మాల్యాలకు విజయం- మధ్యతరగతికి విలయం!

92a8392e4b1e71d790158441624102e0
చిన్న పొదుపు మొత్తాలపై వడ్డీ రేట్లను కోత కోస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం మధ్యతరగతికి పెద్ద దెబ్బ. కిసాన్‌ వికాస్‌పత్రపై వడ్డీరేటును 8.7 నుంచి 7.8 శాతానికి, పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌పై వడ్డీని 8.7శాతం నుంచి 8.1 శాతానికి కుదించేసింది. ఏడాది పొదుపు పథకాలపై వడ్డీని 8.4 నుంచి 7.1 శాతానికి, రెండేళ్ల డిపాజిట్టకు 8.4 నుంచి 7.2కు అయిదేండ్ల పొదుపుపై వడ్డీని 8.5 నుంచి 7.9శాతానికి తగ్గించారు. సమాజానికి ఆదరణీయులైన సీనియర్‌ సిటిజన్ల పొదుపు మొత్తాలపై వడ్డీని 9.3 శాతం నుంచి 8.6 శాతానికి కోసేసింది. ఐదేండ్ల ఆర్‌డిపైన కూడా 8.4 శాతం నుంచి 7.4శాతానికి వడ్డీని తగ్గించేసింది. నిజానికి మొన్న బడ్జెట్‌లోనే ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ పిఎప్‌ వడ్డీ రేట్లను తగ్గించేందుకు, రిటైర్డ్‌ ఉద్యోగుల విత్‌డ్రాయల్స్‌పై 60 శాతం మొత్తంపై వడ్డీ విధించేందుకు ప్రతిపాదనలు చేశారు. ప్రతిపక్షాలూ కార్మిక ఉద్యోగ సంఘాల నిరసన తర్వాత వెనక్కు తగ్గారు.అయితే ప్రాథమికంగా మధ్య తరగతి పొదుపు మొత్తాలను మార్కెట్‌లోకి మరలించాలనే దురుద్దేశంతోనే చిన్న పొదుపరులను నిరుత్సాహపర్చే ఈ వడ్డీ కోతలు ప్రకటించారు. దీనివల్ల వారు పొదుపు లాభదాయకం కాదని స్టాక్‌ మార్కెట్‌లో ప్రవేశించి దాని ఒడుదుడుకులకు గురి కావచ్చు. లేదంటే వస్తువుల కొనుగోలుకు వినియోగించి వాటి మార్కెట్‌ పెంపుదలకు దోహదపడొచ్చు. ఏది జరిగినా వారి భవిష్యత్‌ జీవిత ఆర్థిక భద్రత భగమవుతుంది. చీమల్లా బొట్టు బొట్టు పొదుపు చేసే మధ్య తరగతి మనుషులపై ఇంత కఠినంగా వేటు వేసిన ప్రభుత్వం వేల కోట్లు రుణాలు మింగే విజరుమాల్యాలాటి వాళ్లను లలిత్‌ మోడీ వంటిఆర్థిక నేరగాళ్లను మాత్రం అక్కున చేర్చుకోవడం దారుణం. వ్యాపార వర్గాలకు పారిశ్రామిక వేత్తలకు అంతకంతకూ రాయితీలు పెంచే పాలకులు పేద మధ్యతరగతి వర్గాలు, ప్రాణాలు తీసుకునే రైతులపై మాత్రం కరుణ చూపించరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *