పాకిస్తాన్ ద్వంద్వ భాషణం

భారత పాక్ సంబంధాలు సంభాషణల్లో మోడీ ప్రభుత్వం తడబాటుకు గురైందని గతంలో విమర్శలు వచ్చాయి. దీర్ఘకాలంగా చర్చలు నిలిపేసిన పరిస్థితుల్లో ఆయన హఠాత్తుగా లాహౌర్‌లో ప్రత్యక్షమై ప్రధాని నవాజ్ షరీఫ్ పుట్టిన రోజు అంటూ ఆలింగనం చేసుకోవడం ఆశ్చర్యం కలిగించింది. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు కూడా తెలియకుండా అదంతా జరిగింది. ఏమైనా ఇరుదేశాల సంబంధాల పునరుద్ధరణ మంచిదే గనక అందరూ హర్షించారు. తర్వాత ఒక దఫా చర్చలు కూడా జరిగాయి. ఈలోగానే పఠాన్‌కోట దాడితో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. మొన్న ఆ దేశం నుంచి దర్యాప్తు బృందాన్ని అనుమతించడంపై కూడా చాలా గజిబిజి జరిగిందని చెప్పుకున్నాం.అది హొంశాఖకు రక్షణ శాఖకు తెలియదన్నారు. ఏమైనా వూహించినట్టే వారు తిరిగి వెళ్లాక పాక్‌పాత్రపై ఆరోపణలను ఖండించడమే గాక ఇదంతా భారత్ కల్పిత దాడి అని విపరీతమైన అభాండం వేశారు. తాజాగా ఈ రోజు భారత్‌తో సంభాషణలను సస్పెండ్ చేస్తున్నట్టు ఆ దేశ రాయబారి అబ్దుల్ బస్సీ ప్రకటించారు. విచిత్రమేమంటే ఇదే రోజున ఆయుధ నియంత్రణపై భారత్‌తో సమగ్ర చర్చలకు తాము సిద్ధమేనని ఇస్లామాబాద్‌లో పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయ ప్రతినిధి నఫీజ్ జకరియా ప్రకటించారు. ఈ మధ్యనే అమెరికా అద్యక్షుడు బారక్ ఒబామా అణుభద్రతా సమావేశంలో భారత పాక్‌లపై గురిపెట్టి మాట్లాడటం అవి అణ్వస్త్ర నిల్వలు తగ్గించుకోవాలని సలహా ఇవ్వడం తెలిసిందే. అమెరికాకు విధేయంగా వున్నట్టు కనిపించడం కోసం పాకిస్తాన్ వెంటనే తాము అలాటి చర్చలకు సుముఖంగా వున్నట్టు చెప్పారు. ఈ ద్వంద్వ భాషణంలో వారి ఉద్దేశం ఏమిటో తెలియదు. అలాగే పొంతన లేనిచర్యలతో విమర్శలు కొనితెచ్చుకున్న మోడీ ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుందో కూడా చూడాల్సిందే!