అమెరికాలో సిక్కుల నిరసన

అమెరికాలో పెరుగుతున్న అసహన వాతావరణంపై సిక్కులు ఆగ్రహావేదనలు వ్యక్తం చేశారు. వైశాఖి పండగ సందర్భంగా వారంతా టైమ్ స్క్వేర్‌లో చేరి నిరసన తెలిపారు. తమను వేరుగా చూడటం, వేధించడం, దాడులు పెరిగిపోతున్నాయని సిక్కులు చెబుతున్నారు. 2014లో ఒక కుమారుడి దగ్గర వుందామని వచ్చిన ఒక సిక్కు వృద్ధుడు పోలీసుల కాల్పులకు గురైనాడు. విస్కాన్సిన్‌లోని ఒక్‌గ్రీక్ గురుద్వారాలో 2012లో దుండగులు ఆరుగురు సిక్కులను కాల్చిచంపారు. ఇటీవలనే అమెరికా విమానం నుంచి ఒకసారి సిక్కు కమెడియన్‌ను మరోసారి ఇద్దరు సిక్కు ప్రయాణీకులను అకారణంగా దించేశారు. అమెరికా సైన్యంలో మొదటి నుంచి సిక్కులకు ప్రవేశం వుండగా ఇప్పుడు గడ్డం తలపాగా తీసేయాలని షరతుపెడుతున్నారు. అవి తమలో భాగమై పోయాయని చెబితే వినిపించుకోవడం లేదు. దీనిపై కోర్టులో కేసు నడుస్తున్నది. అమెరికాలో మొత్తం అయిదులక్షల మంది వరకూ సిక్కులు వుంటారని అంచనా. కెనడాలో వీరు మరింత పెద్ద సంఖ్యలో వుండటమే గాక ఆదేశ పార్లమెంటు వైశాఖి పండు
గను అధికారికంగా గుర్తించింది. కాని పొరుగునే వున్న అమెరికా మాత్రం సెప్టెంబరు 11 ఘటనల తర్వాత తమను అనుమానంగా చూడటం సరికాదని టైమ్ స్క్వేర్‌లో చేరిన వేలాది మంది నినదించారు. ఈ సందర్భంగా అత్యంత పరుగుల యంత్రం మిల్కాసింగ్ హాజరవడం ప్రత్యేక ఆకర్షణగా తయారైంది. గడ్డం తలపాగా అన్నవి తమ జీవితంలో భాగాలే తప్ప అపాయకరమైనవి కావని సిక్కులు చెబుతున్నా జాత్యహంకారం వలసదారుల వ్యతిరేక ప్రచారం వారిపై దాడులకు కారణమవుతున్నాయి. ఒకప్పుడు నరేంద్ర మోడీ హయాంలో గుజరాత్‌లో మారణకాండ జరిగినందుకు ఆయనకు వీసా నిరాకరిస్తే అందరం ఖండించాం. అంతర్గత వ్యవహారాలలో జోక్యం తగదని విమర్శించాం. అలాటి అమెరికాలోనే ఇప్పుడు ఇంతలి ఉద్రిక్తత ఏర్పడటాన్ని ఎలా అర్థం చేసుకునేట్టు?