డా. కన్నయ్యపై వీరసైనికుల ఘోర తెలివి!

kanhyaa222
కక్ష హద్దుమీరితే విచక్షణ మంటగలిసిపోతుంది. జెఎన్‌యు విద్యార్థి నాయకుడు కన్నయ్య కుమార్‌ విషయంలో సంఘ పరివార్‌ పరిస్థితి అలాగే వుంది. ఆ కుర్రాడి పేరెత్తితే వారు వెర్రెత్తిపోతున్నారు. అయితే ో వారిలో కొందరు ఆ కోపోద్రేకంలో కనీస పరిజ్ఞానాన్ని కూడా ప్రదర్శించలేకపోవడం, చెప్పినా చెవికెక్కించుకోకపోవడం విపరీతమనిపిస్తుంది. కన్నయ్య కుమార్‌ జెఎన్‌యులో సాహిత్యంలో డాక్టరేట్‌ చేస్తున్నారని ఈపాటికి అందరికీ తెలిసిపోయి వుంటుంది. హిందూత్వ కూటమికి చెందిన కొందరు ఈ డాక్టరేట్‌ డిగ్రీ చూసి వింత విమర్శ ప్రారంభించారు. ఇలాటి ద్రోహి రేపు డాక్టర్‌ అయిన తర్వాత అమ్మానాన్నలకు మాత్రం వైద్యం చేస్తాడా అని ఆవేశంగా అడుగుతున్నారు. 23న కన్నయ్య ముంబాయి వస్తున్న సందర్భంగా తనను రావద్దని హెచ్చరించడానికి వస్తే మళ్లీ మామూలుగా తిరిగివెళ్లలేవని బెదిరించడానికి వారు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. వీర్‌సేన నాయకుడు నిరంజన్‌ పాల్‌ ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశమాతను ప్రేమించలేని కన్నయ్య తన తల్లిదండ్రులకు మాత్రం వైద్యం చేయగలడా అని విమర్శించడం మొదలుపెట్టారు. వెంటనే విలేకరులు ఆయన వైద్యం చదవడం లేదు, సాహిత్య పరిశోధన చేస్తున్నాడని వివరించే ప్రయత్నం చేశారు. అయినా అర్థం చేసుకోకపోగా ఏదైతేనేం అంటూ మొండిగా తమ వాదన కొనసాగించారు. ఇక హిందూ గోరంగ్‌ రక్షణ సమితి తరపున వైభవ్‌దత్‌ మాట్లాడుతూ అలాటివారిని అసలు దేశంలోనే వుండనివ్వకూడదని ధ్వజమెత్తారు. మరో న్యాయవాది మాట్లాడుతూ చట్టరీత్యానే కన్నయ్యను అడ్డుకోవడానికి తమ ప్రయత్నం కొనసాగిస్తామన్నారు. మొత్తంపైన ఈ తరహా కక్ష సాధింపునకు ఎవరు వైద్యం చేయాలో? కన్నయ్య లాటి యువతే కదా!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *