జెపి ,చిరంజీవి,పవన్, కోదండరాం ఎదురుదెబ్బల గుణపాఠాలేమిటి?


ఎన్నికల ప్రక్రియలో పాల్గొనబోమని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు డా.జయప్రకాశ్ నారాయణ్ చేసిన ప్రకటన పరిశీలకులలో ఆసక్తి కలిగించింది. ఎన్నికల వ్యయం పెరుగుదల కలుషిత రాజకీయ వాతావరణం నిజమే అయినా పలు పార్టీలూ, పొందికలూ పాల్గొని తమ వంతు పోరాటం చేస్తూనే వస్తున్నాయి. నిబద్ద రాజకీయపార్టీలుగా పేరొందిన కమ్యూనిస్టు పార్టీలు కూడా సీట్ల సంఖ్యతో నిమిత్తం లేకుండా ఎన్నికలలో ఎదురీత సాగిస్తూనే వున్నాయి. దానికి సమాంతరంగా ప్రజా ఉద్యమాలూ పోరాటాలు కూడ నిరంతరాయంగా నిర్వహిస్తూ ప్రజల కోసం కొన్నయినా రాయితీలు కోర్కెలు సాధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చూస్తే పదేళ్ల కిందట లోక్‌సత్తా కార్యక్రమాలు మేధావిగా పేరొందిన జెపి విశ్లేషణలూ ప్రవచనాలు విశేష ప్రచారంలో వుండేవి. లోక్‌సత్తాి ముందు స్వచ్చంద సంస్థగా పనిచేస్తూ వచ్చింది. పార్టీగా అవతరించిన తర్వాత కూడ ఆ సంస్థ కొనసాగుతూనే వుందన్నది గమనించాల్సిన విషయం. లోక్‌సత్తాతో పాటు వెబ్‌సైట్‌లో ఎఫ్‌డిఆర్‌ఐ అనే మరో వేదిక కూడా వుండేది. అమెరికాతో సంబంధాలను ప్రభుత్వాల సా ్థయి నుంచి ప్రజల స్థాయికి తీసుకురావాలనేది ఎప్‌డిఆర్‌ఐ లక్ష్యం. వున్న చట్టాలను విశ్లేషిస్తూ వాటిని అమలు చేస్తే విశుద్ధ రాజకీయాలు వస్తాయనేది జెపి ప్రధాన వాదనగా వుండేది. ఏదైనా సమస్య వుంటే చట్టాలను మార్చాలని సూచించేవారు. మొత్తంపైన చర్చలు చట్టాలు మధ్యతరగతి వేదికలతో మార్పు వస్తుందని ఆయన ప్రధాన వాదన. రాజకీయంగా దోపిడీ పీడన మతతత్వం, సామ్రాజ్యవాద వ్యతిరేకత వంటి పదాలు గాని భావలు గాని లోక్‌సత్తా నేత ప్రస్తావించేవారు కాదు. కొన్ని పోరాట రూపాలను బహిరంగంగానే విమర్శించేవారు. మన్మోహన్ సింగ్ హయాంలో అణు ఒప్పందాన్ని చాలా బలంగా సమర్థించిన వారిలో జెపి ఒకరు. వామపక్షాలపై ఆధారపడిన యుపిఎ 1 తీసుకొచ్చిన పలు చట్టాల వెనక నాటి సలహా సంఘ సభ్యుడుగా తానున్నానని ఆయన చెబుతుంటారు. ఆ పార్టీ పాలకపక్షాలకు వ్యతిరేకంగా కొన్ని సందర్భాల్లో వామపక్షాలతో కలసి పనిచేసిన ఎన్నికలలో పాల్గొన్న ఉదాహరణలూ వున్నాయి. 2014 ఎన్నికల తర్వాత లోక్‌సత్తా బాగాదెబ్బతిన్నది. విభజన నేపథ్యంలో వ్యవస్థాగత సంక్షోభం కూడా ఎదుర్కొన్నది. మరోవైపున కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా కేంద్రంలో ఏదైనా బాధ్యత కోసం జెపి ప్రయత్నించారని బిజెపి నేతలు చెబుతుంటారు. ఆ సంగతి ఎలా వున్నా దేశాన్ని అట్టుడికిస్తున్న సైద్ధాంతిక వివాదాలలో జెపి స్పష్టంగా మతతత్వాన్ని ఖండించడం,బిజెపి ధోరణులను నిరసించడం తక్కువ. సంప్రదాయ రాజకీయ పార్టీలంటూ అన్నిటినీ కలిపి విమర్శించడం, కమ్యూనిస్టులు మంచివారైనా బూజు పట్టిన సిద్ధాంతాలను పట్టుకుని వేళ్లాడుతున్నారని వ్యాఖ్యానించడం కద్దు. జెపి సరళీకరణను మతతత్వాన్ని ఆధిపత్యాలను ఆ భాషలో ఎన్నడూ వ్యతిరేకించకపోగా ఇప్పుడు జరిగేది నిజమైన సరళీకరణ కాదంటారు. సంపన్నులకు రాయితీలపై పెద్దగా పెదవి మెదపని జెపిసంక్షేమ పథకాలు ప్రజలను బిచ్చగాళ్లుగా చేస్తాయని తరచూ విమర్శిస్తారు. మొత్తంపైన మేధా పటిమ, స్వచ్చమైన రాజకీయాల నినాదం వంటివి వున్నా సైద్ధాంతికంగా ప్రత్యామ్నాయ విధానాలు లోక్‌సత్తా ప్రతిపాదించిన దాఖలాలు కనిపించవు. దామషా ప్రాతినిద్యంపై మాత్రం నిరంతరం ప్రతిపాదన చేస్తూ వచ్చింది. హంగూ ఆర్భాటాలు లేని పార్టీలు ఎన్నికల పోరాటంలో పాల్గొని తమ ఓటింగు తెచ్చుకోవడం కష్టం గనక దామషా ప్రాతినిధ్యం వుండాలనేది సరైన వాదనే గాని పాలక పార్టీలు అందుకు అంగీకరించడం సులభంకాదు
ఈ పదేళ్లలోనూ లోక్‌సత్తా ఎన్నికల రంగంపై చూపిన ప్రభావం చాలా స్వల్పం. పట్టణ మధ్యతరగతి నుంచి ఆశగా అటు వెళ్లిన చాలా మంది నిరుత్సాహానికి గురైన మాట నిజం. ఎన్నికల అపజయాలే గాక నిర్వహణా పద్ధతులు కూడా రాష్ట్ర విభజన తర్వాత కొంత గందర గోళానికి దారి తీశాయి. కనీసం వారు స్థానిక సంస్థల్లో తమకు వుంటుందని ఆశించిన ప్రభావం బొత్తిగా లేకుండా పోయింది. ఢిల్లీలో ఆప్ మొదటి సారి విజయం సాధించినప్పుడు చాలామంది లోక్‌సత్తా వైఫల్యాన్ని గుర్తు తెచ్చుకున్నారు. ఆ దశలో జెపి తదితరులు వారితో చర్చలు జరిపారు గాని ఎపిలో ఆప్‌ను ప్రారంభించకుండా తమనే బలపర్చాలని షరతు పెట్టారు. సహజంగానే ఆప్ ఆ షరతును ఆమోదించలేదు. రెండవ సారి వారు బ్రహ్మాండమైన విజయం సాధించడం దేశానికే ఒక సంచలనమైంది. ఆప్‌లో అనేక అస్పష్టతలు అపరిపక్వతలు వున్నా సామాన్య ప్రజలతో సంబంధాలు పెట్టుకోవడం, రిలయన్స్ వంటి కార్పొరేట్ల పోకడలను విమర్శించడం లోక్‌సత్తాకంటే దానికి కొంత భిన్నత్వం వాస్తవికత కల్పించాయి. మతతత్వాన్ని వ్యతిరేకించే విషయంలోనూ ఆప్ దృఢంగానే వ్యవహరిస్తున్నది. కమ్యూనిస్టులు కూడా ఒకటి ఆరా సీట్లు తెచ్చుకోవడం, అసలే రాకపోవడం చూశాము గాని ప్రజా చైతన్య ఉద్యమాలు వాటిని సజీవంగా వుంచుతున్నాయి. సమరశీల ప్రజా ఉద్యమాలలో పాల్గొనకపోవడం, లౌకిక ప్రజాస్వామిక విధానాలతో ఖచ్చితంగా ముందుకు రాకపోవడం, అంతర్గత సమస్యల వల్ల లోక్‌సత్తా తన పునాదిని విస్త్రత పర్చుకోలేకపోయింది. ఆధునిక ప్రక్రియలు, సాంకేతిక శిక్షణలు, అధ్యయన పత్రాలు వంటి వనరుల విషయంలోనూ ఆర్థిక వనరులలోనూ ఒకడుగు ముందే వున్నా ఈ కారణంగానే లోక్‌సత్తా వంటి సంస్థలు అస్తిత్వ వేదనకు గురవుతుంటాయి. తెలంగాణ విభజన కోసం జరిగిన ఉద్యమంలో అన్నీ తానే అనిపించిన కోదండరాం జెఎసి ఇప్పుడు అక్కరకు రాని చుట్టం కావడం కూడా అనేక గుణపాఠాలను అందిస్తుంది.
చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం ఒక్క ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌లో కలసి పోయింది.ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ భారీ ప్రచారార్భాటంతో ప్రకటించిన జనసేన ప్రారంభం కాకుండానే బిజెపి టిడిపికి వంతపాడే పాత్రకు పరిమితమైంది. ప్రజల కోసం ప్రతిదాన్నీ ప్రశ్నిస్తానని చెప్పిన ఆయన ప్రభుత్వాలకు మద్దతు పలికేందుకే పరిమితమైనారన్న విమర్శ ప్రతిచోటా వస్తున్నది. గతంలోనూ ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలలో ప్రభావ శీల పాత్ర వహించిన సోషలిస్టులు జనతా లోక్‌దళ్ వంటిపార్టీలూ రకరకాలుగా ప్రధాóన పాలక పార్టీలలో కలసి పోయాయి. కమ్యూనిస్టుపార్టీలు మాత్రం ఎన్నికలలో పాల్గొంటూనే ఆ జయాపజయాలతో నిమిత్తం లేకుండా ఉద్యమాలద్వారానూ సైద్ధాంతిక పోరాటాల ద్వారానూ చైతన్యాన్ని చాటి చెబుతున్నాయి. అంతర్జాతీయంగా సోషలిస్టు దేశాలు దెబ్బతిన్నప్పటికీ ఆ సంక్షోభాన్ని అధిగమించి నిలవగలిగాయి అదే సమయంలో తమ అభివృద్ధి ఆశించినంత లేకపోవడానికి కారణాలపై అధ్యయనాలు జరుపుతున్నాయి. ఆత్మ విమర్శ చేసుకుంటున్నాయి. ఎన్ని పరిమితులున్నా నిర్దిష్టమైన సైద్ధాంతిక నిబద్దత నిర్మాణ స్పష్టత వున్న కారణంగానే వాటి పునాదిని ఎవరూ ప్రశ్నించే పరిస్థితి రాదు. రేపు జరిగే ఎన్నికలలోనూ కేరళలో విజయానికి చేరువలో వున్నాయి. తామె 34 ఏళ్లు పాలించిన బెంగాల్‌లో గతపర్యాయం విజయం సాధించి వికృత పాలన సాగిస్తున్న మమత ప్రభుత్వాన్ని తొలిదఫాతోనే బలంగా సవాలు చేస్తున్నాయి. ఇదంతా వామపక్షాలకే చెల్లిన ప్రత్యేకత. రోజా ఉదంతం తర్వాత కమ్యూనిస్టులు ఒకరున్నా బాగుండేదని అందరవూ అనుకుంటున్నారని నేను గతవారం ఈ కాలమ్‌లో రాశాను. ఆంధ్రజ్యోతిలో ఆర్కే కొత్త పలుకు కూడా ఇంచుమించు అలాటి భావాన్నే వెలిబుచ్చడం యాదృచ్చికం కాదు.
భూములు లాక్కోవద్దని రైతులు పోరాడినా హక్కుల కోసం కార్మికులు ఉద్యోగులు ఉద్యమించినా విద్యార్థియువత చదువులు కొలువుల కోసం నినదిస్తున్నా అన్నిటి అంతస్సారమొకటే. మధ్యతరగతి పొదుపు మొత్తాలపై దాడి చేస్తూ వేలకోట్లు ఎగవేసిన విజరు మాల్యాలకు తివాచీలు పరవడమేమిటని జాతి ప్రశ్నిస్తున్నది. ఇవన్నీ సమకాలీన సత్యాలు. ఇలాటి ప్రత్యామ్నాయ దృక్పథం లేకుండా పైపై మెరుగులకు పరిమితమైతే మాత్రం ఉభయత్రా ఉదాసీనతే గోచరించి ఉత్సాహం ఆవిరై పోతుంది.ఆ పరిస్థితి రాకుండా చూసుకోవడం ప్రజాస్వామ్య వాదుల కర్తవ్యం. ప్రజల కదలికలో పాలు పంచుకోగలిగితే , నిరనసల వెనక నిజాన్ని బలపర్చగలిగితే నిరుత్సాహాలకు తావే వుండదు. పోయేదేమీ లేదు సంకెళ్లు తప్ప అంటూ రంగంలోకి దూకిన వారికి ప్రజలే అండగా నిలుస్తారు. ప్రతిఘటనలతో ప్రస్థానం సాగిస్తారు.