అమెరికాకు చైనా తీవ్ర ఆక్షేపణ
సోవియట్ విచ్చిన్నంతో ఏకధృవ ప్రపంచం ఏర్పడిందని అమెరికాకు ఎదురు లేకుండా పోయిందని ఒక భావం బలంగా ప్రచారమైంది. మన పాలకులు కూడా దాన్నే అనుసరించడంతో యుపిఎ ఎన్‌డిఎ ప్రభుత్వాలు పోటీపడి అమెరికాకు సాగిలబడుతున్నాయి. ఒకప్పుడు అలీన దేశాలకు అగ్రనేతగా వున్న ఇండియానే ఇప్పుడు అమెరికా ప్రయోజనాల సాధనకు అతి పెద్ద దోహదకారిగా మారింది. అయితే ప్రపంచమంతా అలా లేదు. పుతిన్ నాయకత్వంలోని రష్యా ప్రభుత్వం కూడా ఇటీవలనే ప్రచ్చన్న యుద్ధం రోజులు తిరిగివచ్చినట్లుందని వ్యాఖ్యానించారు. సిరియాలో అమెరికా సైనిక జోక్యాన్ని రష్యా చాలా కాలం వ్యతిరేకించింది. తన విమానాన్ని ఐఎస్ఐఎస్ కూల్చివేసిన తర్వాత సిరియాలో పాశ్చాత్య దేశాలకు కాస్త తోడు నిలిచినా వాటివలె ఆదేశ ప్రభుత్వంపై గాక విద్రోహశక్తులపైన ప్రతీఘాత దళాలపైన కేంద్రీకరించాలని పట్టుపడుతున్నది. అమెరికా ఇరకాటంలో పడిపోగా టర్కీ మాత్రం రష్యా విధానాన్ని బహిరంగంగా వ్యతిరేకించింది. అయినా సిరియాలో ప్రభుత్వాన్ని బలవంతంగా కూలదోస్తే శాంతికి విఘాతం అన్న వైఖరినే రష్యా అనుసరిస్తున్నది. ఈ నెలలో సిరియాలో తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించే అవకాశముంది. అక్కడ తాము రష్యాపై పోరాడటం లేదని అమెరికా వివరణ ఇచ్చుకోవలసి వచ్చింది. కాగా ప్రచ్చన్న యుద్ధ లక్షణాలు ప్రస్పుటంగా కనిపిస్తున్నాయని రష్యా ప్రధాని మెద్వదేవ్ వ్యాఖ్యానించడం సంచలనం కలిగించింది.
ఇక ఇప్పుడు చైనా వంతు వచ్చింది. ఉత్తర కొరియా ప్రభుత్వం అణ్వస్త్ర పరీక్ష జరపడాన్ని వ్యతిరేకిస్తూనే కొరియాద్వీపకల్పంలో అస్థిర పరిస్థితులు సృష్టిస్తే సహించబోనని అమెరికాను సూటిగానే హెచ్చరించింది. అక్కడ అతి పెద్ద పొరుగు దేశం తామే గనక తమ భద్రత చూసుకోవలసి వుంటుందని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ సీ స్పష్టం చేశారు. దక్షిణ కొరియాలో అమెరికా సైనిక దళాలు అణ్వస్త్ర మొహరింపులు అందరికీ తెలిసినవే. కొరియా ద్వీపకల్పంలో సంపూర్ణ అణ్వస్త్ర నిర్మూలన జరగాలని చైనా చెప్పడంలో వీటిని కూడా తొలగించాలనే సందేశం ఇమిడివుంది. ఉత్తర కొరియా అణ్వస్త్ర ప్రయోగాలను తాను అనుమతించబోనని అయితే బయిట దేశాల జోక్యాన్ని కూడా వ్యతిరేకిస్తానని చైనా ద్విముఖ వ్యూహం తీసుకోవడం అంతర్జాతీయ పరిణామాల్లో మరో ముఖ్యమైన మలుపు. దక్షిణ చైనా సముద్రంలో తనకు వ్యతిరేకంగా అమెరికా జపాన్ తదితర దేశాలు కలసి పన్నుతున్న వ్యూహాలను కూడా చైనా విదేశాంగ మంత్రి వాంగ్ తీవ్రంగా ఖండించారు. అక్కడ మేము ఏ చర్యలు తీసుకున్నా ఆత్మరక్షణ స్వభావం గలవే . అలాగాక కొంతమంది నౌకాయానానికి అవకాశం వుంది గనక సైనిక పథకాలు కూడా అమలు చేయొచ్చనుకుంటే వూరుకునేది లేదు అని చైనా తీవ్రస్వరమే వినిపించింది.
విదేశాంగ విధానంలోనే గాక వాణిజ్య పరంగానూ అమెరికాకు చైనాకు మధ్య వైరుధ్యాలు ఈ వారం తీవ్రమైనాయి. జెట్ కాప్ అనే చైనా కమ్యూనికేషన్ సంస్థ ఇరాన్లో కాంట్రాక్టులు చేస్తున్నది. ఈ కంపెనీకి అమెరికాలోని కొన్ని ఐటి సంస్థలు విడిభాగాలు సరఫరా చేస్తాయి. అయితే ఇరాన్‌కు సరఫరాలు చేయడం సరికాదు గనక చైనా సంస్థ జెట్కాప్పై ఆంక్షలు విధిస్తూ అమెరికా ఉత్తర్వులు ఇచ్చింది. దీనిపై చైనా స్పందిస్తూ ఈ అంక్షల వల్ల అమెరికన్లకు లాభం లేకపోగా ఇతరులకు నష్టమని వ్యాఖ్యానించింది. వారికి కూడా ఉద్యోగావకాశాలు దెబ్బతింటాయని పేర్కొంది. అద్యక్ష ఎన్నికల పోరాటం దగ్గరవుతున్న కొద్ది అమెరికన్లను ఆకర్షించేందుకు ఏవో హడావుడి చర్యలు తీసుకోవడం చాలా కాలంగా జరుగుతున్నదే.
చైనా చర్యలపై అమెరికా ఎలా ప్రతిస్పందిస్తుందనేది చూడవలసి వున్నా భారత దేశం నేర్చుకోవలసింది మాత్రం చాలా వుంది. మన పరిశోధనలు ప్రయోగాలపైన ఎగుమతుల పైన అనేక ఆంక్షలు పరిమితులు విధించి ఇబ్బందులు పెడుతున్నా మనం అమెరికానే పట్టుకువేళ్లాడుతున్నాం. స్నేహ సంబంధాలు పాటిస్తూనే మన ప్రయోజనాల కోసం గట్టిగా పట్టుపట్టగల స్థయిర్యం ప్రదర్శించలేకపోతున్నాం. పైగా దక్షిణ చైనా సముద్రంలో చైనాకు వ్యతిరేకంగా మొదలైన ఆధిపత్యవ్యూహాలకు కొంత వరకూ సహకరిస్తున్నాం. ఐరాసలోనూ వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాం. కాని రిపబ్లికన్‌పార్టీ అద్యక్ష అభ్యర్థి ట్రంప్ వంటివారు భారత్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక్కడ నుంచి వెళ్లిన విద్యార్థులను వెనక్కు పంపి వేదన కలిగించారు. ఇప్పుడైతే మన ఆగేయాసియాలో అమెరికా అంతర్జాతీయ వ్యూహాలకు అనుగుణంగా రేవుపట్టణాలకు వ్యూహాత్మక ప్రాధాన్యత వుందనే చర్చ కూడా జరుగుతున్నది. అదే గనక అమలులోకి వస్తే అప్పుడు అంతర్జాతీయ వైరుధ్యాలలో ఆంధ్ర ప్రదేశ్ తీరం కూడా చిక్కుకుపోయినట్లవుతుంది.
అమెరికా తర్వాత ఆర్థిక రాజకీయ శక్తులుగా వున్న చైనా ఇండియాలు కలిసి బ్రిక్స్ వంటి వేదికలు ఏర్పాటు చేసుకున్నాయి. కాని విదేశాంగ విధానంలో మాత్రం మనం వారినే అనుసరిస్తున్నాం తప్ప మన స్థానం అలీన వారసత్వం నిలబెట్టుకోవడం లేదు. దీనికి చాలాసార్లు మూల్యం చెల్లించాం. ఇక ముందు కూడా చెల్లించకతప్పదు.
ఇక చైనా రష్యాల వైఖరి కఠినమవుతున్న సంకేతాలు ముందు ముందు ఎలా పరిణమిస్తాయో ఆచరణలో చూడవలసిందే.

