ఒక సాహిత్య సర్వస్వం… స్నేహ గీతం
చలసాని ప్రసాద్ మృతితో తెలుగు సాహిత్యం ముఖ్యంగా వామపక్ష సాంసృతిక రంగం ఒక అనుభవజ్ఞున్ని ఒక చరిత్ర కారుణ్ని కోల్పోయింది. కమ్యూనిస్టు ఉద్యమ ముఖ్య కేంద్రాల్లో ఒకటైన కృష్ణా జిల్లా భట్లపెనుమర్రులో 1932లో పుట్టిన ప్రసాద్ కుటుంబమూ ఉద్యమానికి అంకితమైందే. ఆయన పెదనాన్న(?) చలసాని వాసుదేవరావు ఉద్యమంలోనూ పెద్ద కింద లెక్క. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ముగ్గురు వీరులు ప్రాణాలర్పించిన కుటుంబం వారిది. ఈ నేపథ్యంలో పెరిగిన ప్రసాద్ మొదటి నుంచి కమ్యూనిస్టు భావాలు వంటపట్టించుకోవడంలో ఆశ్చర్యం లేదు. చలసాని ప్రసాద్ మరో సాహిత్య విమర్శకుడు సూరపనేని హరి పురుషోత్తమ రావు(హరి)కి అక్షరాలా ఆప్తమిత్రుడు. ప్రముఖ దర్శకుడు ప్రత్యగాత్మ ప్రసాద్ సోదరిని వివాహం చేసుకున్నారు. వీరంతా రాజకీయాలతో పాటు కళా సాహిత్యాలపై ప్రత్యేకాభిమానంతో అధ్యయనం చేస్తూ వచ్చారు. మహాకవి శ్రీశ్రీని అమితంగా అభిమానించిన చలసాని ప్రసాద్ హరి ద్వయం 1955 ఎన్నికల ప్రచార సందర్భంలో శత్రువర్గాల దాడుల కారణంగా మతిస్తిమితం తప్పుతున్న స్థితిలో మొదటిసారి చూశారు. ఆ వివరాలను ఉభయులూ గ్రంధస్తం చేశారు.
తర్వాత కాలంలో ప్రత్యగాత్మ మద్రాసులో చలన చిత్ర రంగంలో అవకాశాలు వెతుక్కుంటూ వెళ్లారు. చలసాని ప్రసాద్ హైదరాబాదులో వున్నప్పుడు రాసిన లేఖల్లో ఆయన రాజకీయాల గురించి చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసినట్టు కనిపిస్తుంది. ప్రజాశక్తి బుకహేౌస్‌లో చాలా కాలం గడిపిన హరి కారణంగా ఆ లేఖల ప్రతులు నేను చూడగలిగాను. దర్శకుడుగా గొప్ప పేరు తెచ్చుకున్న ప్రత్యగాత్మ వంటివారికి ఎంతటి రాజకీయ సామాజిక అవగాహన వుందో ఆ లేఖలు చెబుతాయి. వీటిని ఆయన హరితో ప్రసాద్‌తో పంచుకుంటూ వచ్చారు. మొత్తం మీద ఈ మిత్ర ద్వయం కూడా మద్రాసు వెళ్లి అనేక సహాయక బాధ్యతలు నిర్వహించారు. ఈ క్రమంలో సినీమా రంగం గురించీ మంచి అవగాహన అనుభవం సంపాదించారు. మొదట ప్రసాదూ, ఆ తర్వాత ఆలస్యంగా హరి తిరిగి వచ్చారు.
జీవితం కోసం అనేక ఉద్యోగాలు చేసిన చలసాని ప్రసాద్ 1968లో నగ్జలైట్ ఉద్యమంవైపు ఆకర్షితులైనారు. అప్పటికే ఆయన విశాఖ పట్టణంలో స్థిరపడ్డారు. 1970లో విశాఖలో శ్రీశ్రీ షష్టిపూర్తి నిర్వహణలో కీలక భూమిక పోషించారు. అదే ఏడాది విరసం ఏర్పడింది. ఆ సంఘంలో చివరి వరకూ నిర్మాణాత్మకంగా సైద్ధాంతిక నిబద్దతతో బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి ఆయన. రావిశాస్త్రికి ఎంత దగ్గరంటే తన ఒక పుస్తకం ఈయనకు అంకితమిచ్చారు. ఆయన రచనలు కూడా సంపుటీకరించారు.
ఇవన్నిటినీ మించి సాహిత్య సేకరణలోనూ పరిశోధనలోనూ ఆయన గొప్ప కృషి చేశారు. మొదట కొడవటిగంటి కుటుంబరావు (పత్రికా) రచనల సేకరణ ప్రారంభించారు. ఆ పనిలో భాగంగా 70వ దశకంలో ప్రజాశక్తి కార్యాలయాన్ని పలుసార్లు సందర్శించి నోట్సు రాసుకెళ్లేవారు. ఇక 1983లో శ్రీశ్రీ మరణానంతరం ఆయన రచనలన్నిటినీ సేకరించి పాదపీఠికలతో సహా ప్రచురించడం ఒక యజ్ఞంగానే చేపట్టారు.షష్టిపూర్తి సమయంలో కె.వి.రమణారెడ్డి సేకరించినవాటితో పాటు అదనంగా అనేకం సంపాదించడమే గాక వాటికి కూడా సవివరమైన పాదపీఠికలు జతచేశారు. వాస్తవానికి ఆ సమాచారం దానికదే చాలా విలువైందిగా వుంటుంది. శ్రీశ్రీ సాహిత్య సంపుటాలు ప్రచురిస్తూనే ఇతర కోణాల్లోనూ అధ్యయనం కొనసాగిస్తూ వచ్చారు.
చలసాని ప్రసాదూ, నేనూ సాహిత్య రాజకీయ వివాదాల్లో కొన్ని సార్లు తీవ్రంగానే స్పందించినా, వ్యాఖ్యానాల విషయంలో తేడాలు వున్నా ఆయన ప్రచురణలు నాకు గొప్పగా ఉపయోగపడ్డాయి.ముఖ్యంగా శ్రీశ్రీ విషయంలో ఆయన అంతటి సమాచారం ఒకచోటకు చేర్చి వుండకపోతే నా వంటి వారు అధ్యయనం రచనలు చేయడం సాధ్యమై వుండేది కాదు. అలాగే ఆ పుస్తకాల పాదపీఠికలు కూడా సాహితీ స్రవంతి రచయితల ఎగ్జిబిషన్‌కు నోట్సురాయడంలో చాలా ఉపయోగపడ్డాయి.ఇదే గాక తేదీలు వివరాలకు సంబంధించి ఎప్పుడైనా ఏదైనా పొరబాటు దొర్లితే వెంటనే బాధ్యతగా ఉత్తరం రాసేవారు. నా నవీన సాహితిలో ఆత్రేయ పుట్టిన రోజుకు శ్రీశ్రీ ఆరుద్రల బంధుత్వానికి సంబంధించిన సమాచారం సరిచేస్తూ ఉత్తరం రాశాడు.నిజానికి కార్డు ముక్క రాసి పారేయడం ఆయనకున్న ఒక మంచి లక్షణం. బుకహేౌస్‌లో హరి నాకు బాగా సన్నిహితమై పోవడం కూడా మా స్నేహానికి దోహదం చేసింది. పాత్రికేయ పితామహులు బొమ్మారెడ్డితో ఇటీవలి కాలంలో బుకహేౌస్ మేనేజర్ లక్ష్మయ్యతోనూ కూడా ప్రసాద్‌కు బాగా చనువు. సాహిత్య శాలలకు వస్తుండేవారు. ఇటీవలే విశాఖ పట్టణంలో మహాసభల సందర్భంగా జరిగిన బుక్‌ఫెస్టివల్‌కు వచ్చినపుడు ఆయనతో కలసి ఫోటోలు తీసుకున్నాము. సభలకు వచ్చిన చాలా మంది ఆయన ఇంటికి వెళ్లికలుసుకున్నారు. సైద్ధాంతిక తేడాలతో నిమిత్తం లేకుండా విశాఖ సాహితీ క్షేత్రాన్ని చైతన్యవంతం చేసిన వారిలో చలసాని ప్రసాద్ ఒకరు. దీర్ఘకాలం పాటు అస్వస్థతతో వుండి కన్నుమూసిన తన భార్యకు శ్రద్ధగా సేవ చేస్తూనే సాహిత్య కృషి కొనసాగించిన దీక్ష ఆయనది. అలాగే రాజకీయ తేడాలతో నిమిత్తం లేకుండా అందరితో కలసి పోగల సహృదయుడు. ఏదైనా నచ్చకపోయినా మంచాడే గాని ఎందుకో ఇలా రాశాడు, చేశాడు అని సరిపెట్టేవాడు. విరసంపై నిషేదం విధించి(తొలగించిన) సమయంలో మావోయిస్టు రాజకీయాలకు సంబంధించి మాట్లాడినప్పుడు చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు అవసరం లేదు గాని అరుణతార పత్రికలో అందుకు సంబంధించిన అధికార విధాన వివరణ చూడొచ్చు.
చలసానిప్రసాద్ వ్యాసాలు ఇంటర్వ్యూలు అన్నీ విషయ సంపన్నమైనవి. తన రచనలకైనా సంకలనాలకైనా రాసిన ముందు మాటలు వివరణలు చూస్తే ప్రామాణికతకోసం ఎంతగా పాకులాడేవాడో తెలుస్తుంది. అయన లేకపోవడం అంటే ఒక విజ్ఞాన సర్వస్వం లేదా ఒక సాహిత్య క్యాలెండర్ వంటి వ్యక్తిని కోల్పోయినట్టే. సాహిత్య పత్రికా రంగాల్లో కృషి చేస్తున్న ఆయన కుమార్తెలకు అనేకమంది ఆయన సాహితీ మిత్రులందరికీ ప్రగాఢ సానుభూతి. ప్రగతిశీల సాహిత్య శక్తులకు సవాళ్లు పెరుగుతున్న తరుణంలో ఆయన కన్నుమూత పెద్ద వెలితి. (ప్రజాశక్తి-26,7,15) -తెలకపల్లి రవి