పాలేరు ఎన్నిక నల్లేరుమీద నడక కాదు…

symbols1111
ఖమ్మం జిల్లాపాలేరు ఉప ఎన్నిక పాలకపక్షమైన టిఆర్‌ఎస్‌కు నల్లేరు మీద నడకలా వుండదని తెలుసు గనకే ముఖ్యమంత్రి కెసిఆర్‌ సీనియర్‌ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును రంగంలోకి దింపుతున్నారు. మరణించిన కాంగ్రెస్‌ ఎంఎల్‌ఎ మాజీ మంత్రి రాం రెడ్డి వెంకటరెడ్డి సతీమణి సుచరిత అభ్యర్థనకు ఆయన నుంచి స్పందనే రాలేదని కాంగ్రెస్‌ నాయకులు చెబుతున్నారు. విచిత్రంగా వారికి తెలుగుదేశం కూడా మద్దతు లభించింది. సానుభూతిని,కాంగ్రెస్‌ అభ్యర్థనను కారణంగా చూపించింది. ఏది ఏమైనా తెలుగుదేశం పోటీకి శ్రమపడబోదని ముందే తేలిపోయింది. నిర్ణయానికి ముందురోజు ఒక వివాహ విందులో తెలుగుదేశం ముఖ్యులను కలసినప్పుడే పోటీ చేయబోరని అర్థమైంది. అయినా అంతర్గత చర్చల ప్రక్రియ జరిపామనిపించి నిర్ణయం ప్రకటించారు. ఫలితం లేని పోరాటం చేయకుండా పరువు కాపాడుకున్నారు.బరువు తగ్గించుకున్నారు వైసీపీ అద్యక్షుడు జగన్‌ను భట్టి విక్రమార్క కలసి మద్దతు పొందడంలో రెండు రాష్ట్రాల రాజకీయాలకు సంబంధించి చాలా సంకేతాలున్నాయి. ఎపిలో బద్ద విరోధులుగా వుండే తెలుగుదేశం వైసీపీలు ఇక్కడ కాంగ్రెస్‌ను బలపర్చడం విశేషమైతే- టిఆర్‌ఎస్‌తో తమకు బంధాలున్నాయని తెలుగుదేశం నిరంతర ఆరోపణనుంచి బయిటపడటానికి ఈ నిర్నయాన్ని వైసీపీకి వాడుకోవచ్చు. ఈలోగా పువ్వాడ అజరు కుమార్‌ ఫిరాయింపు కాంగ్రెస్‌కు ఒకింత నష్టమైనా పాలేరులో ఆ ప్రభావం పెద్దగా వుండదు.
వాస్తవానికి పాలేరు మొదటి నుంచి కమ్యూనిస్టులకు బలమైన కేంద్రం. చాలాకాలం పాటు రిజర్వుడు నియోజకవర్గంగా వుండింది. అక్కడ 1983లో సిపిఐ, 1985,1994లో( తెలుగుదేశంతో కలసి) సిపిఎం విజయం సాధించాయి. సాధారణ నియోజకవర్గంగా మారాక 2009లో తమ్మినేని వీరభద్రం స్వయంగాపోటీ చేసి కొద్ది తేడాతో ఓడిపోయారు. 2014లో ఇక్కడ సిపిఐ మద్దతుతో విజయం సాధించిన వెంకటరెడ్డికి 47,844 ఓట్లు వస్తే టిడిపి అభ్యర్థి స్వర్ణకుమారికి 47,844,తర్వాత సిపిఎం అభ్యర్థి పోతినేని సుదర్శనరావుకు 44,844 ఓట్లు వచ్చాయి. అప్పట్టో టిఆర్‌ఎస్‌ అభ్యర్థి రావెళ్ల రవీంద్రకు వచ్చింది కేవలం 4041 మాత్రమే. దీన్ని బట్టే అప్పుడు ఆ పార్టీ ఎంత బలహీనంగా వుండిందీ తెలుస్తుంది. అధికారంలోకి రావడం. తుమ్మల ప్రభృతుల చేరిక పరిస్థితిలో చాలా మార్పుకు కారణమై వుండొచ్చు గాని మొత్తం పరిస్థితి తలకిందులుగా మారిపోదు.
తుమ్మలకు అప్పుడు టిడిపికి వచ్చిన ఓట్లన్నీ ఇప్పుడు తుమ్మలకు పడతాయనుకోవడానికి లేదు. వాటిలో కొన్ని కాంగ్రెస్‌కు తోడు కావచ్చు. కాగా ఆపార్టీకి అప్పుడు తోడైన సిపిఐ ఓట్లు ఇప్పుడు సహజంగానే సిపిఎంకు కలుస్తాయి. అంతేగాక మరికొన్ని ప్రజాసంఘాలు వామపక్ష గ్రూపులు కూడా దాన్ని బలపర్చే అవకాశాలున్నాయి. కనుక కమ్యూనిస్టుల నుంచి కూడా గట్టి పోటీ తప్పనిసరి. ఈ త్రిముఖ సమరంలో తుమ్మల నెగ్గుకురావడానికి కేవలం కెసిఆర్‌ మంత్రమే సరిపోదు.
టిఆర్‌ఎస్‌కు మొదటినుంచి ఖమ్మం బలమైన కేంద్రం కాదనేది ఒకటైతే ఈ కాలంలో పెరిగిన అసంతృప్తి కూడా ప్రభావం చూపిస్తుంది. ఖమ్మం కార్పొరేషన్‌లోనూ, సిద్దిపేట మునిసిపాలిటిలోనూ కూడా టిఆర్‌ఎస్‌ జిహెచ్‌ఎంసిలో వలె మొత్తం తుడిచిపెట్టింది లేదని గుర్తించాలి. నిజానికి ఈ విషయమై నిర్ణయం తీసుకోవడానికి సమావేశమైనప్పుడు టిఆర్‌ఎస్‌ ప్రభుత్వ ముఖ్యులు కూడా మీరే పార్టీ కదా అంటూ కెసిఆర్‌పైనే భారం వేసినట్టు అధికార వర్గాలుచెప్పాయి. బలహీనమైన చోట్ల ఏ మేరకు నిలదొక్కుకున్నామో తెలుసుకోవడానికి పాలేరును ఒక పరీక్షగా తీసుకోవాలని ఆయన అభిప్రాయపడుతున్నట్టు చెబుతున్నారు. కనుక తెలంగాణలో భావి సమీకరణాలకు పాలేరు సంకేతం కానుందని ఖాయంగా చెప్పొచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *