బెంగుళూరు అఘాయిత్యంలో అరెస్టులు- “అగ్ర” తెలుగు పత్రిక ,అరకొర కథనం,అనువాద స్వారస్యం
నూతన సంవత్సరం ఆరంభదినాన బెంగుళూరు కమ్మనహళ్లిలో ఒక అమ్మాయిపై ఇద్దరు ఆగంతకులు జరిపిన అఘాయిత్యపు దాడి ఘటనలో పోలీసులు అరెస్టులు చేయడం మంచి విషయమే. ఒక వ్యక్తి ఈ దాడి తాలూకు సిసిటివి ఫుటేజి ఇవ్వడం వల్ల ఇది సాధ్యమైంది. దాడి చేసిన నలుగురి వివరాలు, వారిలో అయ్యప్ప అనే అతను ప్రధాన నిందితుడున్న పేరు కూడా పోలీసులు వెల్లడించారు. అంతకు ముందు అమ్మాయిలపై న్యూఇయర్ వేడుకల నేపథ్యంలోనే కొందరు సామూహికంగా అసభ్యదాడికి పాల్పడ్డారని వార్తలు వచ్చాయి. దానిపై పర్యాటక శాఖా మంత్రి పరమేశ్వరన్ దారుణ వ్యాఖ్యలు చేయడం కూడా నిరసనకు దారితీసింది. అమ్మాయిలు పాశ్చాత్య దుస్తులు ధరించడం వల్లనే ఇలాటివి జరుగుతుంటాయని ఆయన నోరు పారేసుకున్నారు. ఆ తర్వాత ఈ ఘటన కూడా సంచలనం కలిగించింది. వస్త్రధారణపై తన వ్యాఖ్యలు అపార్థం చేసుకున్నారని వివరణ ఇస్తూనే ఆయన ఈ ఘటనకు కన్నడిగులు కారణమై వుండరని మరోసారి అవాకులు వదిలారు.
పత్రికలు,టీవీ మీడియాల తర్వాత సోషల్ మీడియాలో వెబ్‌సైట్లలో రాస్తున్న కారణంగా వివి
ధ సైట్లను పరిశీలించే అవకాశం కలుగుతుంటుంది. చాలా సందర్భాల్లో ప్రముఖ తెలుగు పత్రికల సైట్లు కూడా అప్‌డేట్ చేయకపోవడం ప్రాధాన్యత గుర్తించకపోవడం లేదంటే తమ చిత్తానుసారం శీర్షికలు చిత్రణలు ఇవ్వడం నాకు ఆశ్చర్యం కలిగిస్తుంటుంది.ఇటీవలి కాలంలో అనువాదం గురించి ఖచ్చితత్వం గురించి కూడా పట్టించుకోవడం తగ్గింది. ఇప్పుడు పేర్కొన్న ఈ వార్తను అగ్ర తెలుగు పత్రిక అరకొరగా ఇచ్చి దాన్నే కొనసాగిస్తున్నది. వారిలో ఒకరు ఎవరంటే అనే శీర్షికతో ఆ వార్త ఇచ్చే సమయానికే ఇంగ్లీషు పత్రికలు వార్తాసంస్థలు చాలా వివరాలు ఇచ్చాయి. వాటికీ ఈ కథనంలో రాసిన దానికి పొంతనే లేదు. పైగా చాలా వదులైన భాషలో రాసేశారు. రెస్టారెంటు, డెలివరీ బాయిస్, డ్రైవర్, చదువుకుంటున్న విద్యార్థి వున్నాడనేది కూడా ఆ కథనంలో వుంది. ఇతర తెలుగు పత్రికలు ఆ సమాచారం బాగానే ఇచ్చాయి. కాని అగ్ర పత్రిక మాత్రం ఉదయం ఎత్తుకున్న ఆ కథనాన్నే నడిపిస్తూ వుంది. పైగా దానికే ఎవరు అని పెద్ద కుతూహల శీర్షిక కూడా ఇచ్చింది.ఇలాటివిచాలా గమనించినా కావాలనే రాయలేదు. ఇప్పుడు మరీ ఇంత సేపు ఇంత అరకొర సమాచారాన్నే చలామణి చేయడం వల్ల రాయాల్సి వచ్చింది.