అసహన స్వాములూ! శనిదోష నివారణ అసత్యమా!!
అజ్ఞానులకు అసహనం వుంటే అర్థంచేసుకోవచ్చు. లౌకిక వ్యవహారాల లంపటంలో తలమునకలయ్యే సామాన్య మానవులు క్రోధానికి లోనవచ్చు. కాని సర్వసంగ పరిత్యాగులుగా సంయమనానికి మారుపేర్లుగా పూజలందుకునే స్వామీజీలు కూడా ఇష్టానుసారం మాట్లాడ్డం దారుణం. ద్వారకలోని శంకరాచార్య పీఠాధిపతి స్వామి స్వరూపానంద సరస్వతి మొదటినుంచి వివాదాలకు పెట్టింది పేరు. తరతరాలుగా దేశంలో లక్షలాదిమంది పూజలందుకుంటున్న షిర్ది సాయిబాబాపై స్వరూపుల వారికి మహాగ్రహం మిన్నంటుతుంది. ఆయనను పూజించడం అరిష్టమని గతంలో ఒకసారి వారు ఫర్మానా జారీ చేసినా పట్టించుకున్న వారు లేరు. సంస్కర్తగా సామాన్యుల వేల్పుగా మత సామరస్యానికి మారుపేరుగా షిర్దిసాయిబాబాను ప్రజలు పూజిస్తూనే వున్నారు. అది వారి వారి వ్యక్తిగత విశ్వాసం. అయితే స్వరూపానందులవారు మాత్రం షిర్దిబాబా అంటేనే చిందులు తొక్కేస్తారు. ఆయనను కొలవడం వల్లనే మహారాష్ట్రలో కరువు వచ్చిందని తాజాగా వారు వాకృచ్చారు! దేశంలోని తొమ్మిది రాష్ట్రాల్లోనూ ఈ కారణంగానే వచ్చిందా మరి దీనికి విరుగుడుగా షిర్దిబాబాను వదలిపెట్టి స్వరూపుల వారిని కొలిస్తే సరిపోతుందా కూడా చెప్పాల్సింది!
ఇంతకంటే దారుణం స్వామి వారి స్త్రీ ద్వేషం. శనిసిగ్నాపూర్ వంటి చోట్ల ఆలస్యంగానైనా మహిళలను అనుమతించినందుకు అందరూ సంతోషిస్తుంటే ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నారీ స్వాముల వారు. ఈ విధంగా వారిని లోపలికి అనుమతించడం వల్ల అత్యాచారాలు(రేప్‌లు) పెరిగిపోతాయని ఈ స్వామీజీ నామధేయుల వువాచ. నిజంగా వారు కొలిచే దేవుడికి అంత సమీపంగా వెళితే మహిమ మరింత ప్రబావం చూపాలి గాని రేప్‌లు పెరగడమేమిటి? ఎందుకు? అసలు స్వాములు ఇలాటి మాటలు మాట్లాడవచ్చునా? శనిని పూజించడం వల్ల స్త్రీలకు అంత నష్టం జరిగేట్టయితే శనిదోష నివారణ పేరిట లక్షలు లక్షలు లాగి పరిహారాలు శాంతులు చేయించే ప్రబుద్ధుల సంగతేమిటి. అంతా హుళక్కేనా?