తలలు నరకాలంటున్న పైత్యబాబా

e3b4f141ff3dcf12f23a6db9f1cf354b
ఆదివారం మీడియాలో బాబా రాందేవ్‌ మార్కెట్‌ ఉత్పత్తుల గురించి పెద్ద కథనం వచ్చింది. ఆయనకు అడ్వర్టయిజ్‌మెంట్‌ స్లాట్‌లలో కనిపించడం ఎంత ఇష్టమో అత్యధిక సమయం ఎలా తీసేసుకుంటున్నారో ఒక వ్యాపార పత్రిక రాసింది. అదే సమయంలో ఆయన ఆరెస్సెస్‌ నిర్వహించిన సద్భావన ర్యాలీలో పాల్గొంటున్నారు హర్యానాలోని రోహతక్‌లో. ఆ రాష్ట్ర గవర్నర్‌ ఆచార్య దేవవ్రత్‌ కూడా పక్కనే వున్నారు. కొంతమంది ముస్లిములు భారత్‌ మాతాకి జై అనడానికి నిరాకరిస్తున్నారంటూ రెచ్చిపోయిన బాబా వారి తలలు తీసేయాలని వీరంగం తొక్కారు. ఈ దేశంలో చట్టం వుంది గాని లేకపోతే లక్షల మంది తలలు నరికేసేవాళ్లం అన్నారు. నెత్తిమీద టోపీ పెట్టుకున్న కొంతమంది భారత్‌మాతాకు జై అనడం మత విరుద్దం అంటున్నారు. దేశాన్ని గౌరవించడం మతానికి వ్యతిరేకం ఎలా అవుతుంది అంటూ ప్రశ్నలు సంధించారు.అలాటి మతం దేశానికి మంచిదికాదు అని ముక్తాయించారు.
బాబా సంగతి అటుంచి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ కూడా భారత్‌ మాతాకి జై అనని వారు దేశంలో వుండటానికి అనర్హులు అని ప్రవచించారు. తను ప్రమాణం చేసిన రాజ్యాంగంలో ఆ మాట ఎ క్కడుందో ఆయనకే తెలియాలి.
సద్భావన పేరిట సభ జరిపి ఇలా మాట్లాడటం సాధుసంతులనబడే వారికి సమంజసమో కాదో సంఘ పరివార్‌ పెద్దలే ఆలోచించాలి. రెండు రోజుల కిందట ముస్లిం సంస్థ దియోబంద్‌ తాము భారత్‌మాతాకు జై అనలేమంటూ చాలా విశదమైన వివరణ విడుదల చేసింది. దేశాన్ని ప్రేమించగలము గాని దేవతగా పరిగణించి పూజించడం తమ మత భావాలకు విరుద్ధమని చెప్పింది. భారత మాతకు దేవత రూపమిచ్చి చేతిలో కాషాయ పతాకం పట్టించి సింహారూఢగా చిత్రించడాన్ని కూడా ప్రస్తావించింది. 1936లో వారణాసిలో నిర్మించిన భారత మాత ఆలయంలో విగ్రహం కూడా లేదని ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ వివరంగా వర్ణించింది. ఇటీవల మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో భరత మాత ఆలయ నిర్మాణానికి కార్పోరేషన్‌ నిధులు కేటాయించింది. ఇవన్నీ రాజకీయ దృష్టితో చేస్తున్నవే గాని రాజ్యాంగంలోవి కావు. నిజానికి డియోబంద్‌ ఈ ప్రకటన చేసినా కొంతమంది ముస్లిం పండితులు దాంతో విభేదించారు కూడా. ఈ సమస్యను అతిగా లాగొద్దని ఆరెస్సెస్‌ అధినేత మోహన్‌ భగవత్‌ చెబుతుంటే వీరంతా ఇలా మాట్లాడ్డం ద్వంద్వనీతికి అద్దం పడుతుంది. అటు వొవైసీలు ఇటు ఆరెస్సెస్‌ వీటి మధ్యన దేశమాత నలిగిపోతుంది. ఒవైసీలు కూడా జైహింద్‌ నినాదంతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నారు.
నిజానికి ఏ తల్లి కూడా తనకు జై కొట్టకపోతే పిల్లలను వెలివేస్తానని బ లి తీసుకుంటానని చెప్పదు. కాని ఆమె వీరపుత్రులమంటూ వూరేగే కొంతమంది లేనిపోని వివాదాలు తెచ్చి విద్వేషాలు పెంచుతున్నారు. కళాతపస్వి బిఎన్‌రెడ్డి తీసిన రంగులరాట్నం చివరి సన్నివేశంలో తల్లిచెబుతుంది’ఇద్దరు బిడ్దలను కన్న నా నుంచి కోట్లమంది బిడ్డలున్న భరత మాత వరకూ ఏ తల్లయినా కోరుకునేది ఒకటే తన పిల్లలు ఐకమత్యంగా వుండాలి అని’ అంటూ చేతులు కలుపుతుంది. చేతులు కలిపి ముందుకు నడపాల్సిన బాబాలు స్వామీజీలు తలలు నరికేస్తామంటే ఇంక సద్బావన ఎక్కడీసమైక్యత ఎక్కడీ వాజ్‌పేయి ప్రధానిగా గాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా గాని రోజూ భారత్‌ మాతాకు జై అనేవారా? ఈ రోజు బిజెపితో కలసి మిశ్రమ ప్రభుత్వ నేతగా ప్రమాణ స్వీకారంచేసిన మెహబూబా ముఫ్తి ఆ నినాదమిచ్చారా? ఎందుకు కావాలని ఏదో వొక వివాదం రేపి ఉద్రిక్తత పెంచడం? మదర్‌ ఇండియా ! భారత మాతా!
అయినా వీరికి అంత దేశభక్తి పెల్లుబికితే రామమందిరం వివాదం కంటే భారత మాత మందిరం పైనే ఉద్యమం చేసేవారు కదా? ఎంత గొప్ప దేశభక్తులైనా తలలు నరకాలనడంలో వుండేది ద్వేషభక్తి తప్ప దేశభక్తి కాదు,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *