కేంద్రమూ, తెలుగు రాష్ట్రాల దోబూచులాట

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు, కేంద్రంలోని బిజెపి ఎన్డిఎ ప్రభుత్వం స్వీయ రాజకీయ ప్రయోజనాలకే పెద్దపీట వేయడం వల్ల వాస్తవంగా జరుగుతున్నదేమిటో ప్రజలకు స్పష్టం కావడం లేదు. మూడు చోట్ల అధికారంలో వున్న తెలుగుదేశం, టిఆర్ఎస్, బిజెపి పార్టీల వ్యూహ ప్రతివ్యూహాలను బట్టి మాటలు మారిపోతున్నాయి గాని నిజమైన మార్పులు సమస్యల పరిష్కారాలు అర్థం కావడం లేదు. రాజ్యాంగ బద్దంగా చట్ట ప్రకారం జరగాల్సిన పాలనా వ్యవహారాలు కూడా రాజకీయ పాచికలుగా మారిపోతున్న పరిస్థితిలో ఏది ఎంత వరకూ తీసుకోవాలో కూడా తెలియని విచిత్ర పరిస్థితి ఏర్పడింది.ఈ మధ్య బిజెపి స్వంతంగా ఎదగాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో విమర్శల జోరు పెంచింది గాని ప్రభుత్వాల మధ్య మాత్రం ప్రహసనాలే నడుస్తున్నాయి.
ఎపికి ప్రత్యేక హౌదా ప్రత్యేక ప్యాకేజీ ఆర్థిక సహాయం వంటి అంశాలలో టిడిపి బిజెపిల మధ్య దోబూచులాట నడుస్తున్నది. సహాయం రాలేదని ఒకసారి చెప్పడం మరోవైపున ఫర్వాలేదంటూ సన్నాయి నొక్కులు నొక్కడం ఒక ప్రహసనంగా మారింది.ఇచ్చిన దానికి లెక్కలు చెప్పలేదని నిధులు మళ్లించారని బిజెపిలో కొందరు ఆరోపిస్తున్నారు గాని ప్రభుత్వంలో వున్నవారు మరో విధంగా మాట్లాడుతున్నారు. రెవెన్యూ లోటు భర్తీకి సహాయం రాలేదన్నది మాత్రం వాస్తవం. ఇక ప్రత్యేక హౌదా లేదా ప్యాకేజీ విషయంలోనూ హళ్లికి హళ్లి సున్నకు సున్న అన్నట్టు తయారైంది.ప్రత్యేక హౌదా విషయం నీటి ఆయోగ్ చూసుకుంటుందని ఒకసారి, ఇప్పటికే నివేదిక అందిందని మరోసారి చెప్పారు. తీరా మొన్న నీటిఆయోగ్ ఉపాద్యక్షుడు అరవింద్ పనగారియా హైదరాబాద్ వచ్చినప్పుడు అది తమకు సంబంధం లేనిదని తేల్చిచెప్పారు. మరైతే ఇంత కాలం చెప్పినవి అసత్యాలా? హౌదా కన్నా ప్యాకేజీ మిన్న అన్నవారు అదైనా ఎందుకు తేలేకపోతున్నారు? విశాఖ రైల్వే డివిజన్ వంటి మామూలు నిర్ణయం కూడా ఎందుకు జరగడం లేదు? వెంకయ్య నాయుడు వంటి సీనియర్ మంత్రి రకరకాలుగా మాట్లాడ్డమే తప్ప నిజంగా తనే కోరిన హౌదాను ప్యాకేజీని ఇవ్వకపోవడంపై ఎందుకు మౌనం పాటిస్తున్నారు? ముఖ్యమంత్రి లేదా ఇతరులు ఆయన పాత్రను ఎందుకు ప్రశ్నించరు?
లక్షన్నర కోట్లు తాము ఇప్పటికే ఇచ్చామని బిజెపి అద్యక్షుడు అమిత్ షా రాజమండ్రి సభలో ప్రకటించారు. అందులో అనేక అవాస్తవాలు అసందర్భ అంశాలు కలిపారు కూడా. మేము ఎన్ని ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు చెప్పడం లేదని దారి మళ్లిస్తున్నదని బిజెపి నాయకులు చాలామంది తీవ్రంగా విమర్శిస్తున్నారు. రాజధాని అమరావతికి తాము వేల కోట్లు విడుదల చేస్తే విదేశీ సంస్థలకు అప్పగించాల్సిన అవసరమేమొచ్చిందని బిజెపి నేతలు విమర్శిస్తారేగాని కేంద్రం అదే మాట అధికారికంగా ఎందుకు అడగదు? ఎందుకు తన సహాయంతో ముందుకొచ్చి చొరవ తీసుకోదు? తెలుగుదేశం నాయకులు దీనిపై రాజకీయంగా తప్ప పాలనా పరంగా పెద్దగా స్పందించరు. నిజానికి కేంద్రంలో తెలుగుదేశం రాష్ట్రంలో బిజెపి పరిపాలనలో భాగస్వాములుగా వుంటూ ఇలా అనుకోవడంలో అర్థమేమిటి?ఇదంతా దాగుడుమూతల వ్యవహారం కాదా?తెలుగుదేశంతో సంబంధాలు తెంచుకుని స్వంతంగా ఎదగాలన్న కాంక్షతోనే బిజెపి ఇదంతా చేస్తుందనే తెలుగుదేశం రాజకీయంగా ఆ విషయమైనా చెబుతున్నదా?వీరు కలిసి వున్నా విడిపోయినా వారి ఇష్టం గాని రాజ్యాంగ బద్దమైన విషయాలపై తలొక విధంగా మాట్లాడుతూనే కలసి వుండటం ఎలా సాధ్యమవుతున్నది? ప్రతిపక్ష వైసీపీ కూడా తనవైన కారణాల వల్ల కేంద్రాన్ని బిజెపిని పెద్దగా విమర్శించడానికి సిద్ధం కాదు. టిఆర్ఎస్ విషయంలోనూ కేంద్రంతో మంచిగా వుండాలని వీలైతే మంత్రివర్గంలో చోటు సంపాదించాలనే వారున్నారు. ఆ అవకాశం లేదనే వారున్నారు. ఏమైనా కేంద్రంతో మంచిగా వుంటేనే పనులు జరుగుతాయన్న భావం బలంగా వుంది. అందుకే ఎంపిలు కొంతవరకూ పోరాడటం తప్ప ఖచ్చితమైన విమర్శలు వినిపించవు. లౌకికతత్వం,అసహనం వంటి సమస్యలపై అసలే మౌనం వహిస్తారు.
విభజన తర్వాత కూడా కొన్ని తేడాలు మినహా ఒకే రాజకీయ ఆర్థిక నమూనా అమలవుతున్నది. అటూ ఇటూ యథేచ్చగా ఫిరాయింపులు జరిగిపోతున్నాయంటే కారణం అదే. వ్యాపార వర్గాలు పెట్టుబడిదారులకైతే రెండు చోట్ల నిరంతరం తలుపులు తెరిచే వుంటున్నాయి పార్టీలు మారినా సరిహద్దులు మారినా కార్పొరేట్ రాజకీయాల్లోనూ ధనాఢ్య శక్తుల విన్యాసాల్లోనూ ప్రచారార్బాల్లోనూ పెద్ద తేడా లేదు. వడదెబ్బ మృతులు దేశంలో కెల్లా తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువగా నమోదైనారు. కరువు కోరలు సాచి కాటు వేస్తున్నది. మంచినీటి కొరత వేధిస్తున్నది. కుల రాజకీయాలు కుబుసం విడుస్తున్నాయి. అధికారికంగానే వాస్తుతో సహా అశాస్త్రీయ విశ్వాసాలను అందలమెక్కిస్తున్నారు. మీడియాధిపతులు, అగ్రతారలు, కుబేర వర్గాలు షరామామూలుగా చలామణి కాగలుగుతున్నారు. రాజకీయ ఆర్థిక ప్రాబల్య వర్గాలు ఇరు రాష్ట్రాల్లోనూ తమ ఆటలు సాగించుకుంటున్నారు గనకే గందరగోళ పరిస్థితులు తాండవిస్తున్నాయి.వీటి మధ్య ప్రజల తక్షణ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం జరగాలంటే ప్రజలు చైతన్యంతో ఉద్యమించకుండా సాధ్యం కాదు. ఫిరాయింపులు ఠలాయింపులు పెత్తనాల విస్తరణ, ప్రైవేటు సంస్థల బాంధవ్యాలు ప్రధనంగా వున్న ప్రభుత్వాలేవైనా తేలిగ్గా మాట వినడం వుండదు.