ఉత్తరాఖండ్ వూరటలో ‘వురుకులాట’

ఉత్తరాఖండ్లో రాష్ట్రపతి పాలన విధింపు రద్దుచేసిన రాష్ట్ర హైకోర్టు ఆదేశాలపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది. దాంతో రాష్ట్రపతి పాలన పునరుద్ధరించబడి హరిష్ రావత్ ఒక్కరాత్రితో మళ్లీ మాజీ అయిపోయారు. దీంతో ఆయనను ఒకేఒక్కడు సినిమాలో అర్జున్తో(హిందీలో అనిల్ కపూర్ నాయక్తో) పోలుస్తూ హిందూస్తాన్ టైమ్స్ కథనం ఇచ్చింది.ఏమంటే రావత్ 2014లో తనకు ఆ సినిమా బాగా నచ్చిందని చెప్పారట. దాంట్లోలాగే ఒక్కరోజులో చాలా పనులు చేస్తానని కూడా ప్రకటించారట.ఆప్పటి సంగతిఏమోగాని హైకోర్టు తీర్పు తర్వాత ఒక్కరోజులోనే మంత్రివర్గ సమావేశంలో 153 కోట్ల విలువైన నిర్ణయాలు చేశారు. ఆ కాస్త వ్యవధిలోనే ఉపాధ్యాయుల ధర్నాకు వెళ్లి వచ్చారు! ఇప్పుడు మళ్లీ మాజీ అయిపోయారు.
మరోవైపున భారతీయ జనతాపార్టీ కూడా తనదైన హడావుడిలో మునిగిపోయింది. హైకోర్టు తీర్పు చెంపపెట్టు అనే విమర్శతో ఆత్మరక్షణలో పడినా గంభీరంగా వ్యవహరించిన ఆ పార్టీకి ఈ స్టే వూరట నిచ్చింది. అయితే అది సాంకేతికమే. హైకోర్టుతీర్పు లిఖితప్రతి లేదు గనక చూసేవరకు తను ఏ తీర్పు ఇవ్వలేనన్న కారణంతోనే సుప్రీం స్టే ఇచ్చింది. అది కూడా 27 వరకే. అంటే 29న బలపరీక్ష యథావిధిగానే వుండొచ్చని బిజెపికి తెలుసు. కనుకనే హడావుడిగా ఎంఎల్ఎలను కూడగట్టే పనిలో నిమగమైంది. 71 మంది సభ్యులున్న శాసనసభలో 9 మంది ఫిరాయింపు అనర్హత ఎంఎల్ఎల భవిష్యత్తు ఇంకా అస్పష్టమే.మిగిలిన 62లో 29 కాంగ్రెస్, 27 బిజెపి. ముగ్గురు ఇండిపెండెట్ల పిడిఎప్ గతంలో కాంగ్రెస్తో వుండగా తనవైపు తిప్పుకోవడానికి బిజెపి తంటాలు పడుతున్నది. బిఎస్పికిచెందిన ఇద్దరు క్రాంతిదళ్కు చెందిన ఒక్కరిని తిప్పుకోవడానికి అన్ని పాచికలు వేస్తున్నది. సుప్రీం కోర్టు ఈ సమయాన్ని రాజకీయ బేరసారాలకు వాడుకోరాదని హెచ్చరించినా ఎవరు ఖాతరు చేస్తారు? ఇన్ని మల్లగుల్లాల మధ్య ఉత్తరాఖండ్ ఏమవుతుందో సుప్రీం చివరకు ఏం చెబుతుందో చూడాల్సిందే.