కొంచెం ధైర్యం చేస్తేనే కొత్త ఊపిరి!

title1111
పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ మూడేళ్లుగా కుస్తీపడుతున్న సీక్వెల్‌ సినిమా సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ ఆడియో విడుదలకు మెగాస్టార్‌ చిరంజీవి హాజరు కావడం గొప్ప సంచలనంగా మీడియాలో ప్రచారం పొందింది.కావడానికి అన్నదమ్ములే అయినా ఇటీవల ఎడంగా వుంటున్నారనే కారణంగానూ చాలా ఏళ్ల తర్వాత చిరు తన తమ్ముడి పంక్షన్‌కు వస్తున్నాడనే కారణంగానూ చాలా హైప్‌ ఇచ్చారు. ఇంతకూ ఆ వేడుకలో చిరంజీవి తమ్ముడికో సలహా ఇచ్చాడు. అంతా బాగానే వుంది గాని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ను వదులుకోవద్దు అని! గబ్బర్‌ సింగ్‌ చూసినవాళ్లందరికీ వీరాభిమానులకు కూడా పవర్‌స్టార్‌ ఏ రేంజిలో మాస్‌ మసాలా కూరారో అర్థమై పోయింది. వసూళ్ల వాన వూహించిన స్థాయిలోనే వుంది.
ఇంచుమించు ఇదే సమయంలో నాగార్జున కార్తి తమన్నాల చిత్రం ఊపిరి విజయం సాధించింది. రేంజి తక్కువ కావచ్చు గాని వచ్చిన ప్రశంసలు తక్కువ కాదు.చక్రాల కుర్జీకి పరిమితమైన ఒక శతకోటీశ్వరుడైన కథనాయకుడు జీవితానందం కోసం నియమించుకున్న యువ సహాయకుడితో పెంచుకున్న అనుబంధం ఆ కథాంశం.
ఇదే సమయంలో – భారతీయ సినిమా చరిత్రలోనే అత్యధిక రికార్డు వసూళ్లు సృష్టించిన రాజమౌళి సాంకేతిక అద్భుతం బాహుబలి జాతీయ ఉత్తమ చిత్రంగా ఎన్నికైన తొలిచిత్రమైంది. దాంతోపాటే దర్శకుడు క్రిష్‌ తీసిన ‘కంచె’ ప్రాంతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికైది. బాహుబలి ముందే ప్రపంచమంతా ప్రసిద్ది పొందినా ఏ కోణంలో అది ఉత్తమ చిత్రం అయిందనే చర్చ చాలా జరిగింది. కాని క్రిష్‌ కంచెకు వచ్చిన అవార్డుపై అలాటి చర్చలేమీ లేకపోగా విభిన్న చిత్రానికి న్యాయం జరిగిందనే మాట అందరినుంచి వచ్చింది. ఈ చిత్ర కథానాయకుడు కూడా మెగా ఫ్యామిలీకి చెందిన వరుణ్‌తేజ్‌ కావడం అదనంగా చెప్పుకోవలసిన విషయం.
చిరు చెప్పిన కమర్షియల్‌ ‘కంచె’ను దాటితేనే తెలుగుసినిమా కొత్త వూపిరి పోసుకుంటుందనే భావన ఇప్పుడన్నిచోట్లా వినిపిస్తున్నది. స్వయానా చిరంజీవి తన నూటయాభయ్యవ చిత్రం కోసం వందలాది కథలు విని చివరకు ఒక తమిళరీమేక్‌కు సిద్ధం కావడం చూస్తుంటే పాతవరవడి ఒక పట్టాన నమ్మకం సంతృప్తి కలిగించడం లేదని తేలిపోతుంది. ఇలాటి పరిస్థితుల్లో విభిన్నమైన కథాంశాలను ఆసక్తికరంగా వినూత్నంగా తెరకెక్కిస్తే ప్రేక్షకులు పరిశ్రమ కూడా ఆదరించవచ్చునని కంచ వూపిరి వంటి చిత్రాలు నమ్మకం కలిగించాయి.

తెలుగు సినిమాలలో గతంలోనూ అనేక రకాల విభిన్న ప్రయత్నాలు జరగలేదని కాదు. ఆఫ్‌బీట్‌ చిత్రాలు తీసిన వారూ లేకపోలేదు. కె.రాఘవేంద్రరావు జ్యోతితోనూ, విశ్వనాథ్‌ ఓ సీత కథతోనూ, దాసరి ఇంకా చాలా చిత్రాల్లోనూ అలాటి ప్రయత్నాలు ప్రయోగాలు చేశారు. ఎన్టీఆర్‌ అక్కినేని ఎల్‌వి ప్రసాద్‌, కెఎస్‌ ప్రకాశరావు, ఆదుర్తి వి.మధుసూదనరావు, ప్రత్యగాత్మ వంటి వారు కూడా మొదట్లోనే ఆతరహా చిత్రాలు అందించారు. కాని ఇవి చాలా త్వరితంగా ఆగిపోయాయి. ఒకటి రెండు పరాజయాలతోనే ఈ హేమాహేమీలు ఫార్ములా దారికి తిరిగివచ్చారు. చిన్న చిత్రాల్లో జరిగిన ప్రయత్నాలకు లెక్కేలేదు. రామోజీ రావు నిర్మాతగానూ కొన్ని విభిన్న చిత్రాలు వచ్చాయి. కాని ఇదొక ఒరవడిగా సాగింది లేదు. ఇటీవలి సంవత్సరాలలో ఆ వరవడికి ప్రతీకగా నిలిచిన వ్యక్తి క్రిష్‌. జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి అనే పేరును క్రిష్‌గా మార్చుకోవడంతోనే కొత్తదనం ఆగకుండా నవ్యమైన కథాంశాలను ఎంచుకుని ప్రేక్షకులను ఆకట్టుకోగలిగారు. (క్రిష్‌కు సంబంధించిన భాగం గతంలో విడి వ్యాసంగా ఇచ్చాను గనక ఇక్కడ ఎడిట్‌ చేస్తున్నాను)ఇప్పుడాయన బాలకృష్టతో గౌతమీ పుత్ర శాతకర్ణిలో తన మరో కోణం చూపిస్తానంటున్నారు గనక వేచి చూడాలి.

పైడిపల్లి వంశీ దర్శకత్వంలో ఫ్రెంచి చిత్రం ఇన్‌టచబుల్స్‌ ఆధారంగా తీసిన ఊపిరి నాగార్జునను మరో వైవిధ్యభరితమైన పాత్రలోచూపి కొత్త వూపిరిపోసింది. శివ, గీతాంజలి,అన్నమయ్య, మన్మథుడు అంటూ ఆయన చెప్పుకునే జాబితాలో మరో మంచి చేరిక అయింది. కార్తీ,తమన్నా ఇతర ప్రధాన పాత్రల్లో నటించి కథను పండించడానికి కారకులయ్యారు. శతకోటీశ్వరుడైనా శరీరంలో సగం చచ్చుబడినా జీవితంలో చైతన్యం కోల్పోకూడదనుకునే ఒక సంపన్నుడి పాత్రలో నాగార్జున చక్రాలకుర్చీకి అంకితం కావడం సాహసమంటున్నారు గాని ఎన్టీఆర్‌ వంటివారు గుడిగంటలు సమయంలోనే ఆ పని చేశారు. ఎన్టీఆర్‌ కొంత వరకూ ఏఎన్నార్‌ కూడా అవిటి అంధ వృద్ధ పాత్రలలో ఏనాడో నటించి మెప్పించారు.కథ ముఖ్యం గాని గ్లామర్‌ను పట్టుకుని వేళ్లాడకుండా కథను బట్టి చేస్తే తప్పక ప్రేక్షకులు ఆదరిస్తారని నిరూపించారు. కాని తర్వాత కాలంలోనే ఈ మాస్‌ ఫార్ములాలు పెరిగిపోయి పాత్రలను గాక హీరోలను దృష్టిలో పెట్టుకునే దురవస్థ వచ్చింది. వారి పారితోషికాలతో నిర్మాణ వ్యయం విపరీతంగా పెరిగి విభిన్నమైన ఆలోచనలనే ఆదరించలేని పరిస్థితి ఏర్పడింది.

గత దశాబ్దంలోనూ భిన్నమైన చిత్రాలు వచ్చి విమర్శకుల ప్రశంసలు ప్రేక్షకుల ఆదరణ పొందిన సందర్భాలు కొన్ని వున్నాయి. శేఖర్‌ కమ్ముల తీసినప్పుడు మంచి కాఫీలాటి సినిమా సబ్‌లైన్‌తో ఆనంద్‌ హాయిగా వుందని మెచ్చుకున్నారు.ఆయన తర్వాత తీసిన హ్యాపీ డేస్‌ ఎప్పుడు టీవీలో వచ్చినా కుర్రకారు అతుక్కుపోయి చూస్తూనే వుంటారు. ఇంద్రగంటి మోహన కృష్ణ తీసిన మిస్సమ్మ,అంతకంటే అష్టాచెమ్మ కూడా ఆ విధంగానే విజయం సాధించాయి. సినిమా మోజును క్రేజును సహజంగా చూపించిన అష్టాచెమ్మ ఒక ట్రెండ్‌ సెట్టర్‌ అయింది. తర్వాత కూడా గోల్కొండహైస్కూలు వంటివి తీశారు గాని ఆ స్థాయిలో ఆదరణ పొందలేదు.ఏమైనా మెయిన్‌ స్ట్రీంకు భిన్నంగా నడిచాయవి. శ్రీకాంత్‌ అడ్డాల కొత్త బంగారు లోకం తీసినప్పుడు కూడా మరో హ్యాపీడేస్‌లా స్వీకరించారు యువత తలిదండ్రులు కూడా. ఈ చిత్రాలలో పెద్దతారలు లేకపోగా కొత్త తారలను అందించాయి. వరుణ్‌సందేశ్‌,రావు రమేష్‌,శ్వేతాబసు, రాజా, తదితర హీరోలు క్యారెక్టర్‌ నటులు లభించారు.
క్రాంతి మోహన్‌ ఓనమాలు పల్లెటూళ్లలో దిగజారుతున్న పరిస్థితులను మానవ సంబంధాల పతనాన్ని చక్కగా చూపించి అభినందనలు అవార్డులు చూరగొన్నారు. తన తదుపరి సినిమా ‘మళ్లీ మళ్లీఇది రాని రోజు’ కూడా శర్వానంద్‌, నిత్యా మీనన్‌ల కాంబినేషన్‌లో ఆరోగ్యప్రదమైన ప్రేమకథాచిత్రంగా అలరించింది. అదే సమయంలో మత సామరస్యం మానవీయ విలువలను చాటింది. సునీల్‌ కుమార్‌ రెడ్డి సొంత వూరు భూసేకరణ దుష్పలితాలను చూపిస్తే గంగపుత్రులు పల్లెకారుల బతుకుల్లో ప్రళయాన్ని చిత్రించింది. ఇవన్నీ థియేటర్లలో విడుదలైనవే.తనికెళ్లభరణి మిథునం ఈ కోవకు చెందింది కాకపోయినా సంప్రదాయ వృద్ధదంపతుల( బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మి చరమాంకాన్ని హృద్యంగా చూపించి ప్రశంసలు పొందింది. ఇవన్నీ కూడా కొన్ని భిన్నమైన ప్రయత్నాలే. దేవ్‌కట్టా తీసిన ప్రస్థానం సమాంతర చిత్రాలకు మరో సంకేతంగా నిలిచిపోయింది. ఒక స్వార్థ రాజకీయ వేత్త అతని సవతి కుమారుడి మధ్య ప్రేమతో మొదలై ఘర్షణగా ముగిసే ఈ కథలో శర్వానంద్‌, సాయికుమార్‌ల నటన గొప్పగా ఆకట్టుకుని ప్రేక్షకులపై చెరగని ముద్రవేసింది. సుకుమార్‌ అర్జున్‌తో తీసిన ఆర్య పెద్ద సంచలనమే అయింది. తర్వాత మహేష్‌బాబుతో నేనొక్కడినే జగడం ఆర్య 2 లాటి చాలా చిత్రాలు తీశారు గాని ఆ నూతనత్వం రక్తికట్టించలేకపోయారు. తాజాగా నాన్నకు ప్రేమతో విజయవంతమైంది గాని అందులో నాన్న సెంటిమెంటు ప్రధానమైంది. సన్నాఫ్‌ సత్యమూర్తి తర్వాత వచ్చింది గనక ప్రేక్షకులు ఆ జానర్‌కిందే లెక్కేశారు. వెంకటేశ్‌తో పునర్మిర్మాణం చేేసిన దృశ్యం, గోపాల గోపాల(పవన్‌ కళ్యాణ్‌ సహా) కూడా కొంచెం భిన్న చిత్రాలేనని చెప్పాలి. మరికొన్ని విలక్షణ చిత్రాలను ఈ జాబితాలో ప్రస్తావించి వుండకపోవచ్చు.అన్నీ చెప్పడం సాధ్యం కాదు కూడా. కాని వీటన్నిటి మధ్యనా క్రిష్‌లో చెప్పుకోదగిన విశేషమేమంటే దాదాపు ఎనిమిదేళ్లుగా పట్టువదలకుండా సామాజిక ఇతివృత్తాలను జోడించిన కథలే ఎ ంచుకుంటున్నారు. ఆ కారణంగానే తన చిత్రాల్లోని ఇతరేతర లోపాలకన్నా ఈ వరవడిని ప్రత్యేకంగా చెప్పుకోవలసి వస్తుంది.
తమిళం కన్నడం మళయాలం హిందీ భాషలతో పోలిస్తే తెలుగు సినిమాలో మూస ధోరణి చాలా చాలా ఎక్కువ. పెద్ద హీరోలు వారి వారసులతో తీస్తారు గనక రిస్క్‌ వుండకూడదంటూ అనవసర హంగామా పెట్టి జీవితానికి సాధ్యమైనంత దూరంగా తీసుకెళ్తుంటారు. ఏదైనా అంటే మేము వ్యాపారం చేస్తున్నాము గాని సమాజాన్ని ఉద్ధరించాలనుకోవడం లేదు అని జవాబిస్తుంటారు. కోటానుకోట్లతో తీసిన వాణిజ్య చిత్రాలు విఫలమైతే నోరు మెదపరు. విప్లవాలు సామాజిక చైతన్యాలు వున్నా వుండకపోయినా కనీసం ఆరోగ్యకరమైన కథలు మానవీయ ఇతివృత్తాలు తీస్తే అదే పదివేలు.మూస పాత్రల బదులు జీవితాన్ని ప్రతిబింబించే మనుషులు కనిపిస్తే చాలు. మానవ జీవితంలో సమాజంలో అడుగడుగునా ఎదురయ్యే ఘర్షణలను ఆవిష్కరిస్తే అంతకన్నా కావలసింది లేదు. సమాజంలో అడుగడుగునా ఇన్ని ఘర్షణలు ఉద్రేకాలు అసహనాలు పోరాటాలు ఆశనిరాశలు చూస్తుంటే వాటితో నిమిత్తం లేని ఫార్ములా హీరోలపైనే కేంద్రీకరించి ఆ కథలే వారితోనే చూడమంటే ప్రేక్షకులకు మొహం మొత్తుతుంది. అందుకే చాలా చిత్రాలు బాక్సాపీసు దగ్గర పల్టీ కొడుతున్నాయి. ఈ కారణంగానే కొత్త తరహా కథలు పాత్రలు చిత్రీకరణ పద్ధతుల కోసం అన్వేషణ తప్పడం లేదు. మమ్ముల్ను ప్రేక్షకులు ఫలానా విధంగానే రిసీవ్‌ చేసుకుంటారని గిరి గీసుకుని కూచుంచే తెలుగు సినిమా పరిధి గాని ఆ హీరోల పరిధి గాని విస్తరించే అవకాశం వుండబోదు. ప్రతిదీ వెనువెంటనే చూసే అవకాశం ప్రపంచాన్ని అరచేతిలో వీక్షించే పరిజ్ఞానం వున్న ఈ నాటి పరిస్తితుల్లో నూతనత్వం లేని పాత మరెంతో కాలం నడవదని పరిశ్రమ గుర్తిస్తే ధైర్యంగా ప్రోత్సహిస్తే మరింత మంచి చిత్రాలు వస్తాయి. ఆ క్రమంలో ప్రేక్షకులు అభిరుచి ఆదరణ పెరుగుతాయి. ప్రతిభావంతులైన దర్శక రచయితలు మరింత పదునెక్కుతారు. అనవసర నిర్మాణ వ్యయాలు కూడా తగ్గి అభద్రత తొలగిపోతుంది.ఆత్మ విశ్వాసం పెరుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *