వామపక్షాలకు కీలకం, కాంగ్రెస్‌కు గ్రహణం ద్రవిడపార్టీల జీవన్మరణం అస్సాంలోనైనా కమలవికాసం?
పహలే పంచ ప్రదేశ్,కల్ సారా దేశ్ అన్న నినాదం ఒకప్పుడు బిజెపికి బాగా అక్కరకు వచ్చింది. అయితే ఈ ఏప్రిల్,మే నెలల్లో జరగనున్న అయిదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు మాత్రం దానికి గడ్డు సవాలుగానే వున్నాయి. 2014 ఎన్నికల్లో అనుకోని విధంగా స్వంతంగా మెజార్టి పొందిన బిజెపికి అందులోనూ ప్రధాని నరేంద్ర మోడీ రాజకీయ భవితవ్యానికి ఇది పెద్ద పరీక్షే. ఒక్క అస్సాంపై ఆశలు మినహా ఈ పరీక్షలో మరెక్కడా ఆయన ప్రభావం పెద్దగా పనిచేయదు. ఈ ఫలితాలతో ఆయన ప్రభుత్వ మనుగడకు వచ్చే ముప్పు లేదు గాని విపరీత పోకడలకు పగ్గాలు తప్పదు. హెచ్‌సియు నుంచి జెఎన్‌యు వరకూ అన్నిచోట్లా అవాంఛనీయ వివాదాలు రగిలించిన అభివృద్దినిరోధక నినాదాలకు ఎదురుదెబ్బ తప్పదు. ఎందుకంటే ఎన్నికలు జరిగే రాష్ట్రాలు సంప్రదాయికంగా బిజెపికి పట్టున్నవి కావు. మోడీ మోత కారణంగా గతంలో కాసిన్ని సీట్లు లేదా చెప్పుకోదగిన ఓట్లు వచ్చివున్నా ఇప్పుడవి నిలబడవు. ఇప్పుడు ఎన్నికలు జరిగే రాష్ట్రాలన్నీ జమ్మూ కాశ్మీర్ తర్వాత అత్యధికంగా ముస్లిం జనాభా కలిగివుండడం మరో ప్రత్యేకత. ఢిల్లీ,బీహార్ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న బిజెపికి మూడో పరాజయం ఎదురుచూస్తున్నది. రెండేళ్లలో అన్నీ అపజయాలే మూటకట్టుకున్నట్టవుతుంది. ఈ ఫలితాల తర్వాత రాజ్యసభలో రాజకీయ పొందిక ప్రభుత్వానికి మరింత ప్రతికూలంగా మారుతుంది. 2017లో జరిగే ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో కూడా దెబ్బతింటే ఇక 2019 లోక్‌సభ ఎన్నికలపైనా ఆశలు వదులుకోకతప్పని స్థితి ఏర్పడుతుంది. ఇటీవల జరిగిన యుపి శాసనమండలి ఎన్నికల్లో 26 స్థానాలకు గాను 23 పాలక ఎస్‌పి తెచ్చుకోవడం అక్కడ కూడా ఆశలు ఆవిరి చేసింది. మేనెలలో అసెంబ్లీ ఫలితాలు వెలువడిన తర్వాత దేశంలో రాజకీయ చిత్రం మారిపోతుంది. బిజెపికి ఈ రాష్ట్రాలు బలమైన పునాది గలవి కావుగాని కాంగ్రెస్ అస్సాం కేరళ రెండు చోట్ల పాలిస్తున్నది. ఇక . కేరళ పశ్చిమ బెంగాల్ దేశంలోనే కమ్యూనిస్టు కంచుకోటలుగా పేరొందాయి గనక సిపిఎం వామపక్షాలకు కూడా ఇది చాలా కీలక రాజకీయ పోరాటమే. 2009,14 లోక్‌సభ ఎన్నికల్లోనూ 2011 శాసనసభ ఎన్నికల్లోనూ బాగా దెబ్బతిన్న వామపక్షాల పునరుత్తేజ క్రమంలో ఈ ఎన్నికల ఫలితాలకు చాలా పాత్ర వుంటుంది. ముందు ఆ రాష్ట్రాలతో ప్రారంభిద్దాం.
కమ్యూనిస్టు కేంద్రాలు
దేశానికి తొలి కాంగ్రెసేతర కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని అందించిన కేరళలో కాంగ్రెస్ కావాలని కుల మత రాజకీయాలను పెంచి పోషించి చిన్న చిన్న పార్టీలను గ్రూపులనూ ఏర్పాటు చేయించింది. అందుకే అక్కడ ఎవరికీ వంటరిగా పూర్తి మెజార్టీ వచ్చే అవకాశం వుండదు. సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎప్, కాంగ్రెస్ నాయకత్వంలోని యుడిఎప్ ఒకదాని తర్వాత మరొకటి అధికారంలోకి వస్తుంటాయి. గతసారి మాత్రం ఎల్‌డిఎప్ ఈ వరవడిని ఛేదిస్తూ మలిదఫా కూడా అధికారానికి చేరువగా వచ్చి ఓడిపోయింది. 48 స్థానాలతో సిపిఎం అన్నిటికన్నా పెద్ద పార్టీగా వచ్చింది. నాటి ముఖ్యమంత్రి అచ్యుతానందన్‌పై ప్రజల విశ్వాసం ఈ ప్రత్యేక పరిస్థితికి ఒక ప్రధాన కారణంగా భావించారు. తొంభై ఏళ్లు పైబడిన వయస్సులోనూ చురుగ్గా పనిచేస్తూ నీతి నిజాయితీలకు మారుపేరుగా నిలబడిన అచ్యుతానందన్‌ను ి అక్కడ అత్యున్నత నేతగాచూస్తుంటారు. సిపిఎంలో తీవ్ర స్థాయిలోనే అంతర్గత సమస్యలు వాటిపై బహిరంగ కథనాలు వచ్చినా సమిష్టిగా సరిచేసుకుని ఉద్యమాన్ని రక్షించుకోవడం ఒక విశేషం. తెల్లిచ్చేరి వంటిచోట్ల ఆరెస్సెస్ శక్తులు సిపిఎంపై పనిగట్టుకుని దాడి చేస్తూ ఉద్రిక్తత పెంచుతున్నా మోడీ ప్రచారార్బాటంలో కూడా కేరళలో వామపక్షాలు నిలబడ్డాయి. యుడిఎప్ ముఖ్యమంత్రి వూమెన్ చాందీ హయాంలో వరుస కుంభకోణాలే గాక వ్యక్తిగతంగానూ ఆరోపణల పాలై ప్రతిష్ట కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఎల్‌డిఎప్ అక్కడ విజయం సాధిస్తుందనే విషయమై ఎవరికీ సందేహాలు లేవు. బిజెపి శాసనసభలో ప్రాతినిధ్యం పొందుతుందా ఓట్ల శాతం పెంచుకుంటుందా వంటి లెక్కలు కొందరు వేస్తున్నారు. తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో బిజెపి 32 మందిని గెలిపించుకోవడం, కొన్ని పంచాయతీలు గెలవడం ఆధారంగా ఈ లెక్కలు వేస్తున్నారు గాని అసెంబ్లీ ఎన్నికల్లో అవన్నీ అక్కరకు రాకపోవచ్చు. ఇక సిపిఎంనుంచి అచ్యుతానందన్ పోటీలో వుంటారా లేదా అనేదానిపై ఎక్కువ కథనాలు నడుస్తున్నాయి గాని పోటీకి వయసు ఆటంకం కాదని సీతారాం ఏచూరి వ్యాఖ్యానించారు. దీనిపై తుది నిర్ణయం రాష్ట్ర కమిటీ తీసుకోవలసి వున్నా ఆయన ప్రచారంలో అగ్రభాగాన వుంటారనడంలో ఎలాటి సందేహాలు లేవు. కేరళ ఎన్నికల ఫలితాలు సిపిఎంకూ వామపక్షాలకూ చాలాకాలం తర్వాత కొంత వూరట నిస్తాయనే పరిశీలకులు చెబుతున్నారు. కేరళలో గత బలాబలాలు- కేరళ మొత్తం 140
సిపిఎం 45, కాంగ్రెస్ 38, ఐయుఎంఎల్ 20, సిపిఐ 13, కేరళ కాంగ్రెస్ మణి 9, జనతా దళ్ సెక్యులర్ 4, ఇండి 2, ఇతరులు 9
బెంగాల్‌లో తీవ్ర పోరాటం
34 ఏళ్ల వామపక్ష ప్రభుత్వ పాలన సాగిన పశ్చిమబెంగాల్‌లో భీకర పోరాటమే జరగనుంది. ఇందిరాగాంధీ నిరంకుశ పాలనను ఎదుర్కొని పోరాడటం, ఆ తర్వాత విజయ పరంపరలు బెంగాల్‌కు దేశంలోనే ప్రత్యేకత తెచ్చిపెట్టాయి. దీర్ఘకాలం అధికారంలో వున్న వామపక్ష ప్రభుత్వ ప్రజా శ్రేయో విధానాలు మన్నన పొందాయి. అలాటి చోట 2011లో,2014లో ఓడిపోవడం అభ్యుదయ శక్తులకు చాలా నిరుత్సాహం కలిగించింది. ే ఎన్నికలన్నాక ఓడిపోవడం అసాధారణం కాదు గాని ఈ ఓటమికి దారితీసిన పరిస్థితులు చాలా చర్చకు కారణమైనాయి. చివరి సంవత్సరాలలో కొన్ని పొరబాట్లు జరిగిన మాట కూడా వాస్తవమే. అయితే దాంతోపాటు అవిచ్చిన్నంగా కొనసాగుతున్న ఆ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని మమతా బెనర్జీ నుంచి మావోయిస్టుల వరకూ, కాంగ్రెస్ నుంచి కాషాయకూటమి వరకూ చేతులు కలపడం అంతర్జాతీయ పెట్టుబడులు కూడా అండగా నిలవడం విస్మరించరాని విషయం. శారదా చిట్‌ఫండ్ కుంభకోణం వెలుగు చూశాక ఈ రకరకాల శక్తులు ఎలా చేతులు కలిపాయో మీడియాను ఎలా వుపయోగించుకున్నాయో సోదాహరణంగా అర్థమైంది.అధికారం చేపట్టిన మమత సిపిఎం కార్యకర్తలపై అమానుష దాడులకు హత్యాకాండకు సాగిస్తున్నది. తనతో నడిచిన మావోయిస్టులను కూడా మట్టుపెట్టడంపై కేంద్రీకరించింది. ఈ దౌర్జన్యానికి ఒకప్పటి దాని మిత్రపక్షం కాంగ్రెస్ కూడా గురి కావలసిన పరిస్థితి. తృణమూల్ బీభత్స పాలనకు వ్యతిరేకంగా కలసి వచ్చేప్రజాస్వామిక శక్తులతో చేతులు కలిపి ఆ ప్రభుత్వాన్ని గద్దెదించాలని నిర్ణయించిన సిపిఎం సోమవారం 116 మంది అభ్యర్థులతో తొలిజాబితా ప్రకటించింది. ఇందులోనూ 68 మంది కొత్త వారే. ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు లేదా రాజకీయ అవగాహన వుండబోదని, వారితో కలసి ఒకే వేదికనుంచి ప్రచారం కూడా వుండదని సంఘటన చైర్మన్ బిమన్ బసు ప్రకటించారు. అయినా తృణమూల్ వ్యతిరేక ఓట్ల చీలిక నివారించేందుకు పోటీల నివారణ చేసుకోవడానికి వీలుగా చాలా చోట్ల అభ్యర్థులను ప్రకటించకుండా నిలిపివుంచింది. 1982లో మినహా మరెప్పుడూ తాము ముందుగా అభ్యర్థుల పేర్లు విడుదల చేయలేదని దశలవారీ విధానమే అనుసరించామని బిమన్‌బాసు గుర్తు చేశారు. కాంగ్రెస్‌కు బలమున్న ముర్షిదాబాద్,మాల్దా,ఉభయ దినాజ్‌పూర్ జిల్లాలలో మాత్రం చాలా తక్కువగానే వామపక్ష అభ్యర్థుల పేర్లు ప్రకటించారు. తృణమూల్‌ను ఓడించాలని కాంగ్రెస్ నిజంగా అనుకుంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా చూడవలసి వుంటుందని బాసు వివరించారు. మరోవైపున కాంగ్రెస్ నేతలు కొందరు సిపిఎం స్వంతంగా జాబితా విడుదల చేయడం, తమతో వేదిక పంచుకోబోమని చెప్పడంపై అసంతృప్తిగా మాట్లాడారు. అయినా తృణమూల్ ఓటమి కోసం కలసి వ్యవహరిస్తామంటూ సిపిఎంతో పోటీలేని 85 స్థానాలకు అభ్యర్థులనుప్రకటించారుేు. అయితే తర్వాత వామపక్ష ఫ్రంట్ కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించిన పదిహేను స్థానాల్లో తనూ పోటీకి సిద్ధమైంది. దాంతో అవగాహన భగమవొచ్చనే వ్యాఖ్యలు వచ్చాయి. ఈ దశలో ఇరు పక్షాల సీనియర్ నేతలు జోక్యం చేసుకుని చర్చలు జరిపారు. ఇరు పార్టీల కార్యాలయాలలో గాక గణశక్తి పత్రిక కార్యాలయంలో జరిగిన చర్చల్లో అంగీకారానికి వచ్చారు. తృణమూల్ నేత ఈ రెండు పార్టీలు కలసిపోయాయని ధ్వజమెత్తడమే గాక కేరళలోనూ సిపిఎంకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని ప్రకటించారు. అక్కడ 75 స్థానాల్లో అభ్యర్థులనూ ప్రకటించారు.అయితే పశ్చిమ బెంగాల్ ప్రభావం కేరళపై వుండబోదని ఇక్కడ బలాబలాల పొందికే వేరని అచ్యుతానందన్ గతంలోనే ప్రకటించి వున్నారు. సిఓటరు సంస్థ నిర్వహించిన సర్వేలో టిఎంసికి 153 స్థానాలు మాత్రమే రావడం గమనార్హం. ఒకవేళ ఓట్ల చీలిక నివారణే గనక జరిగితే అది ఆమెను మరింత దెబ్బతీస్తుంది. కాదు వామపక్షాలే ఇంకా దెబ్బతింటాయని కొందరు జోస్యాలు చెబుతున్నారు. బిజెపి పరోక్షంగా మమతకే సహకరిస్తుంది. వారికి వామపక్ష ప్రభుత్వం రాకుండా చేయడమే ఫ్రధానం. ఏమైనా బెంగాల్‌లో ఏం జరుగుతుందనేది దేశమంతటా ఉత్కంఠ రేపుతున్నది.
పశ్చిమ బెంగాల్ 294
టిఎంసి 184, కాంగ్రెస్ 42, సిపిఎం 40, ఫార్వర్డ్ బ్లాక్ 11, ఆర్‌ఎస్‌పి 7, గోర్ఖా జనముక్తి మోర్చా 3, సిపిఐ 2, ఇండి 2, ఇతరులు 3
ద్రవిడ పార్టీల యుద్ధం
తమిళనాడులోనూ డిఎంకె అన్నా డిఎంకెలు వరుసగా ఒకదాని తర్వాత ఒకటి అధికారంలోకి వస్తుంటాయి. ఇప్పుడు ముఖ్యమంత్రిగా వున్న జయలలిత అధికారం నిలబెట్టుకోవడానికి తీవ్రంగానే పోరాడవలసి వుంటుంది. అవినీతి కేసులో శిక్ష తర్వాత కూడా ఆమెకు అనుకూలత వుందని భావించినా చెన్నై వరదల సందర్భంగా సహాయ చర్యల్లో వైఫల్యం వంటివి ఆమెను వెన్నాడుతున్నాయి. ప్రధాన మిత్రపక్షమైన విజయకాంత్ ఎండిఎంకె దూరమైంది. మరోవైపున డిఎంకెకి కూడా 2జి కుంభకోణం, కరుణానిధి కుటుంబ కలహాలు వంటి సమస్యలు వున్నాయి. కాంగ్రెస్ మరికొన్ని ప్రాంతీయ పార్టీలుకూడా దాంతో చేతులు కలిపాయి. దాదాపు 8 శాతం ఓటింగు గల ఎండిఎంకె కూడా కలుస్తుందనుకుంటున్నారు. ఇక లోక్‌సభ ఫలితాల వూపులో బిజెపి ్ల 122+ స్థానాలు తెచ్చుకుంటానని మొదట గొప్పలు చెప్పినా ఇప్పుడు దరిదాపుల్లోనే లేదు. సిపిఎం సిపిఐ ఎండిఎంకె, విసికెలు కలసి పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్ పేరిట పోటీ చేస్తున్నాయి. ఏది ఏమైనా ద్రవిడ పార్టీలు రెండింటికీ ఈ ఎన్నికలు జీవన్మరణపోరాటంగానే వుంటుంది. సి ఓటర్ సర్వే ప్రకారం అన్నా డిఎంకె విజయం సాధించవచ్చు గాని ఆధిక్యత స్వల్పంగానే వుంటుంది.
తమిళనాడు 150
ఎడిఎంకె 150, ఎండిఎంకె 29,డిఎంకె 23, సిపిఎం 10, సిపిఐ 9, కాంగ్రెస్ 5, ఇతరులు 8
కేంద్ర పాలిత ప్రాంతమైన పాండిచ్చేరిలోనూ కొన్ని తేడాలున్నా ఈ ప్రభావాలు పనిచేస్తాయి.
పాండిచ్చేరి 30
ఎఐఎన్‌ఆర్ కాంగ్రెస్ 15, కాంగ్రెస్ 7, ఎడిఎంకె 5, డిఎంకె 2, ఇండి 1
అస్సాంలోనూ హంగ్ జోస్యాలు
ఇక మిగిలిన అస్సాంపైనే బిజెపికి ఆశలున్నాయి. 2014 పార్లమెంటు ఎన్నికల్లో అక్కడ బిజెపికి 36 శాతం ఓట్లు ,వున్న 14లో ఏడు స్థానాలు వచ్చాయి. మూడు పర్యాయాలుగా విజయం సాధిస్తున్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి తరుణ్‌గోగోరుపాలనపై అసంతృప్తి వుంది. గతంలో రెండు సార్లు రాష్ట్రాన్ని పాలించిన ఎజిపితోనూ బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్‌తోనూ బిజెపికి పొత్తు కూడా కుదిరింది. కాని ఎజిపి ఇప్పుడు బాగా బలహీనపడిపోయింది. ఎజిపిలో ఒక వర్గం బిజెపి పొత్తువద్దని భావించినా చివరకు ఎలాగో దారికి తెచ్చుకున్నారు. బీహార్‌లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో ప్రకటించకుండా ప్రధానినే ముందుంచి ప్రచారం చేసిన అనుభవం విఫలమైంది గనక అసోంలో సర్వానంద సోనోవాల్‌ను తమ నాయకుడుగా ముందే ప్రకటించారు. సోనోవాల్ ఎజిపి నేత అతుల్ బోరా, మాజీ ముఖ్యమంత్రి పికెమహంతల కంటే బాగా జూనియర్ కావడం వారికి ఇరకాటంగా వుంది. ఈ పొత్తుకు వ్యతిరేకంగా జిల్లాల్లో చాలా ప్రదర్శనలు జరిగాయి. అయినా 2014లో బిజెపితో పొత్తుకు నిరాకరించి నష్టపోయామని భావిస్తున్న ఎజిపి అనివార్యంగా ఇందుకు ఒప్పుకుంది. వామపక్షాలు అక్కడ కాంగ్రెస్‌ను గద్దెదించే, బిజెపి కూటమిని ఓడించే లక్ష్యంతో పోటీ చేస్తున్నాయి. బిజెపి బంగ్లా ముస్లిం శరణార్థుల సమస్యపైన, మతతత్వ రాజకీయాలు నడిపింది. సోషల్‌మీడియాను ఉపయోగించి కొన్ని ఉద్రిక్తతలకు కారణమైన చరిత్ర సంఘ పరివార్‌ది. మతతత్వంతో పాటు ఉపజాతి కలహాల సమస్య కూడా అక్కడ వుంది. ఇప్పటికే దేశంలో అవాంఛనీయ వివాదాలు రగిలించి వున్నారు గనక అసోంలో వాటిని పూర్తిస్థాయిలో ప్రయోగించడం తథ్యం.కాంగ్రెస్ దీర్ఘకాలం అధికారంలో వుండటం, బిజెపికి ఎజిపితో దోస్తీ కుదరడం ప్రభావంచూపొచ్చు గాని విజయం తేలిగ్గా వచ్చిపడుతుందని చెప్పలేము. ఇండియా టీవీ సి ఓటరు నిర్వహించిన సర్వేలో అస్సాంలో హంగ్ వస్తుందని తేలింది. కాంగ్రెస్ మొదట వంటరిగా పోటీ చేస్తానని ప్రకటించినా ఇప్పుడు మళ్లీ ఒకప్పటి భాగస్వామి ఎఐయుడిఎప్‌తో పొత్తుకు ప్రయత్నాలు చేస్తున్నది. 140 స్ధానాలున్న శాసనసభలో గతసారి కాంగ్రెస్‌కు 78, ఎఐయుడిఎఫ్‌కు 18 వచ్చాయి. కాంగ్రెస ్‌పాలించే ముఖ్య రాష్ట్రాలే నాలుగు కాగా అందులో రెండు చేజారిపోతే రాహుల్‌గాంధీ నాయకత్వం మరింత ప్రతికూలతను ఎదుర్కొంటుంది. ఆ రీత్యా ఆ పార్టీకే ఎక్కువ నష్టం అనే విశ్లేషణలు కూడా వున్నాయి గాని మోడీ నాయకత్వం పరిమితులేమిటో తేలిపోవడం పాలక పార్టీకే ఎదురుదెబ్బ అవుతుంది. ఆ తర్వాత 2017లో యుపిలోనూ గెలవలేకపోతే మోడీ ప్రభావానికి కౌంట్‌డౌన్ మొదలవుతుందని చెప్పొచ్చు.
అస్సాం 126
కాంగ్రెస్ 78, ఎఐడిఎఫ్ 18, బోడో పీపుల్స్ ఫ్రంట్ 12, ఎజిపి10, బిజెపి 5, తృణమూల్1, ఇండి 2
