విషప్రచారాలు పటాపంచలు.

jnu1111

జెఎన్‌యులో ఏదో దేశద్రోహం జరిగిపోయిందనీ, అందుకు విద్యార్థి నేతలే బాధ్యులనీ పార్లమెంటు సాక్షిగా కేంద్ర నేతలే విష ప్రచారం చేశారు. తీరాచూస్తే ఎన్ని విచారణల తర్వాత కూడా వారి అపరాధాన్ని నిరూపించే సాక్ష్యాలు దొరికిందే లేదు. దేశానికి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చింది ముసుగులు ధరించిన బయిటివారేనని కూడా దర్యాప్తు కమిటీ పేర్కొంది. వారిపై సస్పెన్షన్లు ఎత్తివేశారు. కన్నయ్య కుమార్‌ వంటి వారు గతంలోనే బెయిలు పొందారు. ఇప్పుడు మరింత తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్న ఉమర్‌ ఖాలిద్‌, అనిర్బన్‌ భట్టాచార్యలకు కూడా ఢిల్లీ కోర్టు మధ్యంతరబెయిలు ఆరు మాసాల పాటు మంజూరు చేసింది. విచారణ జరిపిన కమిటీ వివరాలు మాకు తెలియజేయలేదని డీన్లు తీవ్ర నిరసన తెలిపారు. 21 మంది విద్యార్థులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేస్తే అసలు ఆరోపణలే అస్పష్టంగా వున్నాయి గనక సమాధానం ఇవ్వబోమని వారు ధిక్కరించారు. వీరిలో అత్యధికులు సోషల్‌ సైన్సెస్‌ విభాగానికి చెందినవారు. వారు సత్ప్రవర్తన గల వారనీ, వారిపై వేటు వేయడం తగదనీ ఆ విభాగం అధ్యాపక బృందం మొత్తంగా ప్రకటన చేసింది. మొత్తంపైన ఈ వివాదంలో విద్యార్థులపై విరుచుకుపడిన చాలా మంది ఇప్పుడు మౌనం వహిస్తున్నారు. అసదుద్దీన్‌ వొవైసీ భరత్‌ మాతాకు జై అనబోనని చెప్పడం గురించి కొత్తగా విమర్శలు కేంద్రీకరిస్తున్నారు. మతతత్వ రాజకీయాలకు పెట్టింది పేరైన ఒవైసీ మాటలకూ లౌకిక శక్తులకూ ఎప్పుడూ ఏ సంబంధం లేదు, వుండదు కూడా. ఆయనను వారెప్పుడూ సమర్థించిందిలేదు. నిజానికి హైదరాబాదు పాతబస్తీలో సిపిఎం మాజీ ఎంపి పి.మధు మాత్రమే ధైర్యంగా ప్రజలను సమీకరించి వారిని ఎదుర్కొనే ప్రయత్నం చేశారని అందరికీ తెలుసు. ఏమైనా ఫలానా నినాదం ఇవ్వాలని రాజ్యాంగంలో లేదు గనక ఎవరూ ఇలాటి విషయాల్లో నిర్బంధిచడం, చర్యలు తీసుకోవడం సాధ్యం కాదు. మహారాష్ట్ర శాసనసభలో ఒక మజ్లిస్‌ సభ్యుడిపై దీని ఆధారంగా తీసుకున్న చర్య కూడా కోర్టులో నిలిచేదికాదు. పేద మధ్య తరగతి ప్రజల జీవితాలపై జరుగుతున్న దాడిని విస్మరించి లేనిపోని వివాదాలవైపు మళ్లించడం మతతత్వ వాదులందరికీ అలవాటైన ఎత్తుగడే. ఈ సమయంలోనే జార్ఖండ్‌లో పశువుల వ్యాపారం చేసుకునే ఇద్దరు మైనార్టీలను దారుణంగా హత్యచేయడం అల్లర్లకు దారితీసింది. వారిలో ఒకరు మజులం అన్సారీ కాగా మరొకరు ఇంతియాజ్‌ అనే పదమూడేళ్ల కుర్రాడు. ఈ ఘటనలో అయిదుగురిని అరెస్టు చేసిన పోలీసులు వారికి ఏ సంస్థలతోనూ అనుబంధం లేదని చెబుతున్నారు గాని షరా మామూలుగా గొడ్డు మాంసం అనుమానంతోనే వారిని హతమార్చారని బలమైన అనుమానాలున్నాయి. జార్ఖండ్‌లోని బిజెపి ప్రభుత్వం ఇందుకు బాధ్యత వహించాలని ప్రతిపక్షాలు విమర్శించాయి.
ఈ హత్యల సంగతి ఇలా వుంటే – దేశ భద్రత గురించి అంత గొప్పగా చెప్పే మోడీ ప్రభుత్వం ఎంత అస్తవ్యస్తంగా నడుస్తున్నదో పార్లమెంటు సాక్షిగా వెల్లడైంది. పఠాన్‌కోటలో ఉగ్రవాద దాడిని పసిగట్టడంలోనూ అరికట్టడంలోనూ వైఫల్యంపై చాలా విమర్శలే వచ్చాయి. దాని గురించి విచారించేందుకు పాకిస్తాన్‌ నుంచి ఒక దర్యాప్తు బృందం వస్తున్నట్టు తాను మీడియా ద్వారానే తెలుసుకున్నానని సాక్షాత్తూ హౌం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సభలో ప్రకటించారు. విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ స్వంతంగా ఈ నిర్ణయం తీసుకున్నారా? ఇంత కీలకమైన శాఖల మధ్య సమన్యయం వుండదా అంటే దటీజ్‌ మోడీ సర్కార్‌!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *