కడియాల లెనిన్ రంగయ్య!

ఢిల్లీ నుంచి గల్లీ వరకూ.. కమ్యూనిస్టుపార్టీల నుంచి విద్యార్థి సంఘాల వరకూ ఎక్కడ ప్రగతిశీల శక్తుల ప్రదర్శనలు మహాసభలు జరిగినా మీకు లెనిన్ తప్పక దర్శనమిస్తుంటాడు. ఎప్పుడో చనిపోయిన లెనిన్ మనకు దర్శనమివ్వడమేమిటని ఎవరూ ఆశ్చర్య పోరు. ఎందుకంటే తల బాగా పైకెత్తి శిలా ప్రతిమలా నిల్చునే అపర లెనిన్ అందరికీ సుపరిచితుడే.
నాకూ మా కుటుంబానికి ఆత్మీయుడైన రంగయ్య మరణ వార్త బాధకలిగించింది- అంతటి నిబద్దత వున్న ‘తెలుగు లెనిన్’ కన్నుమూశాడా అని.
ఆ లెనిన్ ఇంటి పేరు వ్లదీమర్. అసలు పేరు ఇల్యీచ్.అయితే జారు చక్రవర్తి పోలీసుల కన్నుగప్పడం కోసం లెనిన్ అని మారు పేరు పెట్టుకున్నాడు. అదే తర్వాత ఆయనను వ్లదీమర్ ఇల్యీచ్ లెనిన్(విఐలెనిన్) ను చేసింది. అయితే మన లెనిన్ ఇంటి పేరు మాత్రం కడియాల. అసలు పేరు రంగయ్య. ఆ లెనిన్ పోలీసులను బురిడీ కొట్టించేందుకు పేరు మార్చుకుంటే ఈ రంగయ్య ఆయనతో తనకున్న పోలికలనుబట్టి వేషం కట్టి మనను బురిడీ కొట్టించేస్తుంటాడు.
మామూలుగా పెద్ద నాయకులు, ప్రముఖులు తమ కార్యక్రమాలు నిర్ణయించుకోవడం కోసం డైరీ చూసుకుంటారు. అలాగే ప్రజలు కూడా ఎక్కడ ఏం జరుగుతుంటే వెళ్లి పాల్గొనాలో చూసుకుంటారు. అలాటి వారికి కూడా వారి వారి సంఘాలు రాష్ట్రాలు పార్టీలు వుంటాయి. ఈ లెనిన్‌కు అలాటి హద్దులేమీ వుండవు. అన్ని కమ్యూనిస్టు పార్టీలు ప్రజా సంఘాల సభలు ఎక్కడ ఎప్పుడు జరుగుతాయో జాగ్రత్తగా గమనిస్తుంటాడు. ఆ కార్యకర్తలు ఆర్గనైజర్ల కన్నా ముందే వాలిపోతాడు.అన్నీ పరిశీలిస్తాడు. అందరినీ పలకరిస్తాడు. వాదనలు చేస్తాడు.
సరిగ్గా సభ లేదా ప్రదర్శన మొదలయ్యే సమయానికి కడియాల రంగయ్య కాస్త కమ్యూనిస్టు వైతాళికుడు లెనిన్‌గా మారిపోతాడు. కొద్ది పాటి మేకప్ చేసుకుని పిల్లిగడ్డం తగిలించుకుని తల పైకెత్తి దొరికిన ఏదో వాహనం ఎక్కి నిల్చుంటాడు. మిగిలిన వన్నీ విచిత్ర వేషాలైతే ఈయన పాత్రం లెనిన్ వేషంలో జీవించేస్తాడు.
అలా సంచరించిన తర్వాత ఆఖరులో వేదికపైకి ఎక్కేస్తాడు.చేతులూపుతూ కాస్సేపు కలయతిరిగి దిగిపోతాడు. వీలైన మేరకు నాయకులకు షేక్ హ్యాండ్లిస్తాడు. ఫోటోలకు ఫోజులిస్తాడు.
అన్ని చోట్ల ఫోటో గ్రాఫర్లు ఆయన ఫోటోలు తీసుకుంటారు.అన్ని భాషా పత్రికలలోనూ అనేక రాష్ట్రాలలోనూ ఆయన లెనిన్ వేషం ఫోటోలు వచ్చుంటాయి. మీరు నెట్లోకి వెళ్లి లెనిన్ అని కొట్టినా ఈయన వేషాలు కొన్ని వస్తాయి.
ఆయన గారి లెనిన్ వేషం అంత హిట్టు మరి!
రంగయ్య కేవలం లెనిన్ వేషం వేసి అలరించడమే గాదు. ఆయన ఆలోచనలనూ వినిపిస్తాడు.నిజానికి తను కేవలం కళాకారుడు కాదు. ఆ మాటకొస్తే అసలు కళాకారుడు కాదు. ఖచ్చితంగా అరవయ్యేళ్ల కమ్యూనిస్టు. గత యాభై ఏళ్లుగా సిపిఎం కార్యకర్త. అభిమాని. రాజకీయ అంశాలను అత్యంత శ్రద్దగా తెలుసుకుంటూ తనదైన విశ్లేషణనిస్తూ కొనసాగుతున్న చైతన్య శీలి. 80 ఏళ్ల వయసు వరకూ పట్టు వీడని విక్రమార్కుడుగా లెనిన్‌ను మనకు చూపించిన ఉత్సాహ వంతుడు.
కడియాల రంగయ్య జన్మస్థలం నెల్లూరు జిల్లా వాగులేటిపాడు. 1956లో కమ్యూనిస్టు నాయకుడు జక్కా వెంకయ్య క్లాసులు విని కమ్యూనిస్టు అయ్యాడు. తర్వాత కర్నూలు జిల్లా కొవెల కుంట్ల వద్ద రామచంద్రాపురంలో స్థిరపడ్డాడు.అక్కడా పార్టీతో సంబంధాలు కొనసాగించాడు.కమ్యూనిస్టు ఉద్యమంలో విభేదాలు వచ్చినపుడు సిపిఎం వైఖరి సరైనదని గుర్తించి దానితో నిలబడ్డాడు.. మొదట్లో కర్నూలు జిల్లాలో నగ్జలైట్ రాజకీయాలదే పై చేయిగా వున్న ఆ కాలంలోనే టి.నరసింహయ్య నాయకత్వాన జరిగిన పునర్మిర్మాణ కృషిలో పాలుపంచుకున్నాడు . ముఖ్యంగా రైతు సంఘ కార్యకలాపాలలో పాల్గొంటూ వచ్చాడు. స్వతహాగా రైతు. వ్యవసాయం కూడా చేశాడు. కూతురు కొడుకు పెళ్లిళ్లయి స్థిరపడ్డారు.
కడియాల రంగయ్య రోజు వారి కార్యక్రమాలు సంఘ నిర్మాణం వంటి అంశాల్లో కన్నా ప్రధానంగా రాజకీయ వాదాల పట్ల చర్చల పట్ల ఆసక్తి మెండుగా వున్న వ్యక్తి. మార్క్సిజం గురించీ కమ్యూనిస్టుల ఔన్నత్యం గురించి అదే పనిగా చెబుతూ ఉత్తేజ పడుతుంటాడు. కర్నూలు జిల్లాలో సిపిఎం నిలదొక్కుకున్న కొద్ది ఆయన కూడా ఉద్యమానికి దగ్గరవుతూ వచ్చాడు.అనుకున్నది ముక్కుసూటిగా చెప్పే అలవాటు. పెద్ద నాయకుల దగ్గరకు కూడా దొరేసుకుని పోయి ఏదో ఒక వ్యాఖ్యానం చేసి వస్తుంటాడు. నా దగ్గరకు వచ్చాడంటే వాదనలు చేసి చేసి చివరకు వ్యక్తిగతంగా మెచ్చుకుని వెళ్లేవాడు. ఎప్పుడూ ఆ చర్చ చర్చ సారం వొక్కటే మనం మరింత సమరశీలంగా సామ్రాజ్యవాద వ్యతిరేకత చాటిచెప్పాలి అని. నీవు పట్టించుకోవు గాని నా వేషం అదిరిపోయింది అని ఆనందంగా చెబుతాడు.
కాస్త ఎత్తు ఎక్కువైనా లెనిన్ ముఖ కవళికలు తనలో వున్నాయని అప్పటికి గుర్తించాడు. ఇతరులూ అంగీకరించారు. సామ్రాజ్యవాద వ్యతిరేక చైతన్యం గల ఆయన మారిన పరిస్తితులలో ప్రపంచానికి లెనినిజం ప్రాధాన్యత పెరిగిందని భావించి తను ఈ వేషం కట్టానని సైద్ధాంతిక వివరణ ఇస్తాడు. ఇందులో ఒకింత అతిశయోక్తి వుండొచ్చు గాని రాజకీయ చైతన్యం గల రంగయ్య లెనిన్ వేషం వెనక ఇలాటి కారణాలు కూడా వున్నాయన్నది నిజం. ఎవరికైనా సందేహం వుండి కదిలిస్తే లెనిన్ బోధలు తన భాషలో గుక్క తిప్పుకోకుండా చెప్పేస్తాడు. తట్టుకోవడం కూడా కాస్త కష్టమే అవుతుంది.
1992లో సోషలిజం ఎదురు దెబ్బలు తిన్న అనంతరం మద్రాసులో విజయ వాహినీ హాలులో సిపిఎం 14 వ మహాసభ జరిగినప్పుడు కడియాల రంగయ్య లెనిన్ బాట చేపట్టాడు. 1993 మేడే నాడు కర్నూలులో కార్మిక ప్రదర్శన సందర్భంగా లెనిన్‌గా కనిపించిన రంగయ్యను కర్నూలు ఎంఎల్ఎ ఎం.ఎ.గఫూర్ చూసి లెనిన్‌ను దించేశావు అన్నారట. ఆ మాటలు స్పూర్తిగా ఇంకా విజృంభించాడు రంగయ్య. తర్వాత రాష్ట్ర నాయకులు చాలా మంది మెచ్చుకోవడం ఉత్సాహమిచ్చింది. ఇక ఎక్కడ వామపక్షాలు ప్రజా సంఘాల ప్రదర్శన అన్నా వచ్చేస్తాడు. వయస్సును కూడా మర్చిపోయి ఆద్యంతం పాల్గొంటాడు. ఇందుకోసం రు.800 వెచ్చించి కోటు ఒకటి కుట్టించుకున్నాడు. కొంచెం కటింగ్ చేసుకుంటాడు. అంతే .. రంగయ్య లెనిన్‌గా మారిపోతాడు.
అప్పుడప్పుడు ఆరోగ్య సమస్యలు వస్తున్నా పట్టించుకోకుండా తిరిగే ఈ తెలుగు లెనిన్‌ను కుటుంబ సభ్యులు పెద్దగా ఆటంక పర్చరు. వినడనీ తెలుసు. ఒక చోట కుదరుగా వుండకుండా ఎక్కడ సమీకరణ వుంటే అక్కడ వాలుతూ వుంటాడు. బస తిండి రాకపోకల ఖర్చులు కూడా ఎలాగో నెట్టుకొస్తుంటాడు. ఆ మేరకు ఇస్తే సంతోషిస్తాడు. లేవని మాత్రం ఆగడు. యువతీ యువకుల రకరకాల కళారూపాలు విచిత్ర వేషాలతో వూరేగుతుంటే కడియాల లెనిన్ రంగయ్య తన పేటెంటు వేషంతో ప్రత్యక్షమై పోతాడు. దేశ వ్యాపితంగా పత్రికల్లో ఆయన చిత్రాలు వచ్చాయి. ఎందుకంటే కొల్కత్తా, తిరువంనతపురం, చండీఘర్, కొయంబత్తూరు ఎక్కడైనా సరే మన లెనిన్ వచ్చేస్తాడు. నాలాటి వాళ్లం ఏదైనా చెప్పబోతే గుర్రుమంటాడు గాని మౌలికంగా మార్క్సిస్టు కోణంలోనే మాట్లాడతాడు. వయస్సు ప్రభావం కనిపిస్తున్నా వెనక్కు తగ్గే సూచనలేమీ కనిపించవు. దటీజ్ అవర్ లెనిన్.
పెద్ద పెద్ద భుజకీర్తులు తగిలించుకుని దేశాన్ని అమెరికాకు గులాంగా మారుస్తున్న పాలకవర్గ నేతలకన్నా వున్న అవగాహనతో సామ్రాజ్యవాద వ్యతిరేకతకు లెనిన్ బోధలే మార్గమని చెబుతున్న రంగయ్య వంటి సాధారణ కార్యకర్తలు మిన్న అందుకే లాల్‌సలాం లెనిన్ రంగయ్య! అని మూడేళ్ల కిందట ఆదివారం సంచికలో రాశాను. ఇప్పుడు ఆయన మనకు దూరమైనప్పుడు మరోసారి మననం చేసుకోవడం మన ధర్మం.
ఇదే అదను లెనిన్కథను రచించెదను నేడు అన్నాడు మహాకవి మయకోవస్కీ. ప్రతి స్థలం లెనిన్ రూపు చూపించెద నేను అనుకొన్నాడు రంగయ్య. అలాగే అందరికీ గుర్తుండిపోతాడు.