ఇన్‌స్టంట్‌లైఫ్‌తో ఇన్ని చిక్కులా?

i-Life_0
బిజీ…టైం లేదు.. అబ్బే అంతసేపా కష్టమే.. రేపటికి గాని పూర్తికాదా అయ్యో.. మరెలా? అరగంటలో ఇవ్వలేరా? గంటలో అయిపోదా? మళ్లీ రేపు రావాలా? ఇలాటి మాటలు ప్రతిరోజూ ప్రతిచోటా వింటుంటాం. అంటుంటాం కూడా. ఇంత హడావుడి ఎందుకు అనుకుంటూ కూడా అలాగే చేస్తుంటాం. అయిదు రోజుల క్రికెట్‌ మ్యాచ్‌ 20 ఓవర్లకు వచ్చేసింది. సెల్‌ఫోన్‌లో అప్పటికప్పుడు మాట్లాడి తేల్చేసుకుంటున్నాం. ఫ్లాస్‌మాబ్‌; ప్లాష్‌ పోయెట్రీ, ఇన్‌స్టంట్‌ రెస్పాన్స్‌ ఒకటేమిటి అన్ని అప్పటికప్పుడే అక్కడికక్కడే అయిపోవాలంతే! ప్రతివారూ ప్రతిదీ ఇక్కడి కిక్కడే ఇప్పటికిప్పుడే అయిపోవాలంటున్నారు. ఇలా ఎక్కువ సేపు చెబితే వినడం కూడా కష్టమే గనక విషయంలోకి వద్దాం.మనం ఇలా చెప్పుకునే ఈ ధోరణి దానికదే వచ్చింది కాదు, దాని వెనక సాంకేతిక సామాజిక కారణాలున్నాయంటారు వ్యక్తిత్వ వికాస నిపుణులు వనితా ద్వారా నంగియా. నాకుబాగా నచ్చిన ఆ కాన్సెప్ట్‌ను వెబ్‌ మిత్రులతో పంచుకోవటానికే ఈ పోస్టు.
ఇప్పుడన్నీ ఇన్‌స్టంట్‌గా అక్కడికక్కడే అప్పటికప్పుడే జరిగిపోవాలని ఆరాటం అప్పటికప్పుడే విజయం వచ్చేయాలి. ఒత్తిడి,,టెన్షన్‌.. స్ట్రెస్‌.. ఆ ప్రహసనం ముగియగానే ఉన్నఫలాన ఉపశమనం దొరకాలి. ఉల్లాసం కావాలి. దాన్ని వెతుక్కోవడంలో మరింత ఉద్రిక్తత!
మనం ఆరాధించే వాళ్లు మనం కోరుకునేవాళ్లు ఎప్పుడూ రెడీగా వుండాలి. బ్యూటిఫుల్‌ షేప్‌లోనే కనిపించాలి. సిక్సర్లు కొట్టేయాలి. హిట్లు ఇచ్చేయాలి.లోతుగా ఆలోచించడం మధించడం వంటి నస వుండనే కూడదు. చకచకా గబగబా జరిగిపోవాల్సిందే. స్పీడ్‌లైఫ్‌ ఫాస్ట్‌ఫుడ్‌.. రన్‌ రన్‌ రన్‌.. విన్‌ విన్‌ విన్‌.. మనం తప్ప నన్‌ నన్‌ నన్‌ .. ఆల్వేస్‌ ఓన్లీ వన్‌..సర్దుబాట్లు సవరణలు విమర్శలు వీటన్నిటికి సమయం ఎక్కడ.. రన్‌ రన్‌ . రిస్క్‌ తీస్కో హస్క్‌ వేస్కో..ఆఖరుకు ప్రేమ కోసం కూడా నిరీక్షించే టైము ఎక్కడీ లేఖలు ఫోన్లు, కబుర్లు అబ్బే కుదరదు. ఎస్‌ఎంఎస్‌లు వాట్సప్‌లలో తేలిపోవాల్సిందే. తక్షణ తీర్పులే తప్ప నిరీక్షణలు రక్షణలు కుదరదంటే కుదర్దు.
తలిదండ్రులు చెప్పేది వినేంత ఓపిక ఎక్కడీ పోనీ మన పిల్లలనైనా పెరగనిచ్చేంత తీరిక ఎక్కడీ వాళ్లు ఘటోత్కజుడిలా ఒక్కదెబ్బతో పెద్దవాళ్లయిపోవాలి.ర్యాంకులు రావాలి లిటిల్‌ చాంపులు కావాలి.
సూటిగా సుత్తిలేకుండా చెప్పాలి గాని వివరంగా మాట్లాడితే అబ్బో భరించలేనంత బోరు. కట్‌ ఇట్‌. గెట్‌ ఔట్‌. టీవీ రిమోట్‌ రెప్పవేసేంత సేపట్లో తిప్పేయాల్సిందే. ఇది యూత్‌కే కాదు? పెద్దలకూ వర్తించే సత్యం.
మెబైల్‌ ఫోన్‌ టీవీ రిమోట్‌, ఫాస్ట్‌పుడ్‌ వాట్సప్‌, ఫాస్ట్‌ పార్వర్డ్‌, వన్‌డే మ్యాచి లిమిటెడ్‌ ఓవర్స్‌ క్విక్‌ ఫిక్స్‌ సొల్యూషన్స్‌ ఈ లైఫ్‌ స్టైల్‌ లోనే బతికేస్తున్నాం కదా? వీటి మధ్య పరస్పర సంబంధం అర్థమైందా? ఇంత హడావుడి పడటమెందుకు? రేపు లేదా? రాదా? ఏమో ఎవరికి తెలుసు అని అడుగుతున్నారా? వస్తుందే లేదోనని భయపడుతున్నారా? అంతసేపు వుండలేమనుకుంటున్నారా? అంత భయం అక్కర్లేదు. కాలం నిరంతరాయమైంది. వస్తూనే వుంటుంది. ప్రపంచంలో గొప్ప విషయాలు విజయాలు ఏవీ క్షణాల మీద సాధ్యపడలేదు.మనం ప్రయాణీంచే వాహనం, కూచున్న భవనం పనిచేసే సంస్థ మన కుటుంబ ప్రతిపత్తి ప్రతిదీ చాలా సమయం తీసుకున్న విషయాలే. ఇప్పుడు మీరు ఎటిఎంలో తీసుకునే డబ్బు రేపు కట్‌ అవుతుంది. వేగంగా నడిపే కారు అడ్బర్టయిజ్‌మెంట్‌ రోడ్డు నిబంధనల మేరకు నడవాల్సి వుంటుంది. అంతెందుకు? అమ్మ తొమ్మిది నెలలు మోశాకే మనం పుడతాం. కాబట్టి ప్రతిదానికి ఒక ప్రక్రియ పరిణామం తప్పదు మరి!
ఈ పదాల్లోనే కాకపోయినా ఇలాటి సారాంశం చెప్పిన వనితా దావ్రా ఒక పాత సామెతతో ముగిస్తారు- వేచివుండగలిగిన వారినే మంచి ఫలితాలు వరిస్తాయి. పరుగుల మధ్యనే కాస్త ఆలోచించాల్సిన విషయాలు కదా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *