ఆలస్యంగా పరిక్కర్‌ పరాక్రమం

chopper-scam
ఆగష్టా హెలికాప్టర్ల కొనుగోలు కుంభకోణం ముడుపుల కేసులో ఎంతటివారినైనా విడిచిపెట్టే ప్రసక్తిలేదని రక్షణ మంత్రి మనోహర్‌ పరిక్కర్‌ తీవ్రంగా హెచ్చరించారు. మొదటి కుటుంబమైనా ఆఖరి కుటుంబమైనా మాకు ఒకటేనని కూడా అన్యాపదేశంగా సోనియా గాంధీని ఉద్దేశించి అన్నారు. ఇదే విషయమై మూడు రోజుల కిందట రాజ్యసభలో చర్చ జరిగినప్పుడు ఆయన సరిగ్గా మాట్లాడలేకపోయారు. మాజీ రక్షణ మంత్రి, నిజాయితీ పరుడుగా పేరున్న ఎ.కె.ఆంటోనీ వాజ్‌పేయి హయాంలో జరిగిన నిర్ణయాలను తర్వాత తను తీసుకున్న చర్యలను ఏకరువు పెడుతుంటే ప్రభుత్వ పక్షం ఆత్మరక్షణలో వుండిపోయింది. రాజకీయ ప్రత్యర్థిగా వున్నా ఆంటోనీకి అవినీతి ఆపాదించే అవకాశం లేదు. పైగా రక్షణ మంత్రి పరిక్కర్‌ శక్తివంతంగా ఎదుర్కొనే ప్రయత్నం చేయకపోగా లిఖితపూర్వక ప్రకటన చదివి కూచున్నారు. సుబ్రహ్మణ్యస్వామి చాలా వాదించినా పాలకపక్షం వెనకబడిపోయిందని మీడియాలో వ్యాఖ్యలు వచ్చాయి.ఈ లోటును భర్తీ చేసుకోవడానికే ఆయన మరో అవకాశం తీసుకుని చెలరేగిపోయారు. ముడుపులు వైమానిక దళాధిపతి త్యాగికి మాత్రమే పరిమితమైతే ఇంత దూరం వచ్చేది కాదన్నారు. ఎవరో చాలా శక్తివంతులు విచారణ జరక్కుండా అడ్డుకున్నారని ఆరోపించారు. ఈ ఆరోపణల లక్ష్యం ఎవరో స్పష్టమే. అయితే తాము వచ్చాక గడిచిన రెండేళ్లలోనూ ఎందుకు మిన్నకుండిపోయారనేదానికి ప్రభుత్వం దగ్గర సరైన సమాధానం లేదు. కనుకనే ఫరిక్కర్‌ మరోసారి తీవ్రంగా మాట్లాడి హెచ్చరికలు చేశారు. అయితే ఇప్పటికి కూడా ఆలస్యానికి కారణాలు అంతుపట్టడం లేదు. పైగా వాజ్‌పేయి హయాంలోనే హెలికాఫ్టర్‌ ఎత్తు తగ్గించాలని నిర్ణయించారన్న దానిపైనా సమాధానం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *