కెటిఆర్‌ ‘వారసత్వం’పౖనా తుమ్మల అక్షేపణ

trs trio
భారత దేశంలో వారసత్వ రాజకీయాలు కొత్త కాదు గాని కెటిఆర్‌ విషయంలో తండ్రి ముఖ్యమంత్రి కెసిఆర్‌ మరీ తొందరపడి ఇతరులలో ఆందోళనకు కారణమైనారు. జిహెచ్‌ఎంసి ఎన్నికలను అవకాశంగా తీసుకుని కెటిఆర్‌ను సంపూర్ణంగా ప్రతిష్టించిన కెసిఆర్‌ తర్వాత కూడా దాన్ని కొనసాగిస్తున్నారు.కెటిఆర్‌ ఉద్యమంలో పాల్గొనడం ఎన్నికల్లో విజయాలు సాధించడం నిజమే. బాగా మాట్లాడగల ఆధునికత వుందనే మాటా నిజమే. ఇది అన్ని ప్రాంతీయ పార్టీల్లో జరిగేదే అయినా తగు రాజకీయ భూమిక తయారు చేసుకోకుండా ఉన్నఫలాన ముందుకు తేవడం సమస్యలు తెచ్చింది. అందరూ హరీశ్‌రావుపై దీని ప్రభావం గురించి ఆలోచిస్తుండగా అనుకోని విధంగా సీనియర్‌ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తొలి అసమ్మతి స్వరం వినిపించారు. సోషల్‌ మీడియాలోనూ పత్రికల్లోనూ వచ్చిన ఈ వ్యాఖ్య అందరి దృష్టినీ ఇంకా ఆకర్షించినట్టు లేదు. తన అంతర్గత వ్యూహాలకు బాగా ఉపయోగపడతారనే కెసిఆర్‌ తుమ్మల తలసాని వంటివారిని తెచ్చుకున్నారని మొదట్లోనే అంతా భావించారు. తన తర్వాత హరీశ్‌ అనే పరిస్థితి లేకుండా ముందు తెలుగుదేశంలోని పాత మిత్రులను తీసుకొచ్చారని అప్పట్లో పార్టీ వర్గాల వివరణగా వుండేది.వారు అలాటి మద్దతునిచ్చారు కూడా. అయితే
పాలేరులో మంత్రి తుమ్మల నాగేశ్వరరావును పోటీకి నిలపాలని ముఖ్యమంత్రి నిర్ణయించడం ఒక రాజకీయంగా సవాలుగా మారింది. మంత్రివర్గంలో కీలకపాత్ర పోషిస్తూ కాలం గడుపుతున్న స్థితిలో మళ్లీ వ్యయ ప్రయాసలు అనివార్యంగా వుండే ఉత్కంఠలు ఎదుర్కొనాల్సి వచ్చింది. పైగా ఇన్‌చార్జిగా కెటిఆర్‌ను నియమించడం ఆయన వంటి సీనియర్‌కు మింగుడు పడేది కాదు. ప్రతిఎన్నికకు ఎవరినో ఇన్‌చార్జిగా పెట్టడం ఆనవాయితీ అని ఆయన జవాబివ్వడంలోనే కెటిఆర్‌కు ఏ ప్రత్యేకత లేదని చెప్పినట్టయింది. ఎవరినో లాంచనంగా నియమించడానికి కెటిఆర్‌కు బాధ్యతలు అప్పగించడానికి తేడా వుంది.ఈ నేపథ్యంలోనే తుమ్మల వారసత్వ రాజకీయాలపై అసమ్మతి వ్యక్తం చేయడం ఆసక్తిరేపింది.
కెసిఆర్‌ నాయకత్వంలో నడుస్తాం గాని వారసత్వ రాజకీయాలను బలపర్చబోనని ఆయన టివి9 ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పారు. కెటిఆర్‌ను కూడానా అని మురళీకృష్ణ మరోసారి అడిగినప్పుడు నా వారసత్వాన్నే నేను బలపర్చనప్పుడు మరెవరినో ఎలా సపోర్టు చేస్తాను అని ఎదురు ప్రశ్న వేశారు. సోషల్‌ మీడియాలోనూ పత్రికల్లోనూ వచ్చిన ఈ వ్యాఖ్య అందరి దృష్టినీ ఇంకా ఆకర్షించినట్టు లేదు. పైగా ఏదో సవరణో వివరణో ఎలాగూ వుంటుంది.అయితే టిఆర్‌ఎస్‌లో ఈ వ్యాఖ్య ఎవరూ వూహించంది. కాగల కార్యం గంధర్వులు తీర్చారని హరీశ్‌ రావు శిబిరం దీనిపై సంతోషించవచ్చు. రాజకీయాలలో ఏకపక్ష వ్యవహారాలు ఎంతో కాలం నడిచేవి కావు. ప్రతి దానికి ఒక ప్రక్రియ పరిణామ క్రమం వుండకతప్పదు. కృత్రిమంగా చేసే పనులన్నిటికి ఏదో ఒక మూలనుంచి అసమ్మతి వినిపిస్తూనే వుంటుంది. ఇతర పార్టీలను మటుమాయం చేసే పనిలో కెసిఆర్‌ బిజీగా వుండగా స్వగృహంలోనే ధిక్కార స్వరం వినిపించడాన్ని విస్మరించడానికి లేదు.రేపు మంత్రివర్గ మార్పుల తర్వాత ఆశాభంగం చెందిన వారు ఇతర అసంతృప్త నేతలు కూడా దీన్నొక సంకేతంగా తీసుకునే అవకాశం వుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *