అరవయ్యేళ్ల అపురూప చిత్రం ‘కన్యాశుల్కం’

 

గురజాడ అప్పారావు శత వర్ధంతి జరుగుతున్న ఈ సంవత్సరం ‘కన్యాశుల్కం’ సినిమా వజ్రోత్సవ సంవత్సరం కూడా కావడం చారిత్రిక విశేషం. మొదటి సారి కన్నా తర్వాతి పర్యాయాలు విడుదలైనప్పుడు ఎక్కువ విజయం సాధించిన కొద్ది చిత్రాల్లో ‘కన్యాశుల్కం’ ఒకటి. ఇప్పటిలా టీవీలు విడియోలు లేని రోజుల్లో చిత్రాలు మళ్లీ మళ్లీ విడుదల కావడం సర్వసాధారణం. ఆ విధంగా థియేటర్లకు కొన్ని పాత విజయవంతమైన చిత్రాలు ఫలానా థియేటర్లో ఏడాదికో రెండేళ్లకో మళ్లీ వస్తాయని(రిపీట్‌ రన్‌) అందరికి తెలిసిపోయేది. అందులోనూ అగ్రహీరోల సంస్థల చిత్రాలకు ఆ విధమైన ఏర్పాటు కూడా వుండేది. పాతాళ భైరవి ఏదో ఒక థియేటర్లో ఎక్కడో ఒక చోట ఆడుతుంటుది గనక ఇప్పటికి యాభై ఏళ్లు పూర్తి చేసుకున్నట్టు లెక్క అని ఒకసారి చక్రపాణి చమత్కరించారందుకే. అయితే ‘కన్యాశుల్కం’ సంగతి వేరు. 1955లో మొదటి సారి విడుదలైనప్పుడు అంతగా ఆదరణ పొందని ఆ సినిమా దశాబ్దాల తర్వాత శతదినోత్సవాలు చేసుకోవడం చాలా అరుదైన ఉదాహరణే. ప్రేక్షకులు ఆచిత్రం స్వారస్యాన్ని, గురజాడ నాటకంగా దాని విశిష్టతను ఆలస్యంగా అర్థం చేసుకోవడం ఇందుకు కారణమై వుండొచ్చు. కన్యాశుల్కం చదవడానికే తప్ప ప్రదర్శనకు అంతగా అనుగుణం కాదనే అపప్రథ చలన చిత్రానికి లేకుండా పోయింది. మూడు గంటల నిడివి కోసం నాటకాన్ని సంక్షిప్తపర్చి కొన్ని మార్పులు చేశారు.

‘కన్యాశుల్కం’ సినిమాగా తీయాలని వినోదా వారు ప్రకటించినప్పుడు ముందే పెద్ద చర్చ జరిగింది. అది సినిమా ఫార్ములాకు సరిపోదన్నారు. ఆ స్థాయిలో తీయలేరన్నారు. ‘దేవదాసు’తో చిరపరిచితమైన వినోదా సంస్థ అధినేత డి.ఎల్‌. నారాయణకు ప్రసిద్ద నవలలు నాటకాలంటే చాలా ఆసక్తి. ‘కన్యాశుల్కం’ అనుకున్నప్పుడు కూడా డిఎల్‌ మొదట అక్కినేనినే సంప్రదించారు. ఆయన నిరాకరించిన తర్వాత దర్శకుడు పి.పుల్లయ్య ఎన్టీఆర్‌ను ఎంపిక చేశారు.( ఆ తర్వాత కాలంలో ‘ఏకవీర’ చిత్రానికి కూడా అక్కినేని నిరాకరించారు) మధురవాణిగా సావిత్రిని తీసుకున్నారు. రామప్పంతులుగా సిఎస్‌ఆర్‌నూ, లుబ్దావధాన్లుగా గోవిందరాజుల సుబ్బారావును, అగ్నిహౌత్రావధాన్లుగా విన్నకోట రామన్నపంతులునూ ఎంపిక చేశారు. బుచ్చమ్మగా జానకి, ఆమె తల్లి వెంకమ్మగా హేమలత, పూటకూళ్లమ్మగా చాయాదేవి, లుబ్దావధాన్లు కూతురు మీనాక్షిగా సూర్యకాంతం, తదితరులు నటించారు. నటీనటులుందరూ హేమాహేమీలైనా పాత్రలే కనిపిస్తాయి. చాందస బ్రాహ్మణ పాత్రలను చూసిన అప్పటి పిల్లలు తమ వీధుల్లో కనిపించే అయ్యవార్లే నటించారనుకున్నారట!
అప్పటికే సాంఘిక పౌరాణిక జానపద చారిత్రిక పాత్రలతో అలరించిన ఎన్టీఆర్‌ ప్రతినాయక ఛాయలున్న గిరీశం పాత్రను ఒప్పుకోవడమే ఒక సాహసం.ఆ పాత్రతో సహా ఏది ఎలా వుండాలో కళా దర్శకుడు వాలి స్కెచ్‌లుతయారు చేశారు. ఎన్టీఆర్‌కు గిరీశం పాత్ర బాగా నప్పింది. వంకర చూపుతో వంచనాత్మక మాటలతో అవతలి వారిని బురిడీ కొట్టించే తీరు ఆయన బాగా పండించారు. మధురవాణి దగ్గర తన ఆటలు సాగనప్పుడు, ఆమె దగ్గర వుండగానే పూటకూళ్లమ్మ చీపురు కట్టతో తరుముకొచ్చినప్పుడు అన్నిటినీ మించి బుచ్చమ్మను వలలో వేసుకోవడానికి గాను వదిన గారూ ఎంత మాటన్నారు అంటూ వెంటపడినప్పుడు ఎన్టీఆర్‌ ఒక పెద్ద హీరోగా గాక టక్కరిగానే కనిపించారు. ‘చిటారు కొమ్మన మిఠాయి పొట్లం చేతికందదేం గురుడా’ అన్న పాట, దానికి అభినయం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వన్స్‌ దేర్‌ లివ్డ్‌ ఎ కింగ్‌ అంటూ శిష్యుడు వెంకటేశంతో ఉత్తుత్తి ఇంగ్లీషు మాట్లాడ్డం, లేనిపోని కోతలు కోయడం, తెలియని శాస్త్రాలు ఉటంకించడం , ‘ఏంటోరు షేక్స్‌పియర్‌ మొహం పెట్టాy’్‌ అంటూ పలకరించడం, ‘మై హార్ల్‌ మెల్ట్స్‌’ అంటూ బుచ్చమ్మ దగ్గర అభినయం అన్నీ నచ్చుతాయి.

 

Kanyasulkam_E01C81-D53660
సావిత్రి మధురవాణిపాత్రకోసమే పుట్టినంత సహజంగా చేసింది. పార్వతి వంటి బరువైన పాత్రలు, కుటుంబ కథల గృహిణి పాత్రలు ప్రధానంగా చేసిన సావిత్రి మధురవాణి పాత్రను ఒప్పుకోవడంలో ఆమె అభిరుచి వెల్లడవుతుంది. తర్వాత ఆమె పాత్రను చాలా అధ్యయనం చేసింది. చాలామందితో చర్చించింది. రామప్పంతులు ‘లొట్టిపిట్టలు తెప్పిస్తా’నంటే పడీ పడీ నవ్విన సన్నివేశం గాని, లుబ్దావధాన్ల పిలకను తీసి ఆడదిక్కులేక బావగారు ఇలా అయిపోయారని ఏడిపించడం గాని ఎక్కడైనా సరే నటనలో సంభాషణల్లో ఆమెకు ఆమే సాటి అనిపిస్తుంది. అందరినీ తిప్పలు పెట్టే గిరీశం, రామప్పంతులు వంటివారినే మధురవాణి ఒక ఆట ఆడిస్తుంటే ప్రేక్షకులు కేరింతలు కొట్టేవాళ్లు. ఇక శకుని వంటి పాత్రలకే ప్రాణం పోసిన సిఎస్‌ఆర్‌కు రామప్పంతులు పెద్ద లెక్కలోది కాదు. డాంబికం, దబాయింపు, నక్కజిత్తులు మేళవించి అమోఘంగా పండించారు. విజయవాడలో న్యాయవాదిగా వున్న విన్నకోట రామన్నపంతులు అగ్నిహౌత్రావధాన్ల పాత్రకు ప్రాణ ప్రతిష్టచేశారు. ‘తాంబూలిచ్చాను తన్నుకు చావండి’ వంటి ప్రసిద్ధ సంభాషణలు కూడా గొప్పగాపలికించారు. మహానటుడు గోవిందరాజుల సుబ్బారావుకు అందరికన్నా అధికంగా మార్కులు పడతాయి. కాటికి కాళ్లు చాచుకుని కూడా చిన్నపిల్లను అదికూడా తక్కువ కన్యాశుల్కంతో పెళ్లి చేసుకోవాలనుకున్న ఆయన దురాశ దాన్ని ఉపయోగించుకుని ముప్పుతిప్పలు పెట్టే రామప్పంతులు, మధురవాణి సహాయంతో శిష్యుడికి అమ్మాయి వేషం వేసి మోసం చేసే కరకటశాస్త్రి(వంగర) చెప్పాలంటే ప్రతి ఘట్టం వినోదాన్ని సందేశాన్ని ఏకకాలంలో పండిస్తాయి.

చిత్రంలో దర్శకుడు సమయానుకూలంగా పుత్తడి బొమ్మ పూర్ణమ్మ కథను తెరపై ఆవిష్కరింపచేశారు.అలాగే శ్రీశ్రీ రాసిన ‘ఆనందం ఆర్నవమైత’ే పాటకు నృత్యం పెట్టారు. మల్లాది రామకృష్ణశాస్త్రి రాసిన ‘చిటారు కొమ్మన’ పాట మొత్తం గిరీశం స్వభావానికి తగినట్టు సాగుతుంది. ఈ పాటతో పాటు పూర్ణమ్మ కథను ఘంటసాల(సంగీతమూ ఆయనదే) అద్బుతంగా గానం చేశారు. నాటకరంగంలో గిరీశం పాత్ర పట్ల వున్న అపరిమిత అంచనాల కారణంగా కొంతమంది ప్రముఖులు ఎన్టీఆర్‌ను అంతగా ఆమోదించలేకపోయారు.సంస్కర్త సౌజన్యారావు (గుమ్మడి) చివరలో బుచ్చమ్మకూ గిరీశానికి పెళ్లి చేసినట్టు చూపించడం కూడా శ్రీశ్రీ కొడవటిగంటి తదితరుల విమర్శకు గురైంది. గిరీశం ‘డామిట్‌ కథ అడ్డం తిరిగింది’ అంటూ నిష్క్రమించడం గాక బుచ్చమ్మను పెళ్లి చేసుకున్నట్టు చూపించడంవల్ల గురజాడ ఉద్దేశమే తలకిందులైందని భావించారు. చిత్ర కథ సుఖాంతం చేసినప్పటికీ దానికి ఒక కారణం పెట్టారు. గిరీశం వంటి టక్కరిని దేశం మీద వదలిపెట్టే బదులు బుచ్చమ్మతో పెళ్లిచేస్తే కొంతైనా బాగుపడతాడేమోనని మధురవాణి చెప్పిన సలహా సౌజన్యారావు పాటించినట్టు చూపించారు. వెనక్కు తిరిగి చూసుకుంటే అరవై ఏళ్లకిందట తీసి వుండకపోతే తర్వాత మరెవరూ ఆమాత్రం తీసి వుండేవారు కాదేమో. ఎందుకంటే ప్రసిద్ధ తెలుగు సాంఘిక నాటకాలు చిత్రాలుగా వచ్చింది చాలా తక్కువ. ఆ ఘనత కూడా ‘కన్యాశుల్కం’కే దక్కింది.
ఈ చిత్రం ఇంత బాగా రావడానికి కారణం దర్శకుడు పుల్లయ్య . నలభైలలోనే మంచి పేరు తెచ్చుకున్న పుల్లయ్య ఎన్నో కళాఖండాలను పండించిన వ్యక్తి. తర్వాత తనూ నిర్మాతగా అనేక మంచి చిత్రాలందించారు. తొలుత సరిగ్గా ఆడని ‘కన్యాశుల్కం’ 30 ఏళ్ల తర్వాత విడుదలైనప్పు శతదినోత్సవాలు జరుపుకోవడం ఒక విశేషం. జయాపజయాలు విమర్శలు ఎలా వున్నా ఆ చిత్రం తెలుగు సినిమా చరిత్రలో గురజాడ అడుగుజాడగా మిగిలిపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *