గ్లోబల్‌ మాయాబజార్‌లో మజ్దూర్‌

గనిలో వనిలో కార్ఖానాలో/ పరిక్లమిస్తూ పరిప్లవిస్తూgal_12648/ధనికస్వామికి దాస్యం చేసే/ యంత్రభూతముల కోరలు తోమే/ కార్మిక ధీరుల కన్నుల నిండా/ కణకణమండే గలగలతొణికే / విలాపాగ్నులకు విషాదాశ్రులకు/ ఖరీదు కట్టే షరాబు లేడోరు! ఎనభై ఏళ్ల కిందట మహాకవి రాసిన వాక్యాలు ఇప్పటికీ ప్రసంగాలలో వినిపిస్తుంటాయి. (సినిమా మాటల్లోనూ పాటల్లోనూ కవులు వాటిని జొప్పించేసి అవార్డుల వరకూ వెళుతుంటారు.ఇదంతా బాగానే వుంది గాని) నిజంగా ఇప్పుడా భావాలు భాష వర్తిస్తాయా? కంప్యూటర్‌ మయమై పోయిన ఈ నెట్‌ యుగంలో కార్మికులు యజమానులు దోపిడీ పీడన ఘర్మజలం కర్మజలం ఔటాప్‌ డేట్‌ కాదూ?
నేడే మేడే అంటూ ఒకప్పుడు మాదల రంగారావు ఎర్రమల్లెలు చిత్రంలో పాడితే పరవశించిన పరిస్థితి ఇప్పుడు ఇంకా వుందా? వాలంటీన్స్‌ డేల కాలంలో కార్మికులు వాళ్లకో మేడో అంతా ట్రాష్‌లా అనిపించదూ?.. విత్‌ ఎ క్లిక్‌ ఆఫ్‌ సెకండ్‌లో కావలసినవి వచ్చేస్తుంటే.. వర్చ్యువాలిటీ విశ్వరూపం దాలుస్తుంటే ఈ కాలం చెల్లిన మాటలు వినేవారెవ్వరు..?
ఇవన్నీ చాలామంది అడిగే ప్రశ్నలే. తలెత్తే సందేహాలే.
చరిత్ర పాఠ్యపుస్తకానికి గైడ్‌ కూడా చరిత్రే. తను లేవనెత్తే సందేహాలకు నడుస్తున్న చరిత్రే ఆన్‌లైన్‌లో సమాధానాలు సమకూరుస్తుంటుంది. ఈ వారం బెంగుళూరులో జరిగిన జౌళికార్మికుల ఆందోళన, ఉద్రిక్తత, ఆ దెబ్బకు కేంద్రం దిగివచ్చి పిఎప్‌పై చేసిన పొరబాటు నిర్ణయాలను వెనక్కు తీసుకోవడం చూశాం. ఈ మధ్య కాలంలో దేశంలో ఏ సమస్యపైనా ఇంత తీవ్ర పోరాటం వెనువెంటనే విజయం మనం చూసి వుండం.
మార్పు నిజం…మార్క్సు నిజం…
‘కారల్‌ మార్క్స్‌ ప్రతీకారం’ అంటూ కథనం ఇచ్చింది ప్రసిద్ద టైమ్స్‌ పత్రిక(2013 మార్చి25). దాని ప్రారంభం ఇలా వుంటుంది: కారల్‌ మార్క్స్‌ మరణించి భూస్థాపితమై పోయాడని భావించబడింది. సోవియట్‌ యూనియన్‌ పతనం, చైనా పెట్టుబడిదారీ విధానంవైపు గొప్పముందంజ వేయడంతో కమ్యూనిజం నిశ్శబ్దంగా పాతకాలపు జేమ్స్‌బాండ్‌ సినిమాలోని నిశ్శబ్ద నేపథ్యంలోకో లేక కిమ్‌ జోంగ్‌ ఉన్‌ పెడసరి మంత్రంలోకో తప్పుకుందనుకున్నారు. చరిత్ర నిర్ణేతగా మార్క్స్‌ నిర్వచించిన వర్గపోరాటం స్వేచ్చా వాణిజ్యం స్వేచ్చా సంస్థల సౌభాగ్య యుగంలో మటుమాయమైపోయిందనుకున్నారు. ప్రపంచీకరణ విస్తార శక్తి, భూగోళంపై అత్యంత మారుమూల ప్రాంతాలను కూడా ఆర్థిక వ్యవహారాలు ఔట్‌సోర్సింగ్‌లు సరిహద్దులు లేని ఉత్పత్తి ప్రక్రియలతో బంధించేసిందనుకున్నారు. సిలికాన్‌ వ్యాలీలో టెక్‌ గురువుల నుంచి చైనా క్షేత్రాల్లో బాలికల వరకూ అందరికీ ధనవంతులయ్యే అవకాశాలు పంచిపెడుతుందనుకున్నారు…. పెట్టుబడిదారీ విధానం అందరికీ సంపదలు సంక్షేమం పంచిపెడతానన్న వాగ్దానం నెరవేర్చుతున్నట్టే కనిపించింది.. లేదా అలా అనుకున్నాం. అయితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సుదీర్ఘ సంక్షోభంలో మునిగిపోవడం, విశ్వ వ్యాపితంగా కార్మికులు ఉద్యోగాలు వూడిపోయి అప్పుల్లో అరకొర ఆదాయాల్లో చిక్కుకుపోవడం చూస్తుంటే పెట్టుబడిదారీ విధానాన్ని చీల్చిచెండాడిన కారల్‌ మార్క్స్‌ నిశిత విమర్శను తీసేయడం సరికాదనితెలుస్తుంది. ఈ వ్యవస్థ సహజసిద్దంగానే అన్యాయమైందనీ, స్వీయ వినాశకమనీ ఆయన చెప్పిన మాట కొట్టేయడానికి లేదన్నది అర్థమవుతుంది…..’
మ్యాన్‌ మెషిన్‌ కాంబినేషన్‌
అయితే అప్పుడెప్పుడో ఆయనచెప్పినట్టే కార్మికులు జీవిస్తున్నారా? యంత్రాలు అన్ని పనులు సులభం చేయలేదా? హైదరాబాద్‌ మెట్రో వంటి మహానిర్మాణం అవలీలగా జరిగిపోవడం లేదా? కంప్యూటర్ల వినియోగంతో శ్రమ తగ్గి నైపుణ్యం నాణ్యత మెరుగుపడలేదా? ఈ క్రమంలో కఠోర శ్రమ అవసరం వుందా? ప్రమాదకరమైన పనులు రోబోలకు అప్పగించేస్తుంటే పనిపరిస్థితులు మారిపోలేదా? ఈ ప్రశ్నలకు ఔననీ కాదనీ కూడా సమాధానం చెప్పాలి. మానవజాతి చరిత్రలో మొదట నిప్పు కనుక్కోవడం తర్వాత చక్రం కనిపెట్టడం గొప్ప మైలురాళ్లు.యాంత్రిక శక్తిని వినియోగించడం మొదలుపెట్టాక పారిశ్రామిక విప్లవం వచ్చేసింది. తర్వాత హరిత విప్లవం.. కంప్యూటర్‌ విప్లవం.. సమాచార విప్లవం.. నానో విప్లవం ఇలా ఏదో ఒకటి వస్తూనే వుంది. ఇందులో ప్రతిదీ మనుషులను తగ్గించి అదే పని యంత్రాలు సాంకేతిక పరికరాల సాయంతో నిర్వహించే సదుపాయం తెచ్చింది. పరిశ్రమల్లో ఉత్పత్తిసాధనాలు, ఇంటి పరికరాలు, రవాణా సమాచార వినోద సాధనాలు అన్నిటినీ వూహాతీతంగా మార్చి వేగం నాణ్యత పెంచింది. గనుల తవ్వకం నుంచి గగన విహారం వరకూ మనుషులు లేకుండానే జరిగే దశ వచ్చింది. కష్టతరమైన శస్త్ర చికిత్స కూడా సాంకేతిక సహాయంతో చేసేస్తున్నారు. కృత్రిమ మేధస్సుకు విచక్షణా శక్తినీ, భావ స్పందనలను కూడా కలిగించబోతున్నారు. నిజమే. కాని ఇవన్నీ చేసినా మనిషికి మరమనిషి ప్రత్యామ్నాయం కావడం జరగదు. వాటిని నిర్మించడానికి నిర్వహించడానికి మనిషి కావలసిందే. అసలు యంత్రం అంటే కూడా ఎప్పుడో నిక్షిప్తమైన మృతశ్రమ తప్ప దానికదే పుట్టుకురాదు.కనుకనే పైన చెప్పుకున్న కొన్ని ప్రయోగాలు అమలు చేయడం లేదు. ఎందుకంటే సాంకేతిక నైపుణ్యం మనకు యంత్రాలను ఇస్తుంది కాని నడిపేది మనిషే. తమకు ఇవ్వబడిన ఆదేశాల ప్రకారం మాత్రమే చెప్పింది చెప్పినట్టు చేసుకుపోతాయి. అంతేగాని తేడాపాడాలు వాటికి తెలియవు. (ఒక వాషింగ్‌ మెషిన్‌ గుడ్డలు ఉతుకుతుంది. నల్లటి తమ్ముడు తెల్లగా అవుతాడని ఒక చిన్నబాబు తమ్ముణ్నిఅందులో వేస్తే ఏంజరిగిందో మనకు తెలుసు.) కనుక మ్యాన్‌ అండ్‌ మెషిన్‌ ఒక కాంబినేషన్‌. ఒకటి వుంటేనే మరొకటి.
మేధా శారీరక శ్రమతో సాంకేతిక పరికరాలను సృష్టించాల్సింది మనుషులే. సృజనాత్మకంగా ఉత్పాదకత పెంచడం ఎలాగో కూడా మనుషులే ఆలోచించాలి తప్ప వాటికవే లక్ష్యాలు నిర్దేశించుకోలేవు. వాటికి కావలసిన సరఫరాలు సమన్వయం మనుషులతోనే జరుగుతుంది. మరలు కూడా ఒక దశవరకే పనిచేస్తాయి. తర్వాత వేడిక్కిపోతాయి. చెడిపోతాయి. ఆగిపోతాయి.ఏదో ఒక ఇంధనం లేకుంటే నడవలేవు. కనుకనే మానవ రహిత మరప్రపంచం వూహించడానికి లేదు.
ప్రపంచమంతటా పెట్టుబడివల
ఇన్ని సాంకేతిక యంత్ర పరికరాలు సృజించడానికి ఉపయోగించడానికి ఆర్థిక కారణాలున్నాయి. మనుషులను తగ్గించి లాభాలు ఉత్పాదకత పెంచుకోవడానికే యాజమాన్యాలు వాటిని తెచ్చాయి. అయితే కార్మికులు పనిభారం తగ్గించాలని న్యాయమైన వేతనాలు ఇవ్వాలని పోరాడతారు గనక వీలైన మేరకు వారినే తగ్గించేయాలి. ఉద్యోగాలు లేని రిజర్వుసైన్యం ఎప్పుడూ అందుబాటులో వుంటే వున్నవారితో తక్కువకు పనిచేయించుకోవచ్చు. లేదంటే తీసిపారేస్తామని బెదిరించవచ్చు. తీసిపారేయొచ్చు కూడా. ప్రపంచీకరణ సరళీకరణ అంటూ రకరకాల పేర్లతో నడుస్తున్న ప్రస్తుత కాలంలో ప్రతిదేశంలోనూ కార్మిక ఉద్యోగ వర్గాలకు భద్రతా నిబందనలు మార్చడానికి తొలగించడానికి కారణం అదే. సాంకేతిక పురోగమనం కారణంగానూ ద్రవ్య పెట్టుబడి సంచారం కారణంగానూమొత్తం ఉత్పత్తి ఒకేచోట చేయవలసిన అవసరం లేకుండా పోయింది. ఒకో దేశంలో ఒకో ముక్క తయారైతే మరెక్కడో అతికిస్తే సరిపోతుంది. ఈ క్రమంలో కార్మికులకు నైపుణ్యం పెరగడానికి సమగ్ర అవగాహన రావడానికి కూడా అవకాశం వుండదు. పైగా ఒకచోట వారు ఎదురుతిరిగితే మరోచోట చేయిస్తామంటారు. కనుక సాంకేతికాభివృద్ధితో పనిసులభం కావడం కాదు. మనుగడకే భరోసా లేకుండా పోతున్నది. పీటర్‌ ఇంగ్లాండ్‌ ట్రేడ్‌ మార్క్‌తో ఇండియాలోనే కుట్టిస్తారు. సుజుకి హర్యానాలో ఉత్పత్తి చేయడమే గాక కార్మికులపై దాడికి కూడా దిగుతుంది.
మేడే మొదలైందే పనిగంటలు తగ్గింపు కోసం. ఎనిమిది గంటలు పని , ఎనిమిది గంటలు విశ్రాంతి, మరో ఎనిమిది గంటలు మా ఇష్టం’ అన్నది వారి నినాదం. 1886లో షికాగోలో ఇందుకోసం జరిగిన ప్రదర్శనపై కాల్పులు జరిపి పలువురి ప్రాణాలు తీశారు. ఆ కార్మిక నాయకులను ఉరికంబాలెక్కించారు. (మేడేను ప్రపంచ కార్మిక దినోత్సవంగా వందేళ్లకు పైబడి జరుపుతున్నాము గాని షికాగోలో మాత్రం కాల్పులు జరిపిన పోలీసులకే అధికారిక స్మారక చిహ్నం వుంటుంది. ఇది ఆ వ్యవస్థ స్వభావం.) నూట ముప్పై ఏళ్ల తర్వాత ఇప్పుడు మనం చెప్పుకునే కంప్యూటర్‌ నిపుణులకైనా పనిగంటల నియమం ఖచ్చితంగా అమలు జరుగుతున్నదా? ఇంటికి కూడా లాప్‌టాప్‌ తీసుకొచ్చి పడకగదిలోనూ హడావుడిగా పనిచేయడం, వర్కింగ్‌ హాలిడేలు చూడ్డం లేదా? నేరుగా ఉద్యోగాలిస్తే నిబంధనలు పనిగంటలు పాటించాలని కాంట్రాక్టు ఔట్‌ సోర్సింగు అంటూ డొంక తిరుగుడుగా దోచుకోవడం రోజూ చూస్తున్నాం. ఇదెంత దూరం పోయిందంటే సాంకేతిక నైపుణ్యానికి మారుపేరుగా చెప్పుకునే జపాన్‌లోనే కరోషి అనే పనివొత్తిడి జబ్బుతో 2015లో దాదాపు 1500 మంది ప్రాణాలు కోల్పోయినట్టు అధికారిక అంచనా. భారత దేశంలోని సాఫ్ట్‌వేర్‌ కేంద్రాలైన హైదరాబాదు, బెంగుళూరు వంటిచోట్ల కూడా యువత జీతాలు బాగా తక్కువైనా ఇతర ఉద్యోగాలలోకి మారిపోతున్నారని హిందూ సవివరమైన కథనం ప్రచురించింది. ప్రపంచీకరణ ఫలితంగా పెట్టుబడులు ప్రవహించి ఉద్యోగావకాశాలు పెరిగిపోతాయన్న అంచనాలు ఇప్పుడు లేవు. అమెరికా నుంచి మనదేశం వరకూ నిరుద్యోగుల లెక్కలు వినిపిస్తున్నాయి. లక్నోలో కొద్ది మాసాల కిందట అతి సాధారణమైన అటెండర్‌ ఉద్యోగాల కోసం 23 లక్షల మంది దరఖాస్తులు చేశారు. వారిలో 25 మంది డాక్టరేట్టు కూడా వున్నారు! చత్తీస్‌ఘర్‌లో ఇలాగే లెక్కకు మిక్కుటంగా 75 వేల దరఖాస్తులు వచ్చేసరికి ఆ ఇంటర్వ్యూలనే రద్దు చేసి పారేశారు.
దేశదేశాల్లో ప్రతిఘటనలు
ఇదంతా పట్టణ ప్రాంతాల్లో దృశ్యం. చితికిపోతున్న వ్యవసాయ రంగం నుంచి, కరువు గ్రామాల నుంచి లక్షలాది మంది పట్టణాలు నగరాలకు వలస వచ్చి నామకార్థపు వేతనాలకు రోజుల తరబడి పనిచేస్తూ నరక యాతన పడుతున్నారు. ఈ ఉద్యోగార్థుల సైన్యాన్ని చూపించి అభద్రతను అస్త్రంగా ప్రయోగించి అరకొర చెల్లింపులతో అహౌరాత్రాలు పీల్చిపిప్పిచేయడం మామూలైపోయింది. హ్యూండారు వాల్‌మార్ట్‌, మోన్‌శాంటో, బ్రూక్‌ఫీల్డ్‌-జాన్‌హౌల్టన్‌ వంటి సంస్థలు అమెరికాలోనూ వాటి వివిధ దేశాల్లో విస్తరించిన వాటి అనుబంధ సంస్థలలోనూ తక్కువ జీతాలతో ఎక్కువ పనిభారం మోపుతున్నట్టు కార్మిక సంఘాలు విమర్శిస్తున్నాయి.జపాన్‌ కొరియాలలోని శ్యాంసంగ్‌, సుజుకి, కొరియన్‌ రైల్‌, శాగ్యాంగ్‌ వంటి ప్రపంచ ప్రసిద్ధ సంస్థల ఉద్యోగులది కూడా అదే అభద్రత. ఎప్‌డిఐల పేరిట వాటిని ఆహ్వానిస్తే మనకు మేలు జరుగుతుందని పాలకులు చెబుతున్నారుగాని వాస్తవంగా జరిగేది ఇక్కడ చౌకగా శ్రమ చేయించుకోవడం, దేశీయ వాణిజ్యాన్ని వ్యవసాయాన్ని దెబ్బ తీయడం జరుగుతుంది. సిగ్‌టూర్‌(సదరన్‌ ఇన్షియేటివ్‌ ఆన్‌ గ్లోబల్‌ అండ్‌ ట్రేడ్‌ యూనియన్‌ రైట్స్‌) మహాసభలో ఆసియా ఆఫ్రికా ఆస్ట్రేలియాలకు చెందిన అన్ని దేశాలలోనూ కార్మికుల హక్కులపై దాడులు పెరుగుతున్నట్టు నివేదించారు. ఒకప్పుడు ప్రభుత్వం కీలకరంగాలలో జోక్యం చేసుకుని మెరుగైన సదుపాయాలు కలిగించితే ఇప్పుడు ప్రభుత్వ సంస్థలు కారుచౌకగా ప్రైవేటు పరం చేయడం ప్రకృతి వనరులైన గనులు భూములు కట్టబెట్టడం సర్వసాధారణమైపోయింది. పైగా ఆ కంపెనీలు అత్యాశకు అనైతిక పద్దతులకు పోయి మూతపడితే ప్రజా ధనంతో బెయిలవుట్‌ ప్యాకేజీలు అమలుచేసి మరింత సొమ్ము కట్టబెడుతున్నారు. ఇదంతా ఒక విషవలయంగా మారుతున్నది. ప్రభుత్వాలు కూడా కాంట్రాక్టు పద్ధతులకు పాల్పడుతున్నాయి . ఖాళీలు భర్తీచేయకుండా అయినవారికి ఔట్‌సోర్సింగు అంటున్నాయి. 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత యూరప్‌ అమెరికాలలో కూడా పొదుపు చర్యల పేరిట కార్మికుల తొలగింపులు మూసివేతలు జీతాల కోతలు అదనపు పనిభారాలు నిత్యకృత్యమైనాయి. వీటిపై జాతీయ సమ్మెలు సమరాలు జరుగుతున్నాయి. లాటిన్‌ అమెరికా దేశాలైన వెనిజులా, బొలీవియా,బ్రెజిల్‌, చిలీ వంటి చోట్ల ఈ పోరాటాలు ప్రభుత్వాల మార్పునకూ ప్రత్యామ్నాయాల ఆవిర్భావానికి కూడా దారితీశాయి. అయితే తర్వాత మళ్లీ ఆ ప్రభుత్వాలను కూడా కూలదోయడం లొంగదీసుకోవడం షరా మామూలే. గ్రీసు,స్పెయిన్‌,పోర్చుగల్‌,బ్రిటన్‌,ఫ్రాన్స్‌,ఇటలీ,ఐస్‌లాండ్‌, బెల్జియం, దక్షిణాఫ్రికా తదితర చాలా దేశాల్లో పెద్ద ఎత్తున కార్మిక పోరాటాలు జరిగాయి.కొన్ని చోట్ల ప్రభుత్వాలు కూడా మారిపోయాయి. అమెరికాలోనే ఆక్యుపై వాల్‌స్ట్రీట్‌ ఉద్యమం వంటిది ఎప్పుడూ వూహించింది కాదు. అక్కడ కూడా 2009 తర్వాత జీతాలు సగటున 4 శాతం తగ్గిపోయాయి తప్ప పెరగలేదు.
శ్రమ ఎక్కువ ప్రతిఫలం తక్కువ
ఈ నేపథ్యంలో సంఘటిత రంగం దెబ్బతినిపోయి అసంఘటిత రంగం అపారంగా విస్తరిస్తున్నది. వీరికి ఏ నియమ నిబందనలు చట్టపరమైన రక్షణలు వుండవు. నూట ముప్పై ఏళ్లకిందట మేడే నాటి పోరాటంతో పనిగంటలు తగ్గించుకుంటే ఇప్పుడు డ్రైవర్లు సెక్యూటిరీ సిబ్బందితో సహా అనేక రకాల వారికి 12 14 గంటలు పని వుంటున్నది. వారాంతపు సెలవులు కూడా హుళక్కి అయ్యాయి. దేశంలో మధ్యాహ్న భోజన పథకంలో 26 లక్షలమంది పనిచేస్తుంటే నెలకు వెయ్యిరూపాయల జీతం అది కూడా క్రమబద్దంగా ఇవ్వని పరిస్థితి చాలా చోట్ల వుంది. సర్వీసు రంగం లాభాలు కురిపిస్తున్నా వాటిలో పనిచేసే వారి సర్వీసు పరిస్థితులు ఘోరంగా వుంటున్నాయి. కార్పొరేట్‌ వైద్యం కామధేనువు కావచ్చు గాని వాటిలో పనిచేసే కింది తరగతుల సిబ్బంది పనిభారానికి అంతూ పంతూ వుండదు. పెద్ద పెద్ద సంస్థలు కూడా మరెవరినుంచో సబ్‌ కాంట్రాక్టులపై సిబ్బందిని తీసుకుంటారు గనక వారు జవాబుదారిగా వుండరు. మునిసిపాలిటీలలో చెత్త కాంట్రాక్టు ఎవరో బడాబాబు తీసుకుంటాడు, మరెవరితోనో చాకిరీ చేయిస్తాడు! ప్రతిదీ ప్రైవేటుకు అప్పగించడం కోసం ప్రభుత్వ రంగమంటేనే పనికిరానిదనే ప్రచారం నడుస్తుంటుంది. ప్రజాధనంతో నిర్మించిన వ్యవస్థలు కారుచౌకగా ప్రైవేటు కంపెనీల పరమైపోతాయి. వాటిలోనివారు వీధిన పడతారు. మళ్లీ కథ మామూలే. ఇది ఒక దేశంలో వ్యవహారం కాదు. తన నిర్ణయాలు తానే తీసుకోగల చైనా వంటి ఏ కొద్ది మినహాయింపులో తప్పిస్తే మిగిలిన అన్ని చోట్లా కార్మికులు ఉద్యోగులు ఈ గ్లోబలిపీఠంపైనే నిలబడివుంటారు. చైనాలో కూడా కమ్యూనిస్టు నాయకత్వం మార్కెట్‌ వ్యవస్థతో మిళితం కావాలనే మార్గం అనుసరిస్తున్నందున ఈ ఒడుదుడుకులు అక్కడా అనివార్యమవుతున్నాయి.ఎల్‌పిజి అంటే లిబరలైజేషన్‌, ప్రైవేటైజేషన్‌, గ్లోబలైజేషన్‌ అని అర్థం చెప్పుకుంటున్నాము గాని వాస్తవానికి దాన్ని లేబర్‌ పించింగ్‌ గేమ్‌!
మనముందు చాలా విలాసవంతంగా కనిపించే ప్రపంచం వెనక విలాపాలు విషాదాలు మర్చిపోకండి. అమెజాన్‌ ప్లిప్‌కార్ట్‌ వెంటనే వస్తువు తీసుకురావచ్చు గాని ఆ సరఫరా గొలుసులో వందల వేల మంది శ్రమ వుంటుంది.. పిజ్జాలు ఇంటికే వస్తాయి గాని ఆ సంస్థల్లోనూ యువత పరుగులు పెడుతుంటారు. ఆతిథ్య సర్వీసు పరిశ్రమలు విస్తరించినకొద్ది వాటిలో శ్రమించేవారి సంఖ్య పని కూడా పెరుగుతుంటాయి. స్త్రీలు పిల్లలను తక్కువ జీతాలకు రకరకాలుగా పీడించి పనిచేయించుకోవడం ఎక్కువవుతుంది. కాదంటే దాన్నే నేరంగా చూపి భారత్‌ వంటి వర్థమాన దేశాల ఉత్పత్తులను అడ్డుకోవడమూ జరుగుతుంది. వారి కత్తికి రెండు వైపులా పదునే!
కేంద్రీకరణతోనే చేటు
భారత్‌ వెలిగిపోతుంది, మేకిన్‌ ఇండియా వంటి ప్రచారాల తర్వాత ఇవన్నీ వింటుంటే నమ్మబుద్ది కాకపోవచ్చు గాని వాస్తవాలు ఇంతకంటే దారుణంగా వున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మునిగిపోయే టైటానిక్‌ లా వుందని హెచ్‌ఎస్‌బిసి కి చెందిన స్టీఫెన్‌ కింగ్‌ వ్యాఖ్యానించారు. చెట్లు లేని చోట ఆముదపు చెట్టులా తప్ప మన ఆర్థిక వ్యవస్థ గొప్పగా సాధించిందనుకోవద్దని రిజర్వు బ్యాంకు గవర్నర్‌ రఘురామ రాజన్‌ హెచ్చరించారు. ఇంత దుర్భర స్తితిలోనూ ఆర్థిక కేంద్రీకరణ పెరిగిపోతున్నది.దేశంలోని ఒక శాతం మంది సంపన్నులే యాభైశాతం పైగా జాతీయాదాయం కలిగివున్నారు. అమెరికాలోనూ పైస్థాయి 158 కుటుంబాలు 1.4 ట్రిలియన్‌ డాలర్ల సంపదలు దేశంలోనూ 2 ట్రిలియన్ల సంపదలు బయిట కలిగివున్నట్టు లెక్కలు తేల్చారు. కొద్దిమంది చేతుల్లో ఇలా అపారమైన సంపదలు గుట్టలు పడివున్నంత కాలం కోటానుకోట్ల మంది సామాన్యులు శ్రమజీవులతో విచక్షణారహితంగా చాకిరీ చేయించడం జరిగిపోతూనే వుంటుంది. వీరికి పొట్టకోసం శ్రమ చేయడం తప్ప మరో గత్యంతరం వుండదు. సాంకేతికాభివృద్ధి వల్ల అటు పైనున్న మేధా శ్రామికులకు కింద కాయకష్టం సాధారణ సేవలు చేసేవారికి పనులు దొరుకుతుంటాయి గాని భద్రత వుండదు. ఇక మధ్యతరగతి ఉద్యోగుల మనుగడకు గండం తప్పదని నిపుణులు చెబుతున్నారు.దానికి విరుగుడు తామూ కంప్యూటర్‌నైపుణ్యం వంటివి పెంచుకుని ఏదో ఒక చోట ఇమిడిపోవడం తప్ప వారికి గత్యంతరం వుండదు. ఇలా జీవన పోరాటం చేస్తూనే పరిస్తితుల మెరుగదల కోసం ప్రభుత్వాల విధానాల మార్పు కోసం వారు పోరాడవలసిందే. దేశదేశాల్లో ఉత్పత్తి విస్తరించి వుంది గనక అందరూ కలసి పోరాడాల్సి వస్తుంది. ప్రపంచ కార్మికులారా ఏకం కండు పోయేదేమీ లేదు సంకెళ్లుతప్ప అన్న మార్క్స్‌ మాట ప్రపంచీకరణ యుగంలో మరింతగా వర్తిస్తుంది. మేడే పిలుపులో ప్రతిధ్వనిస్తుంది. సాంకేతికాభివృద్ధి కారణంగా సామాన్య శ్రామికులతో పాటు ఉన్నత జీవులూ మర మనుషులూ కూడా ఇందులో గొంతు కలిపే రోజు వస్తుంది!

(ఈ వ్యాసంలో కొన్ని భాగాలు మేడేనాడు సాక్షి ఫన్‌డేలో ప్రచురితం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *