగలిగారు గనకే అనార్కలి గొప్ప విజయం సాధించింది.
మొఘలే ఆజం
దేవదాసు తర్వాత వేదాంతం అక్కినేని ఎస్వీఆర్ పేకేటి వంటి వారి కాంబినేషన్ ఈ చిత్రంలో కొనసాగడం ఒక ప్రత్యేకత. అమర ప్రేమికుల కథలుగా చెప్పుకునే దేవదాసు, లైలామజ్ను , అనార్కలి మూడింటిలో నాయికలు వేరైనా నాయకుడు ఆక్కినేని కావడం ఆయనను శాశ్వత ప్రేమ కథానాయకుడిగా ప్రతిష్టించింది. రాజుగా నటించిన చిత్రాలు తక్కువైనా ప్రేమ ప్రధానం గనక ఆయన బాగా మెప్పించగలిగారు. దేవదాసు హిందీలో కన్నా తెలుగులో ఎక్కువ జయప్రదమైంది. కాని అనార్కలి విషయానికి వస్తే ఈ చిత్రం తర్వాత కొంత కాలానికి చాలా భారీ ఎత్తున మొఘలే ఆజం విడుదలైంది. నాటి మేటి హీరో దిలీప్ కుమార్ పృధ్వీరాజ్ కపూర్ మధుబాల ప్రధాన పాత్రల్లో కనిపించిన ఈ చిత్రం ప్రేమకథతో పాటు మొఘల్ సామ్రాజ్య వైభవాన్ని కూడా చూపించి దేశాన్ని వూపేసింది. ఈ చిత్రంలో ప్యార్ కియాతో డర్ నా క్యా పాట ఆల్ టైం హిట్. జిందాబాద్ జిందాబాద్ హే మొహబ్బత్ జిందాబాద్ అంటూ చిత్రంలో తాన్సేన్ పాడే గొప్ప పాట మరో అద్బుతం. రెండేళ్ల కిందట దీన్ని రంగుల్లోకి మార్చి విడుదల చేసినపుడు కూడా బాగా నడిచింది. మొఘలే ఆజంతో పోలిస్తే అనార్కలి బలహీనంగా కనిపిస్తుంది.
విఫలయత్నం
అనార్కలి విడుదలైన తర్వాత దాదాపు పాతికేళ్లకు ఎన్టీఆర్ బాలకృష్ణ దీపలతో అక్బర్ సలీం అనార్కలి విడుదలైంది. దీనికి మొఘలే ఆజంను స్పూర్తిగా తీసుకున్నారు. అయితే సంభాషణలు కృత్రిమంగా వుండటం పెద్ద ప్రతికూలంగా మారింది. నారాయణ రెడ్డి రాసిన మాటలు తలకిందులుగా నడుస్తాయి. ‘ఇచ్చారు మాకీ బహుమానం’ అన్నట్టు వుంటాయి. అక్బర్‌గా నటించిన ఎన్టీఆర్ వేషం బాగున్నా ఈ కారణంగానే పాత్ర విపలమైంది. బాలకృష్ణ అప్పటికి వర్థమాన నాయకుడుకాగా దీప సీనియర్ హీరోల సరసన వేసి ప్రౌఢదశలో వున్న స్థితి. ఈ కారణంగా వారి కాంబినేషన్ కూడా అంతగా నప్పలేదు. అయితే ఈ చిత్రంలో పాటలు బాగుంటాయి. సిపాయి నీ కై ఎంత వేచి వేచి వున్నానో, తారలెంతగా వేచేనో, ప్రేమిస్తే తప్పంటారా వంటిపాటలు బాగుంటాయి. ఏమైనా ఆ చిత్రం పాత అనార్కలి దరిదాపులకు రాలేకపోయింది.
అనార్కలి కథ చాలా చిత్రాల్లో అంతర్నాటకంగా చూపించడం మరో విశేషం. మంచి మనుషులులో శోభన్ బాబు మంజుల, ఆరాధనలో ఎన్టీఆర్ వాణిశ్రీ, తదితరులు ఈ ప్రేమ కథను అభినయిస్తారు.
ఇలా తెలుగు తెరపై అనార్కలి కథ ఇంతగా వెలుగొందడానికి కారణం మాత్రం అంజలీ పిక్చర్స్ వారి అనార్కలి మాత్రమే. ఆ చిత్ర నటీనటులు కళాకారులు దాదాపు ఎవరూ ఇప్పుడు లేరు గాని ఆ కళాఖండం ప్రేక్షకులకు కను విందు చేస్తూనే వుంటుంది.