వామపక్షాలకు ప్రాంతీయపార్టీలకు శుభం!

_33dc1546-bce6-11e5-9fa5-7bc8f9858c8d

త్వరలో జరగనున్న అయిదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఇండియాటుడే సీ ఓటర్‌ వెలువరించిన సర్వే వామపక్షాలకు ప్రాంతీయ పార్టీలకు శుభసూచన కాగా బిజెపికి మిశ్రమంగా వుంది. ఇక కాంగ్రెస్‌కు అస్సాం అస్పష్టత తప్ప మిగిలిన అన్ని చోట్లా ఆశలేమీ లేవు. ఈ ఎన్నికలు ప్రకటించిన మొదట్లో ప్రకటించిన సర్వే ఫలితాలతో పోలిస్తే ఇప్పుడు మరింత స్పష్టత వచ్చిందంటే పోలింగు నాటికి ఇదే దిశలో ఇంకా మెరుగుదల వుండొచ్చు.

ఈ సర్వే ప్రకారం కేరళలో ఎల్‌డిఎప్‌ 86 స్థానాలతో విజయభేరి మోగించనుండగా యుడిఎఫ్‌ 53 దగ్గరే ఆగిపోయింది. బిజెపి ఎంత ప్రయత్నించినా అక్కడ ప్రాతినిధ్యం పొందే అవకాశం కనిపించడం లేదు. వస్తే గిస్తే ఒక్కసీటు రావచ్చన్నది అంచనా. మార్చి మొదటి వారంలో సర్వే ఎల్‌డిఎప్‌కు 89,యుడిఎప్‌కు 49 వస్తాయని చెప్పగా ఇప్పుడు కొద్దిగా మార్పు వుంది.
తమిళనాడులో డిఎంకె కాంగ్రెస్‌లు ఎంతగా ప్రయత్నించినా అధికారం దక్కబోదని ఈ సర్వే చెబుతున్నది. అదే జరిగితే కొత్త పరిణామమే. ఎందుకంటే కేరళ తమిళనాడుల్లో అధికార పార్టీల మార్పిడి సర్వసాధారణం. అవినీతి కేసులో బయిటపడిన జయలలిత అభిమానం పెంచుకున్నా అనేక కారణాలవల్ల అసంతృప్తిని ఎదుర్కొంటున్నారని గతంలో కథనాలు వచ్చాయి. అయితే 234 స్థానాలు గల ఆ రాష్ట్రంలో జయలలిత అన్నాడిఎంకె 130 స్థానాలతో మరోసారి అధికారంలోకి వస్తుందని ఈ సర్వే అంచనా వేసింది. డిఎంకె కూటమికి 53 మాత్రమే ఇచ్చింది. అన్నిటికన్నా ఆసక్తికరమైంది వామపక్షాలు డిఎండికె,ఎండిఎంకె విసికెలతో కూడిన మూడో ఫ్రంట్‌కు 34 స్థానాలు రావచ్చంటున్నది. మార్చి మొదటి వారంలో చేసిన సర్వేలో నైతే అన్నా డిఎంకె 116 మాత్రమే వస్తాయని డిఎంకె 101 తెచ్చుకుంటుందని అంచనా కట్టింది. అప్పుడు మూడో ఫ్రంట్‌కు 17 స్థానాలుంటే ఇప్పుడు రెట్టింపునకు పెరిగాయి. విజరుకాంత్‌ చేరికతో పాటు ఇతర కారణాలు కూడా దీనివెనక వుండొచ్చు.

ఇక బెంగాల్‌లో టింఎంసినే అధికారం నిలబెట్టుకుంటుందని అప్పుడు ఇప్పుడూ కూడా సర్వే చెబుతున్నది. సీట్లలోనూ పెద్ద తేడాలు లేవు. అప్పుడు ఆపార్టీకి 156 వస్తాయని లెక్కగడితే ఇప్పుడు 160 అంటున్నది. వామపక్షాలకు అప్పుడు 114 చూపిస్తే కొంచెం తక్కువగా ఇప్పుడు 106 వేసింది. కాంగ్రెస్‌కు మాత్రం 13 నుంచి 21కి పెంచింది. బహుశా వామపక్షాలతో పోటీ నివారణ వల్ల కాంగ్రెస్‌కు కొన్ని స్థానాలు కలసివస్తాయన్నది ఇక్కడ విశ్లేషణ కావచ్చు. బిజెపికి నాలుగు స్థానాలు ఇతరులకు మూడు ఇవ్వడం కూడా విశేషమే. ఈ 4 గతంలోనూ ఇలాగే వున్నాయి.

ఇక బిజెపికి ఆశలు పెట్టుకున్న అసోంలో దానికీ కాంగ్రెస్‌కూ పోటాపోటీ వున్నట్టు తాజా సర్వే సంకేతాలిస్తున్నది. బిజెపి కూటమికి 55, కాంగ్రెస్‌కు 53 వస్తాయని అంచనా వేసింది. ఎఐయుడిఎఫ్‌కు 12 స్థానాలు ఇచ్చింది. అదే జరిగితే దాని పాత్రే కీలకం అవుతుంది. మార్చి మొదట్లో చేసిన సర్వేలో బిజెపికి 57 చూపిస్తే ఇప్పుడు రెండు తగ్గడం కంటే కాంగ్రెస్‌కు 44 నుంచి దాదాపు పది పెరగడం ఆసక్తికలిగిస్తుంది. నిజంగా ఇవే ఫలితాలు వస్తే వారికి పట్టపగ్గాలుండవేమో!
ఈ సర్వేలు సంకేతాలుగా తీసుకుంటే బిజెపి బలం అనుకున్న మేరకు కూడా పెరగడం లేదనిపిస్తుంది. వామపక్షాలకే ఇది నిజంగా శుభసూచన అనుకోవాలి.బెంగాల్‌లో తృణమూల్‌ గట్టిపోటీనే ఎదుర్కొంటుండగా ఫ్లైవోవర్‌ కూలిన ఘటన మరింత ఇరకాటంలో పెట్టిందని మీడియా వర్గాల కథనం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *