దేశశిఖరాగ్రంలో ద్వేషభక్తి వివాదం
హెచ్‌సియుతో మొదలై జెఎన్‌యు వరకూ పాకిన విద్వేష వ్యూహాలు చల్లారకపోగా ఇప్పుడు శ్రీనగర్ ఎన్‌ఐటిలోనూ కల్లోలం మొదలైంది. హెచ్‌సియులో రోహిత్ వేముల కుల వివక్షకు వ్యతిరేకంగా మొదలైన ఆందోళన దేశాన్ని కదిలించింది. దాన్ని ఎదుర్కోలేక జాతి వ్యతిరేకత ముసుగులో జెఎన్‌యులో చిచ్చు పెడితే కన్నయ్య కుమార్ నూతన చైతన్య ప్రతీకగా ముందుకొచ్చారు. చట్టసభల్లోనూ న్యాయస్థానాలలోనూ ప్రభుత్వానికి చుక్కెదురైంది. విజ్ఞత వాస్తవికత ఏమాత్రం వున్నవారైనా ఈ గుణపాఠాలతో కళ్లు తె రిచి వుండేవారు. కాని కేంద్ర ప్రభుత్వం తప్పులు దిద్దుకుని ప్రశాంతతను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోకపోగా – హెచ్‌సియులో మళ్లీ రావణకాష్టం రగిలించారు. కళంకిత వైస్ ఛాన్సలర్ అప్పారావును లోపాయికారిగా పున: ప్రతిష్టించారు.దీనిపై ఆందోళన చేసిన విద్యార్థులపై విరుచుకుపడ్డారు.ఆఖరుకు అది అధ్యాపకుల రాజీనామాల వరకూ వెళ్లినా పునరాలోచనకు నిరాకరిస్తున్నారు. ప్రగతిశీల ప్రజాస్వామిక వాదులు సామాజిక శక్తులు విద్యార్థి ఉద్యమాలలో కొత్త సమీకరణకు నూతన జాగృతికి ఈపరిణామాలు దారి తీశాయి. దాంతో తమ లక్ష్యం దెబ్బతిందని గ్రహించిన బిజెపి నాయకత్వం కేంద్ర మంత్రులూ నేరుగా రంగంలోకి దిగారు. జాతీయతా పోరాటంలో మొదటి ఘట్టంలో తామే విజయం సాధించామని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ గొప్పగా ప్రకటించడం వాస్తవ పరిస్థితిని వక్రీకరిచడానికే. అంబేద్కర్ 125 జయంతి సందర్భంలో రాజ్యాంగ ప్రాథమిక హక్కులైనా భావప్రకటనా స్వేచ్చ, సామాజిక న్యాయం వంటి ప్రాథమికాంశాలకే ప్రభుత్వాలు ఎసరు పెట్టడంపై ప్రజ్వరిల్లుతున్న ఆగ్రహాన్ని దారి తప్పించడమే ఇప్పుడు పాలకుల ఎజెండాగా మారింది. ఇలాటి సమయంలో టి20 క్రికెట్ మ్యాచ్‌లో భారత జయాపజయలు కొత్త ఆజ్యంగా మారాయి. దేశభక్తికి క్రికెట్ కొత్త నిర్వచనం అవుతుందన్న విమర్శలు శ్రీనగర్‌లో అక్షరాలా వాస్తవమై ఆందోళనకర రూపం తీసుకున్నాయి.
టి20లో భారత జట్టు సెమీ ఫైనల్స్‌లో పాకిస్తాన్‌పై గట్టి విజయమే సాధించింది. దానిపై శ్రీనగర్ ఎన్‌ఐటిలో వెనువెంటనే విజయోత్సవ ప్రదర్శన జరిపడంలో తప్పు లేదుగాని పైన చెప్పుకున్న నేపథ్యంలో అధికారులు బాధ్యులు తగు జాగ్రత్తలు తీసుకొని వుండాల్సింది. కాశ్మీరేతర విద్యార్థులు ఆ ప్రదర్శన జరిపారని చెబుతున్నా వాస్తవంలో ఎబివిపి దాని వెనక వుందని అందరికీ తెలుసు. భారత విజయాన్ని హర్షించడంతో వూరుకోక పాకిస్తాన్ ముర్దాబాద్ అని ఆ ప్రదర్శనలో పాల్గొన్నవారు నినాదాలివ్వాల్సిన అవసరం లేదు. తర్వాత ఫైనల్స్‌లో వెస్టిండీస్ చేతిలో భారత జట్టు వోడిపోయింది. ఆటల్లో అది సహజమే. ఆ వెంటనే ప్రధానంగా కాశ్మీరీ విద్యార్థుల ఆధ్వర్యంలో విజయోత్సవం జరిగింది. ఆతిథేయ దేశం ఓడిపోయిమరొకరు గెలిచినప్పుడు ఆ భూభాగంలో ఇలాటి ప్రదర్శన జరపడం ఎవరూ ఆమోదించలేరు. అయితే కృత్రిమ వివాదాలు రగిలించిన తర్వాత కుర్రాళ్లు సమతుల్యంగా సంయమనంగా వుంటారని ఎలా ఆశించడం? ఎవరి కోణంలో వారు కావాలని వారిని రెచ్చగొట్టిన తర్వాత అటూ ఇటూ కూడా ఈ విధమైన దుష్పలితాలు అనివార్యం. పైగా కాశ్మీర్‌లో అనేక మల్లగుల్లాల మధ్య పిడిపి బిజెపి ప్రభుత్వం ఏర్పడ్డం ఇస్టంలేని వారు ఇరువైపులా వున్నారు. నిట్‌లో తలెత్తిన సున్నితమైన పరిస్థితిని సమగ్రంగా ఆలోచించి అదుపుచేసేంత ఒద్దిక ఆ ప్రభుత్వం నుంచి ఎలా ఆశిస్తాం? ఏప్రిల్1న కాశ్మీరీల ప్రదర్శన తర్వాత కూడా పరిస్థితి చేయిదాటిపోలేదంటున్నారు. కాని ఆ తర్వాత పోలీసులు సిఆర్‌పిఎప్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జోక్యంతోనే అంతా దిగజారింది. హిందూ ముస్లింలకు మధ్యన లేదా కాశ్మీరీ కాశ్మీరీయేతరుల మధ్యన కాదంటే దేశభక్తులు దేశ ద్రోహుల మధ్యన ఘర్షణగా దీనికి ప్రచారం లభించింది. భద్రత లేదంటూ బయిటనుంచి వచ్చిన వారు ఫిర్యాదులు చేశారు. షరామామూలుగా మీడియా విపరీత ప్రచారమిచ్చింది. తెలుగు పత్రికల్లోనూ చాలా కథనాలు వచ్చాయి.
ఇక్కడే మిగిలిన చోట్లకు శ్రీనగర్‌కు తేడా చూడాల్సి వుంటుంది.హైదరాబాదులో గాని ఢిల్లీలో గాని బిజెపి అధికారంలో లేదు. యూనివర్సిటీలు మాత్రం వారి పరిధిలో అంటే కేంద్రం అధీనంలో వున్నాయి. కనుక మానవ వనరుల శాఖ హౌం శాఖ రాజకీయ కోణంలో ప్రకటనలు చేశాయి. కాశ్మీర్‌లో వారే అదికారంలో వున్నారు గనక అసలే అంతంత మాత్రంగా వున్న ప్రభుత్వ మనుగడ రీత్యా మాట్లాడలేని పరిస్థితి. కనుకనే హెచ్‌సియు జెఎన్‌యుల విషయంలో విెరుచుకుపడిన సృతి ఇరానీ తదితరులు ఇప్పుడు పెద్దగా మాట్లాడలేదు. ప్రతినిధి వర్గాన్న పంపి సరిపెట్టారు. బయిటి వారి భద్రతకు వచ్చిన ముప్పులేదని శ్రీనగర్‌లో తీవ్రవాదం తారాస్థాయిన వున్నప్పుడు కూడా వారు భద్రంగానే వున్నారని రాష్ట్ర ప్రభుత్వం ఒకటికి రెండు సార్లు చెప్పినా కేంద్ర నేతలు బలపర్చరు, ఖండించరు. నిట్‌ను సందర్శించిన బృందానికి అక్కడి స్థానిక విద్యార్థులు కూడా ఆ మేరకు హామీనిచ్చారు. స్థానిక వ్యాపారులు ఇతర సంస్థలు కూడా మద్దతు ప్రకటించాయి. అయినా సరే జమ్మూ ప్రాంతంలో అధికంగా బలం వున్న బిజెపి పరిష్కారానికి సహకరించదు. పైగా అక్కడ ఎబివిపి నిరసన ప్రదర్శన జరిపి ఇంకా ఎగదోస్తుంది. భౌగోళకంగానూ చారిత్రికంగానూ కీలకమైన సున్నితమైన కాశీమర్ వంటి చోట ఈ చిచ్చు ఎంత ప్రమాదమనేది ఏ మాత్రం పట్టించుకోరు. అక్కడ భారత పాక్ సంబంధాలపై భిన్నస్వరాలు వినిపించడం సర్వసాధారణం. ఆ మాటకోస్తే అధికార పిడిపి కూడ కాశ్మీర్‌ను అపరిష్క్రత సమస్యగానే చెబుతుంది.అఫ్‌జల్‌గురుతో సహా తీవ్రవాదులను బలపర్చిన చరిత్ర, సిద్ధాంతం దానికి వున్నాయి. బిజెపి నేతలు అలాటి పార్టీతో కలసి అధికారం పంచుకుంటారు, హఠాత్తుగా వెళ్లి పాక్ ప్రధాని నవాజ్‌షరీప్‌ను ఆలింగనం చేసుకుంటరు. పఠాన్‌కోటలో పాకిస్తాన్ దర్యాప్తు బృందన్ని అనుమతిస్తారు. ఇవన్నీ చేస్తారుగాని విద్యార్థులు ఏదో ప్రదర్శన చేసినందుకు దేశద్రోహులుగా జాతి వ్యతిరేకులుగ చిత్రించే పయత్నం చేస్తారు. ఈ నిట్ ఉదంతంలో అదనంగా దీన్ని స్థానికులకు బయిటివారికి మధ్యన ఘర్షణగా చేస్తున్నారు. కాశ్మీర్‌ను ఎలాగైనా కాపాడుకోవడం భారత ప్రయోజనాలకు ఎంత అవసరం? అక్కడ పాక్ కుట్రలను తిప్పికొట్టడం ఎంత ముఖ్యం అనే సృహ ఏ కాస్తవున్నా మరో రకంగా వ్యవహరించి వుండేవారు. కేంద్రం, పిడిపి ప్రభుత్వం కూడా తన స్థానిక రాజకీయావసరాలను బట్టి తప్ప బాధ్యతా యుతంగా వ్యవహరించలేదు.
మొదటి నుంచి కాశ్మీర్ ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటూ హత్యా ప్రయత్నాలకు కూడా గురైన సిపిఎం శాసనసభ్యుడు యూసప్ తరగామి ఈ సమయంలో చేసిన ప్రకటన చాలా విలువైంది. అందరు విద్యార్థులు అందరి మనోభావాలను స్పందనలను దృష్టిలో పెట్టుకుని అడుగేయాలని ఆయన హితవు పలికారు. ప్రశాంతతను పునరుద్ధరించడనిక చదువులు కాపాడుకోవడానికి ప్రాధాన్యత నివ్వాలన్నారు. అందుకు భిన్నంగా విద్వేషాలు పెంచడానికి వ్యతిరేక ముద్రలు వేయడానికి ఎవరు ప్రయత్నించినా దేశానికి చేటు.
మొత్తంగా బిజెపి కేంద్ర ప్రభుత్వం లేవనెత్తిన జాతీయత వివాదం భారత మాతకు జై నినాదం లోతుపాతులు కూడా ఫ్రశ్నలు ఎదురవుతాయి. ఈ దేశ పౌరులు ఎవరైనా ఏ మతం వారైనా కండిషన్స్ అప్లై అన్నట్టుగా బిజెపి షరతులతో జీవించాల్సిన పనిలేదు.రాజ్యాంగంలో పేర్కొనని నిబంధనలను రుద్దే అధికారమూ లేదు. పాతికేళ్ల కిందట అయోధ్య రామమందిర నినాదంతో జై శ్రీరాం అన్నారేగాని జై భారత మాత అని వీరు నినదించారా? అప్పుడు రాముణ్ని కాదంటే ఈ దేశంలో ఎలా వుంటారన్నట్టు మతతత్వం ప్రత్యక్షంగా ప్రవేశపెట్టారు. నాటి అద్వానీ రథయత్రకు తొలి సారథి ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీయే! మరి వారు వూరూరా జై కొట్టింది శ్రీరాముడికా లేక దేశమాతకా? వాజ్‌పేయి ప్రధాóనిగా అద్వనీ ఉప ప్రధానిగా కేంద్రంలో పదవులు నిర్వహించినపుడు ప్రమణ స్వీకారంలో భారత మాతకు జై అన్నారా? మోడీ మూడుసార్లు గుజరాత్ ముఖ్యమత్రి అయినప్పుుడు గాని ఇప్పుడు ప్రధానిగా గాని ప్రమాణస్వీకారం చేసినప్పుడు గాని బారత మాతకు జై కొట్టారా? ఇక్కడ సమస్య వారు అనకపోవడం పొరబాటని కాదు, రాజ్యంగంలోనూ రాజకీయంగానూ ఆ అవసరం లేదు గనకే మోడీ కూడా జైహింద్ అని ముగించారు. ఇప్పుడుజైహింద్ విలువ తగ్గి భారత మతపై మమకారం పెరిగిందని కాదు. రాజకీయ దాడికి ఉపయోగం కనుకనే దాన్ని వెలికితీశారు. అద్వానీ నుంచి ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్ వరకూ దీనిపై రభస అనవసరమని అంటున్నా ఏదో ఒక రూపంలో ఎగదోస్తూనే వున్నారు. నిజానికి అఖండ భారత్ నినాదమిచ్చే వారికి భారతీయఏకతా తా భావన వుందా అనేది కూడా ప్రశ్నార్థకమే. ఈ సమయంలో పంజబ్‌లో వారు అధికారంలో భాగం పంచుకుంటుండగ హర్యానాలోనూ వారే వుండగా సట్లెజ్ యమున కాల్వపై ఎలా కొట్లాడుకుంటున్నారో చూడొచ్చు. ఒవైసీ అయినా మరొకరైనా ఫలానా నినాదం ఇవ్వను అనాల్సిన పనిలేదుగాని దాన్నొక షరతుగా వివాదంగా మార్చడం కూడా అవాంఛనీయమే. క్రీడాస్పూర్తిని కుహనా ద్వేషభక్తిని కలిపి రెచ్చగొట్టవలసిన ఫలితాలు ఇప్పుడు శ్రీనగర్‌లోనూ చూస్తున్నాం. భద్రత పేరుతో దాన్ని అక్కడి నుంచి తరలించాలనే విపరీత సూచనలు కూడా వస్తున్నాయి.
ఇలాటి జటిలమైన సందర్బాల్లో ఉద్వేగాలతో కొట్టుకుపోవడం కన్నా ఎవరి నినాదాల వెనక ఏ ప్రయోజనలున్నాయో గ్రహించడం ముఖ్యం. ఆ విధంగానే శ్రీనగర్ నిట్ వివాదం సత్వరం సహేతుకంగా పరిష్కారం అవుతుందని ఆశించాలి.
