అంటరాని తనానికి ఆరెస్సెస్‌ భాష్యం

dalits111 దాచేస్తే దాగని సత్యంలా మనసులో మాటలు బయిటకు వస్తుంటాయి. తమిళనాడు ఎన్నికల ప్రాంగణంలో బిజెపి నాయకుడు ఎల్‌.గణేషన్‌ దళితుల పట్ల వివక్షపై కొత్త వివాదానికి కారకులైనారు. తరతరాలుగా అంటరాని తనాన్ని శాపంగా అనుభవించిన దళితులను మరింత బాధపెట్టే వ్యాఖ్యలు చేశారు. ఆయన చెప్పే ప్రకారం అంటుకోకుండా దూరం వుండటం వారే అలవాటు చేసి వుంటారట. శవాలను కాల్చేపని చేసేవారు ఆరోగ్య కారణాల రీత్యా ఇతరులకు దూరంగా వుండటం మంచిదని తమకు తామే దూరంగా మసులుకోవడం మొదలుపెట్టారట. ఈ విధంగా పరిశుభ్రత రోగనిరోధం కోసం మొదలైన అలవాటు అసృశ్యతగా మారిందట. ఎందుకంటే వారే .దూరంగా వుంటుంటే ఇతరులు దాన్ని ఒక ఆచారంగా చేశారట. భగవద్గీతలో కర్మను బట్టి వర్ణం అని చెప్పారేగాని పుట్టుకను బట్టి కాదని కూడా సూత్రీకరించారు. దీర్ఘకాలంగా ఆరెస్సెస్‌ సభ్యుడైన తాను సంస్థ ఎన్నడూ కుల వివక్షపాటించదని చెప్పగలనని ఆయన అంటారు. . ఈ హాస్యాస్పద వ్యాఖ్యలు తమిళనాడులో తీవ్ర సంచలనం కలిగించాయి. మామూలుగానే కింది కులాల చైతన్యం సమీకరణలు ఎక్కువగా వుండే రాష్ట్రం గనక ఒక్కసారిగా నిరసనలు వ్యక్తమైనాయి. అవార్డు గ్రహీత రచయిత ఇమాయం మాట్లాడుతూ బ్రాహ్మణీయ సమాజం రుద్దిన ఈ అమానుషాన్ని దళితులు స్వయంగా సృష్టించుకున్నదిగా చెప్పడం దారుణమని అన్నారు. ఈ వాదనకు ఎక్కడా ఎలాటి ఆధారాలు లేవని పై తరగతులను పరిరక్షించేందుకే గణేశ్‌ దీన్ని తీసుకొచ్చారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.వికెసి అద్యక్షుడు రాధాకృష్ణన్‌ ఈ వ్యాఖ్యలపై ధ్వజమెత్తుతూ ఈయనేమైనా చరిత్రకారుడా పరిశోధకుడా ఇష్టానుసారం సిద్ధాంతాలు వదులుతున్నారు అని ఆక్షేపించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *