బడాపార్టీలకు హాయిగా విదేశీ డబ్బు

విదేశాల్లో వందల వేల కోట్ల నల్లడబ్బు దాచుకున్న మహా కుబేరుల గురించి దేశదేశాలు గగ్గోలెత్తిపోతున్నాయి. ఎన్నికల ప్రక్రియను తద్వారా ప్రభుత్వాల ఏర్పాటును ఈ ధనాఢ్యశక్తులు శాసిస్తున్న తీరుపై అన్ని వైపుల నుంచి ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి. అక్రమ ధనంతో అధికారంలోకి తెచ్చి ఆపైన వారి ద్వారా ప్రభుత్వ ధనాన్ని ప్రకృతి వనరులను కొల్లగొడుతున్న వైపరీత్యాలూ రోజూ చూస్తున్నాం. పార్టీల ఆర్థిక వనరులపై పారదర్శకత లేకపోవడంతో ఎవరి నుంచి ఎలాటి విరాళాలు ఎందుకు అందుతున్నాయనే వివరణ వుండటం లేదు. ఇవన్నీ చాలక ఇప్పుడు మోడీ ప్రభుత్వం విదేశీ వనరుల నుంచి కూడా రాజకీయ పక్షాలు విరాళాలు తీసుకోవచ్చని చట్టానికి సవరణ తెచ్చింది. 2010 ఎఫ్‌సిఆర్‌ఎ(ఫారిన్ కంట్రిబ్యూషన్స్(రెగ్యులేషన్) యాక్ట్)ను సవరించడంతో ఇక విదేశీ కంపెనీలు కూడా హాయిగా పార్టీలకు విరాళాలు ఇచ్చి కావలసిన పనులన్నీ చేయించుకోవచ్చు. ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనల్లో ఈ అంశం కూడా వుంది. మే నెలలో పార్లమెంటు దీన్ని ఆమోదించిన తర్వాత పాలకపక్షాలు ఇష్టానుసారం ఏ కంపెనీనుంచైనా అధికారికంగానే విరాళాలు సేకరించుకోవచ్చు. పైగా ఈ సవరణను వెనకటి కాలానికి కూడా వర్తించేలా చేసి 2010 నుంచి అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. 2013లో కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ జాతీయుడైన అనిల్ అగర్వాల్ యాజమాన్యంలోని వేదాంత కంపెనీ నుంచి విరాళాలు తీసుకోవడంపై దుమారం రేగింది. 1976 నాటి విదేశీ విరాళాల చట్టాన్ని కాంగ్రెస్ బిజెపి ఉల్లంఘిస్తున్నాయని 2014 మార్చిలో అంటే ఎన్నికలకు కొంచెం ముందు సుప్రీం కోర్టు విమర్శించింది. రెండు పెద్ద పార్టీలూ ఆ తీర్పును సవాల్ చేశాయి. ఇక ఇప్పుడు ఏకంగా చట్టాన్నే సవరించేట్టయితే విదేశీ స్వదేశీ కంపెనీల నుంచి విరాళాలు తెచ్చుకుని వాటి సేవలో తరించవచ్చన్న మాట.