కేరళ ఖాయం, బెంగాల్‌ భీకరం

kerala1111 bengl2222

శాసనసభ ఎన్నికల తేదీలు ప్రకటించిన రాష్ట్రాలలో కేరళ పశ్చిమ బెంగాల్‌ ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఎందుకంటే దేశంలోనే కమ్యూనిస్టు ఉద్యమ కేంద్రాలుగా అవి పేరొందాయి. అసలు 1957లో దేశానికే తొల్టి కాంగ్రెసేతర కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని అందించింది కేరళ. ఆ గౌరవం పొందింది ఇఎంఎస్‌ నంబూద్రిపాద్‌. రెండేళ్ల తర్వాత ఆయన ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు నడిపి కుదరక నిరంకుశంగా బర్తరఫ్‌ చేసింది కేంద్రం. అప్పటి నుంచి కాంగ్రెస్‌ కావాలని కుల మత రాజకీయాలను పెంచి పోషించి చిన్న చిన్న పార్టీలను ఏర్పాటు చేయించింది. అందుకే అక్కడ వంటరిగా ఎవరికీ పూర్తి మెజార్టీ వచ్చే అవకాశం వుండదు. సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎప్‌, కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుడిఎప్‌ ఒకదాని తర్వాత మరొకటి అధికారంలోకి వస్తుంటాయి. గతసారి మాత్రం ఎల్‌డిఎప్‌ ఈ వరవడిని ఛేదిస్తూ రెండోసారి కూడా అధికారానికి చేరువగా వచ్చి ఓడిపోయింది. ముఖ్యమంత్రి అచ్యుతానందన్‌పై ప్రజల విశ్వాసం ఈ ప్రత్యేక పరిస్థితికి ఒక ప్రధాన కారణంగా భావించారు. తొంభై ఏళ్లు పైబడిన వయస్సులోనూ చురుగ్గా తిరుగుతూ నీతి నిజాయితీలకు మారుపేరుగా నిలబడిన అచ్యుతానందన్‌ను ి అక్కడ అత్యున్నత నేతగాచూస్తుంటారు. సిపిఎంలో తీవ్ర స్థాయిలోనే అంతర్గత సమస్యలు బహిరంగ కథనాలు వచ్చినా సమిష్టిగా సరిచేసుకుని ఉద్యమాన్ని రక్షించుకోవడం గొప్ప విశేషం. కన్ననూర్‌ వంటిచోట్ల ఆరెస్సెస్‌ శక్తులు సిపిఎంపై పనిగట్టుకుని దాడి చేస్తూ ఉద్రిక్తత పెంచుతున్నా మోడీ ప్రచారార్బాటంలో కూడా కేరళలో వామపక్షాలు నిలబడ్డాయి. యుడిఎప్‌ ముఖ్యమంత్రి వూమెన్‌ చాందీ వరుస కుంభకోణాలలో కూరుకుపోవడమే గాక వ్యక్తిగతంగానూ ఆరోపణల పాలై ప్రతిష్ట కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఎల్‌డిఎప్‌ అక్కడ విజయం సాధిస్తుందనే విషయమై ఎవరికీ సందేహాలు లేవు. బిజెపి శాసనసభలో ప్రాతినిధ్యం పొందుతుందా ఓట్ల శాతం పెంచుకుంటుందా వంటి లెక్కలు కొందరు వేస్తున్నారు. తిరువనంతపురం కార్పొరేషన్‌ ఎన్నికల్లో బిజెపి 32 మందిని గెలిపించుకోవడం, కొన్ని పంచాయతీలు గెలవడం ఆధారంగా ఈ లెక్కలు వేస్తున్నారు గాని అసెంబ్లీ ఎన్నికల్లో అవన్నీ అక్కరకు వచ్చేవి కావు. ఇక సిపిఎంనుంచి అచ్యుతానందన్‌ పోటీలో వుంటారా లేదా అనేదానిపై ఎక్కువ కథనాలు నడుస్తున్నాయి. ఆ నిర్ణయం రాష్ట్ర కమిటీ తీసుకోవలసి వున్నా ఆయన ప్రచారంలో అగ్రభాగాన వుంటారనడంలో ఎలాటి సందేహాలు లేవు. 2009,2014 ఎన్నికల్లో దెబ్బతిన్న సిపిఎంకు కేరళ ఫలితాలు గొప్ప వూరట నివ్వడం ఖాయం.

కేరళ కన్నా భీకరమైన పోటీ పశ్చిమబెంగాల్‌లో జరగనుంది. ఇందిరాగాంధీ నిరంకుశ పాలనను ఎదుర్కొని పోరాడటం, ఆ తర్వాత 34 ఏళ్ల వామపక్ష ప్రభుత్వ పాలన బెంగాల్‌కు దేశంలోనే ప్రత్యేకత తెచ్చిపెట్టాయి. అలాటి చోట 2011లో ఓడిపోవడం అభ్యుదయ శక్తులకు చాలా నిరుత్సాహం కలిగించింది. ే ఎన్నికల పోరాటంలో ఓడిపోవడం అసాధారణం కాదు గాని ఈ ఓటమికి దారితీసిన పరిస్థితులు చాలా చర్చకు దారితీశాయి. దీర్ఘకాలం అధికారంలో వున్న వామపక్ష ప్రభుత్వ ప్రజా శ్రేయో విధానాలు మన్నన పొందాయి. చివరి సంవత్సరాలలో కొన్ని పొరబాట్లు జరిగిన మాట కూడా వాస్తవమే. అయితే దాంతోపాటు అవిచ్చిన్నంగా కొనసాగుతున్న ఆ ప్రభుత్వాన్ని ఎలాగైనా కూలగొట్టాలని మమతా బెనర్జీ నుంచి మావోయిస్టుల వరకూ, కాంగ్రెస్‌ నుంచి కాషాయకూటమి వరకూ ఏదో ఒక రూపంలో చేతులు కలపడం అంతర్జాతీయ పెట్టుబడులు కూడా అండగా నిలవడం విస్మరించరాని విషయం. శారదా చిట్‌ఫండ్‌ కుంభకోణం వెలుగు చూశాక రకరకాల శక్తులు ఎలా చేతులు కలిపాయో మీడియాను ఎలా వుపయోగించుకున్నాయో సోదాహరణంగా అర్థమైంది.గెలిచిన తర్వాత మమత ఆ మావోయిస్టులను కూడా మట్టుపెట్టడంపై కేంద్రీకరించింది. సిపిఎం కార్యకర్తలపై అమానుష దాడులకు హత్యాకాండకు పాల్పడింది. ఈ దౌర్జన్యానికి ఒకప్పటి దాని మిత్రపక్షం కాంగ్రెస్‌ కూడా గురి కావలసిన పరిస్థితి. అందుకే తృణమూల్‌ బీభత్స పాలనకు వ్యతిరేకంగా కలసి వచ్చేప్రజాస్వామిక శక్తులతో చేతులు కలిపి ఆ ప్రభుత్వాన్ని గద్దెదించాలని సిపిఎం నిర్ణయించింది. కాంగ్రెస్‌తో పొత్తు లేదా అవగాహన వుంటాయని తీవ్ర ప్రచారం జరిగినా ఆ అవకాశం లేదనే కేంద్ర నాయకత్వం స్పష్టం చేసింది. అయినా తృణమూల్‌ వ్యతిరేక ఓట్ల చీలిక నివారించేందుకు పోటీల నివారణ వంటివి జరుగుతాయని అంచనాలున్నాయి గాని అవి ఆచరణలో చూడవలసిందే. ే ఈ వాస్తవాలతో నిమిత్తం లేకుండా బడా మీడియా మొదటే సిపిఎం కాంగ్రెస్‌ల పొత్తు ఖరారైందని ప్రచారం చేసింది. ఇప్పుడు మమతా బెనర్జీ కూడా ఆ ప్రచారానికి వూతమిచ్చే రీతిలో మాట్లాడుతున్నారు. తాను కేరళ వెళ్లి కాంగ్రెెస్‌ సిపిఎం ఒకటేనని ప్రచారం చేస్తానని బెదిరిస్తున్నారు. అంటే పరోక్షంగా బిజెపికి అనుకూలమైన పాత్ర నిర్వహిస్తారన్నమాట. ఒక విధంగా ఎన్నికల తేదీలు కూడా ఆమెకు ఈ అవకాశం ఇచ్చేలా నిర్ణయమైనాయి గనక దీదీ మార్కు రాజకీయం ఎలాగూ జరుగుతుంది. పశ్చిమ బెంగాల్‌ ప్రభావం కేరళపై ఏ మాత్రం వుండబోదని ఇక్కడ బలాబలాల పొందికే వేరని అచ్యుతానందన్‌ గతంలోనే ప్రకటించి వున్నారు. అసలు బెంగాల్‌లోనే మమత మెజార్టి తెచ్చుకోవడానికి చాలా పెనుగులాడవలసి వుంటుందని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. సిఓటరు సంస్థ నిర్వహించిన సర్వేలో టిఎంసికి 153 స్థానాలు మాత్రమే రావడం గమనార్హం. వామపక్షాలు ఇంకా దెబ్బతింటాయని కొందరు జోస్యాలు చెబుతున్నారు. బిజెపి పరోక్షంగా మమతకే సహకరిస్తుంది. వారికి వామపక్ష ప్రభుత్వం రాకుండా చేయడమే ఫ్రధానం. ఏమైనా బెంగాల్‌లో ఏం జరుగుతుందనేది దేశమంతటా ఉత్కంఠ రేపుతున్న విషయం. వీరోచిత సంప్రదాయాలు గల ఆ ఉద్యమాన్ని గత ప్రభుత్వాల విజయాలను కాపాడుకోవడానికి సిపిఎం వామపక్షాలు ప్రజాస్వామ్యవాదులను కలుపుకొని శాయశక్తులా పోరాడటం తథ్యం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *