కాశ్మీర్లో కార్చిచ్చు

విశ్వ విద్యాలయాల్లో వివాదాలు విద్వేషాలు పెరిగిన ఫలితం ఇప్పుడు కీలకమైన సరిహద్దు రాష్ట్రం జమ్మూకాశ్మీర్‌లోనూ కార్చిచ్చుగా మారింది. క్రికెట్ మ్యాచ్ జయాపజయాల వివాదం చివరకు కాశ్మీరీ కాశ్మీరీయేతరుల సమరంగా మారింది. శ్రీనగర్ ఎన్ఐటిలో మొదలైన ఘర్షణ విస్తరించి కాల్పుల వరకూ వెళ్లింది. అనంతనాగ్‌లో, హంద్వారా కుప్వారాలలో ఇప్పటికి ముగ్గురు కాల్పులలో మరణించారు. ఈ కాల్పులు జరిపింది పోలీసులా సైనికులా అనేదానిపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రాంతమంతటా కర్ఫ్యూ వాతావరణం నెలకొన్నది. శ్రీనగర్ నిట్ ఘటనల తర్వాత దేశం ఇతర ప్రాంతాలలో కాశ్మీరీలపై దాడులు చేస్తున్నందుకు నిరసనగా బంద్‌గా మొదలైన ఆందోళన తర్వాత ఘర్సణలకు కాల్పులకు దారితీసింది. ఒక యువతిపట్ల సాయుధలు అసభ్యంగాప్రవర్తించారన్న వార్తలు ఆగ్రహం పెంచాయి. అయితే తనపై అలాటిదేమీ జరగలేదని ఆ అమ్మాయితో పోలీసులు విడియోలో చెప్పిండచం కూడా విమర్శలకు కారణమైంది.మామూలుగా మహిళలతో అలాటివి చెప్పించడాన్ని అనుమతించరు. ఈ కాల్పుల సమయంలో నిబంధనలు సరిగ్గా పాటించారా లేదా అనేదానిపైనా దర్యాప్తు జరిపించాలని పోలీసులు అంగీకరించారు. ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి రక్షణ మంత్రి మనోహర్ పరిక్కర్‌తో సమావేశమై విచారణ జరిపి నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మిగిలిన చోట్లకు కాశ్మీర్‌కు మధ్య గల తేడాను గుర్తించకుండా కావాలని సమస్యను పెద్దది చేసిన ఫలితం ఇప్పుడు ఎలా పరిణమిస్తుందోనని పరిశీలకులు ఆందోళన చెందుతున్నారు.