మహారచయిత గోపీచంద్‌ జ్ఞాపకాలు,విశ్లేషణలు

 

తెలుగు పాఠకులకు విశేషించి సాహిత్యాభిమానులకు సుపరిచితులైన ప్రసిద్ధుల్లో ప్రథమ శ్రేణిలో వుంటారు త్రిపురనేని గోపీచంద్‌. ఆయన నవల ‘అసమర్థుని జీవయాత్ర’ చదివినా చదవకపోయినా ఆ పేరు తెలియని విద్యాధికులు చాలా తక్కువగానే వుంటారు. ఇక సాహిత్యాభినివేశం కాస్త ఎక్కువగా వున్నవారెవరైనా మెరుపుల మరకలు,చీకటి గదులు, పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా వంటి నవలలను అమితంగా ఇష్టపడతారు. అలాటి గోపీచంద్‌ సాహితీ వ్యక్తిత్వాన్ని తెలియజెప్పే సమాకాలికుల జ్ఞాపకాల విశ్లేషణల పునర్ముద్రణ ఇది. 1962లో కేవలం 52 ఏళ్ల వయస్సులోనే గోపిచంద్‌ మరణించినప్పుడు ఆప్తులు ఆత్మీయులు ఆక్షరాభిమానులు రాసిన నివాళులు,విశ్లేషణలు, కవితలు మొత్తం 64 రచనలున్నాయి. గోపిచంద్‌ కుమారుడు సినీ నటుడు సాయిచంద్‌ చొరవతో వచ్చిన ఈ పుస్తకం రచయితను రచనలను గురించి మాత్రమే గాక నాటి నేపథ్యాన్ని గురించి కూడా ఆసక్తికరంగా చెబుతుంది.

గోపీచంద్‌ హేతువాద రచనల అగ్రగామి త్రిపురనేని రామస్వామి చౌదరి కుమారుడు. ఎందుకు అని ప్రశ్నించడం తండ్రి తనకు నేర్పాడంటూ అసమర్థుని జీవితయాత్రను ఆయనకు అంకితం ఇచ్చాడు.అయితే దశాబ్దాల కిందటే నాటి మూఢనమ్మకాలపైన బ్రాహ్మణాధిక్యతపైన కలాన్ని కత్తిలా ఝలిపించిన రామస్వామి చౌదరికి వున్న దృఢత్వం గోపీచంద్‌కు చివరి వరకూ అంత స్థిరంగా నిలవలేదు. అలాగే తెనాలి వంటి భావ చైతన్య కేంద్రంలో పుట్టి పెరిగినకారణంగా అభ్యుదయ ఉద్యమ ప్రభావం పడినప్పటికీ అది కూడా ఆఖరువరకూ లేదు. మధ్యలో దీర్ఘకాలం రాయిస్టుగా ఎంఎన్‌రాయి భావజాలాన్ని ప్రచారం చేసే బాధ్యత తీసుకున్నా మధ్యలోనే వదిలేశారు. ఈ మార్పులు ఎన్నివున్నా రచయితగా సామాజిక అధ్యయనశీలిగా గొప్ప ప్రతిభా వంతుడు గనక గోపిచంద్‌ ఎన్నెన్నో అణిముత్యాల వంటి కథలు, నవలలు రచించగలిగారు. ఆయన రచనలు చదువుతున్నప్పుడు జీవితాన్ని ప్రత్యక్షంగా చూస్తున్న అనుభూతి కలుగుతుంది. జీవితం ముందుకు తెచ్చే ప్రశ్నలు ముందుకొచ్చి నిలబడతాయి. ఈ కారణంగానే స్వల్ప జీవితంలోనే అసంఖ్యాక రచనలు చేసి అపారమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించగలిగాడు. ఆయన సమాచార శాఖలోనూ ఆకాశవాణిలోనూ కూడా పనిచేశారు. రేడియో నాటికల్లోనూ ప్రతిభ ప్రదర్శించారు.
ఈ పుస్తకంలో ఆయన జీవిత పరిణామాలు మలుపులు మెరుపులతో పాటు ఆయా కథలు నవలల లోతుపాతులు తరచి చూపడం ఎంతో ఉపయోగకరమైన అంశం. పాలగుమ్మి పద్మరాజు, బుచ్చిబాబు రావూరి భరద్వాజ డి.రాజలింగం, జాస్తి జవహర్‌లాల్‌, మండవ శ్రీరామమూర్తి,దుర్గానంద్‌, టి.జయప్రదాదేవి, ఎన్‌.వి.బ్రహ్మం వంటి వారు ఈ వివిధ కోణాలను అందించారు. జీవితంలో రకరకాల అనుభవాలు బాధాతప్త జీవుల ఆవేదనలు ప్రతిభావంతుల ప్రయోగాలు ఆయన చాలా చేశారు.ప్రేమ వివాహాలు సామాజిక అంతరాల వంటి వాటి ప్రభావాలనూ విశ్లేషించారు. స్త్రీల పరిస్థితిపైన, మనస్తత్వాలపైన ప్రస్తుత సమాజంలో పాతివ్రత్యం పేర ఆమెపై రుద్దిన ఏకపక్ష విలువలపైన గోపిచంద్‌ ప్రత్యేకంగా కేంద్రీకరించి పలు కథలు రాశారు. ఈ ఏకపక్ష నీతులను స్త్రీలు ప్రశ్నించే కథలు చాలా వున్నాయి.. ఇక ఆయన నవలల్లో అసమర్థుని జీవయాత్రను గురించి కనీసం నలుగురైదుగురు చాలా వివరంగా విశదంగా రాయడం ప్రత్యేకత. తండ్రి నుంచి సంక్రమించిన హేతువాదానికి తర్వాత వచ్చిన మార్పులకు మధ్య నలిగిపోయిన గోపీచంద్‌ ఆత్మస్వరం కూడా ఈ నవలా నాయకుడైన సీతారామారావు పాత్రలో వుందని విమర్శకులు చెబుతుంటారు. పరమేశ్వర శాస్త్రి వీలునామాలోనైతే అభ్యుదయ వాదాల పట్ల తనకు కలిగిన సందేహాలేమిటో చెబుతాడు. చీకటి గదులు మెరుపుల మరకలు,గడియపడని తలుపులు, యమపాశం వంటి నవలలు ఇంకా బరువైనవి. రాయిస్టు దశలో ప్రధానంగా కథలూ, తర్వాత దశలో నవలలూ రాశారనేది ఒక పరిశీలన. మొదటి దశలో భావాల పైన అధిక శ్రద్ధ చూపితే మలిదశలో శిల్పం,పాత్రలు, కథనం వంటివాటికి అధికతర ప్రాధాన్యత నిచ్చారని విమర్శకులంటారు.
ఇక గోపిచంద్‌ సినిమా రంగంలోనూ ముఖ్య పాత్ర వహించారనే సంగతి తర్వాతి వారికి అంతగా తెలియదు. ఆయన ‘ప్రియురాలు” లక్ష్మమ్మ కథ’ వంటి చిత్రాలకు దర్శకత్వం కూడా చేశారు. అయితే ఆ సమయంలో రచయిత పై చేయి కావడం వల్ల అవి అంతగా పేరు తెచ్చుకోలేదని విమర్శకుల భావన. లక్షమ్మ కథ విజయం సాధించినా ఆ వైపు తర్వాత కృషి చేయలేదు. అయితేకలిమిలేములు చదువుకున్న అమ్మాయిలు వంటి చిత్రాలకు రచన చేసి తన సత్తా మరోసారి చాటుకున్నారు.
ఈ విధంగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా వెలిగిన గోపీచంద్‌ను పాఠకులు బాగా అర్థం చేసుకోవడానికి ఈ పుస్తకం ఎంతైనా దోహదకారి. పునరుక్తుల్లాంటివి తగ్గించి మరింత విమర్శనాత్మకమైన వ్యాఖ్యాతలను కొందరిని చేర్చివుంటే ఇంకా పరిపూర్ణత వచ్చేది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *