జై కొట్టాల్సిన పనిలేదన్న జంగ్
కోర్టులో ప్రతిదానికీ బే అనమని సలహా ఇచ్చిన లాయరు కేసు గెలిచాక ఫీజు అడిగితే క్లయింటు నీకూ బే నీ అబ్బకు బే అన్నాడనే కథ మనం చెప్పుకుంటూనే వుంటాం. ఇప్పుడు దేశరాజధాని ఢిల్లీలో బిజెపి కథ అలాగే అయింది. లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ప్రతి విషయంలోనూ ఆప్ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో గొడవ పడి చికాకులు కలిగిస్తుంటే కేంద్రానికి అనుకూలంగా వుండేది. నియామకాలు నిర్ణయాల విషయంలోనూ ఈ ప్రతిష్టంభన కావాలనే కొనసాగిస్తున్న జంగ్‌ను హౌం శాఖ వెనకేసుకొచ్చేది. కేజ్రీవాల్ తనపై విమర్శలు చేసినా ఫర్వాలేదనీ, తామిద్దరం చేసిన పదవీ ప్రమాణాలు వేర్వేరని జంగ్ ఇండియా టుడే ఇంటర్వ్యూలో చెప్పారు. భారత్ మాతాకు జై నినాదంపై వివాదం గురించి అడిగితే అలా అని తీరాలని షరతు పెట్టడం సరికాదని నజీబ్ జంగ్ గట్టిగా చెప్పారు. అలా అనడానికి తనకు అభ్యంతరం లేదుగాని దాన్ని పూజించడంగా చెప్పలేమని అన్నారు. దేశాన్ని ప్రేమించడానికి దేవతగా పూజించడానికి తేడా వుంది. ఈ విషయమై ఎలాటి ఒత్తిళ్లు అవసరం లేదు. ఇది కావాలని సృష్టించిన వివాదం అని స్పష్టీకరించారు. జెఎన్‌యులోకి పోలీసులను పిలిపించి నిర్వాహకులు తప్పు చేశారని ఆయన అభిప్రాయపడ్డారు.
