సంచలన విజయంలో సంకేతాలు
హైదరాబాదులో లేనందువల్ల ఎన్నికలపై వెంటనే వ్యాఖ్యానించలేకపోయాను. నా కాలమ్స్ కామెంట్స్ చూస్తున్నవారికి జిహెచ్‌ఎంసి ఫలితాలు ఆశ్చర్యం కలిగించవు. తెలంగాణ రాష్ట్ర రాజకీయ ప్రక్రియ ఈ ఫలితాలతో తారాస్థాయికి చేరింది. రాష్ట్ర సాధన తర్వాత కూడా అసెంబ్లీలో అరవై దాటని అత్తెసరు పరిస్థితిని కెసిఆర్ ఎదుర్కొన్నారు. అందుకే విమర్శలు ఎన్ని వస్తున్నా సరే రాజకీయ అస్థిరత్వం రాకుండా ఇతర పార్టీల వారిని చేర్చుకుని మంత్రులను చేశారు. వరంగల్ ఉప ఎన్నికలో దాదాపు అయిదు లక్షల మెజార్టితో రాజకీయ సత్తా చాటిన టిఆర్‌ఎస్ ప్రత్యర్థి పార్టీలను పటాపంచలు చేసింది. కెసిఆర్‌పై తేలిగ్గా విమర్శలు చేసిన వారు వాటివల్ల ఉపయోగం వుండదని గ్రహించవలసి వచ్చింది. ఇక ఇప్పుడు జిహెచ్‌ఎంసితో రెండవ పెద్ద అడుగు వేసింది. టిఆర్‌ఎస్ పట్ల వచ్చిన ఈ మొగ్గు సహజ సిద్ధమైన ఫలితమే గాని హైదరాబాదీలు ఆందోళనతోనో అభద్రతలోనే ఇచ్చిన విజయం కాదు. అలాగే ప్రభుత్వం గొప్పగా ఏదో చేసేసిందనీ కాదు. ఒక రాజకీయ పరిణామ క్రమంలో వచ్చిన ఫలితం ఇది. ఎన్నికల లెక్కల్లోనైతే ఢిల్లీలో కేజ్రీవాల్, త్రిపురలో సిపిఎం సాధించిన విజయాలతో పోల్చదగింది. టిఆర్‌ఎస్ విజయం ఒకటైతే గతంలో 14 శాసనసభ స్థానాలు పొందిన టిడిపి బిజెపి కూటమి 1,4 డివిజన్లకు పరిమితం కావడం, అప్పుడు ఆ పార్టీకి వచ్చిన 22 శాతం ఓట్లు ఇప్పుడు ఈ కూటమికి రావడం ఒక రాజకీయ తలకిందులు పరిణామం. కొంతమంది గతంలోనూ ప్రభుత్వాలకు అనుకూలంగా కార్పొరేషన్ ఫలితాలు వున్నాయని చెబుతున్న మాట నిజం కాదు. తెలుగుదేశం మేయర్ గెలిచినా కార్పొరేషన్లో మెజార్టి తెచ్చుకోలేదు. కాంగ్రెస్ హయాంలో టిడిపి ప్రథమ స్థానంలో వచ్చింది.
వాస్తవిక స్పందన
ఈ ఎన్నికల్లో సీమాంధ్రుల పేరిట లేనిపోని సందేహాలు పెంచే ప్రయత్నం మంచిది కాదనీ పనిచేయదనీ నేను చాలాసార్లు చెప్పాను. ఈ మాటలు కొందరికి రుచించలేదు. విభజన తర్వాత ఎవరి ప్రశాంతంగా బతుకు వారు బతుకుతూ స్నేహపూర్వకంగా మెలగాలన్న భావనే రెండు చోట్ల వుంది. ఉద్రేకాలు రెచ్చగొట్టుకోవాలని ఎవరూ అనుకోవడం లేదు. చెదురుమదురుగా ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలున్నా ప్రాంతీయ పొరపొచ్చాలు కనిపించిన సందర్బాలు లేవు. కెసిఆర్ కూడా మొదట్లో అలాటి ప్రయత్నాలు కొన్ని చేసినా తర్వాత పంథా మార్చుకున్నారు. కెటిఆర్ ఈ క్రమాన్ని పరాకాష్టకు తీసుకెళ్లడంలో ఫలప్రదమైనారు.
సవాలు తెలుగుదేశంకే
ఎపి వర్సెస్ తెలంగాణ, బాబు వర్సెస్ కెసిఆర్, టిఆర్‌ఎస్ వర్సెస్ టిడిపి అన్న పద్దతిలో చూసేట్టయితే టిఆర్‌ఎస్ స్పష్టమైన ఆధిక్యతతో ఆరంభించింది. చంద్రబాబు అర్థమనస్కంగా నామకార్థంగా మాత్రమే పాల్గొన్నారు తప్ప సవాలుగా కాదు. తెలుగుదేశం బిజెపి ఎప్పుడూ ఒక్కతాటిపై నిలవలేదు. లోకేష్ రేవంత్ రెడ్డి వంటివారి ప్రచార పొరబాట్లు పరిస్థితిని మరింత దిగజార్జాయి. హైదరాబాదును నేనే అభివృద్ధి చేశాననే చంద్రబాబు ప్రచారం 2004లోకన్నా ఘోరంగా తిరస్కరణకు గురైంది. లోకేశ్‌ను లోకలేశ్ నేతగా నిలబెట్టేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం రాలేదు గాని బహుశా ఆయన పాత్ర ఆమోదం పొందింది. కేసు పోయినా లా తెలిసిందన్నమాట.
చంద్రబాబు తీరుతెన్నులు ఎంతమాత్రం ఉపయోగంగా లేవని కూడా టిటిడిపి నాయకులు బాహాటంగానే చెబుతూ వచ్చారు. మొదట్లో చంద్రబాబు టిటిడిపి నేతలకే ఎక్కువ సమయం కేటాయిస్తూ ఏదో ఆశించారు గాని ఇప్పుడు వారికీ ఆయనకూ కూడా ఆ విశ్వాసం నిలబడలేదు. ఈ ఫలితాల తర్వాత చాలామంది సూట్‌కేసులు సర్దుకుని కూచున్నారు. ఈ ప్రభావం ఎపిలోనూ పడుతుంది. తాము దెబ్బతినడమే గాక తెలుగుదేశం నేతలు హైదరాబాదులోని మిశ్రమ జనాభాకు ఒక విధమైన కృత్రిమ పరిస్థితిని తీసుకొచ్చారు. పాలించే చోట సవాలక్ష సమస్యలు వదలేసి పనిచేయని పర్యటనలెందుకని రేపు స్వంతపార్టీవారే మరింతగా ప్రశ్నిస్తారు.. బిజెపిలో భిన్న ధృవాలు, కేంద్రం పాత్ర, దేశమంతటా దానిపై పెరుగుతున్న వైముఖ్యం వంటివి కూడా ప్రభావం చూపాయి. అయితే ఇంత జరిగినా వారికి పాతిక శాతం వరకూ ఓటింగు వుండటం గమనించదగ్గది. కాంగ్రెస్‌ను గురించి కొత్తగా చెప్పవలసింది లేదు గాని మజ్లిస్ కోటలో కాస్తయినా అడుగు మోపేందుకు టిఆర్‌ఎస్ ప్రయత్నిస్తుందా లేదా ధారదత్తం చేస్తుందా అనేది చూడాలి. ఇప్పటికైతే వారితో తలనొప్పి తెచ్చుకోకపోవచ్చునని మొన్నటి దాడులపట్ల అనుసరించిన ఉదాసీనతే స్పష్టం చేసింది.
వాగ్దానాలే వెంటాడతాయి
ఈ విజయాన్ని బట్టి టిఆర్‌ఎస్ తిరుగులేని రాజకీయ శక్తి అయిపోయిందని కెటిఆర్ చేసిన వ్యాఖ్యలో ఆశ్చర్యం లేదు గాని చరిత్ర ఎన్నో ఘన విజయాలు గతంలోనూ చూసింది. కొన్ని వాగ్దానాలు కొన్ని వాస్తవాలు కొంత అనివార్యత కలసి ఈ తీర్పునకు దారి తీశాయని గుర్తించాలి. ఆకాశదారులు, అతిశయోక్తి వాగ్దానాల కన్నా తక్షణ సమస్యల పరిష్కారంపై శ్రద్ధ పెట్టాలి. డబుల్ బెడ్‌రూం ఇళ్లపై ట్రిబుల్ ప్రచారంతోనే ప్రజలను ఆకర్షించేట్టయితే రేపు వారిలో నిరుత్సాహం కూడా అంతే త్వరితంగా వచ్చే అవకాశం వుంది. ఎందుకంటే జరిగే నిర్మాణం పరిమితంగానే వుంటుందని ఆ పార్టీ ఎంఎల్‌ఎలే చెబుతున్నారు.
చివరిది కాని కీలకమైంది- గతంలోని ఉద్రేకాలు పునరావృతం కావనే భరోసా ఇచ్చిన నాయకులు దాన్ని ఒక విధానంగా మార్చే ప్రక్రియ చేపట్టాలి. హైదరాబాదు బహుళత్వ మిశ్రమ సంసృతిని కాపాడుకోవాలి. పాతబస్తీలోనూ ప్రజాస్వామిక ప్రక్రియ ప్రజల భాగస్వామ్యం పెరగాలి. గెలిచిన టిఆర్‌ఎస్ మాత్రమే గాక ఓడిన ప్రధాన పక్షాలు కూడా నమ్రత ప్రదర్శించాలి. ఎవరైనా సమస్యలపైన ఉద్యమాలు చేయాలి గాని సంకుచిత వివాదాలకు స్వస్తి చెప్పాలి. అయితే నారాయణ్ ఖేడ్‌లో రేవంత్‌రెడ్డి ప్రసంగాల తీరు చూస్తే మాత్రం ఆ పార్టీ పాఠాలు నేర్చుకున్నట్టు కనిపించదు.
మరో ఉప ఎన్నికల పర్వం
ఇక ఇప్పుడు టిఆర్‌ఎస్ ఫిరాయింపుదార్ల రాజీనామాలు ఆమోదింపచేసుకుని ఉప ఎన్నికల పర్వం ప్రారంభిస్తుంది. గతంలో వలెనే వాటిని గెలవడం తన ప్రాభవానికి సంకేతంగా చెబుతుంది. మెల్లమెల్లగా వచ్చే ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకుంటుంది. జాతీయంగా ఏవైనా మార్పులు లేక అనూహ్య పరిణామాలు వస్తే తప్ప కెసిఆర్‌కు మరో అవకాశం వుంటుందనే రాజకీయ వర్గాలన్నీ అనుకుంటున్నాయి.
రెండు శిబిరాల ఆవిర్భావం
చాలా ఛానళ్లు ఎన్నికల విజయాన్ని ‘నాన్నకు ప్రేమతో…’ అంటూ ఇటీవలి సినిమా శీర్షికన ప్రసారం చేశాయి. వాస్తవానికి కెటిఆర్‌కు ఈ బాధ్యత అప్పగించడమే పుత్రుడికి ప్రేమతో అప్పగించిన అవకాశం. మామూలుగా కార్పొరేషన్ ఎన్నికలు జరిగితే మేయర్ వస్తాడు ఇక్కడ ఒక భావి ముఖ్యమంత్రి వచ్చారు అని నేను చాలాసార్లు వ్యాఖ్యానించాను. అందుకు రంగం సిద్ధం చేయడానికే కెసిఆర్ కుమారుడిని ముందునుంచి బాధ్యతల్లో పెట్టారు. ఇది ఈ దేశంలో అన్ని ప్రాంతీయ పార్టీలలోనూ అమలవుతున్న అనధికార సంప్రదాయం ప్రకారమే జరిగిన ప్రక్రియ.. మహారాష్ట్రలో రాజ్ – ఉద్భవ్ ఠాకరేలు, జమ్మూ కాశ్మీర్‌లో(1980లలో) ఫరూఖ్ అబ్దుల్లా ్- జి.ఎం.షాలు, బీహార్‌లో లాలూ పుత్రులు-బావ మరిది గతంలో వివాదపడిన ఉదాహరణలున్నాయి. తమిళనాడులో సవతి తమ్ములైన స్టాలిన్ అళగిరి ఇంటిపోరు బాగా తెలుసు. తెలుగుదేశంలోనూ మొదట చంద్రబాబు దగ్గుబాటిర్వాత ి లక్ష్మీపార్వతి , ఆ తర్వాత హరికృష్ణ వంటివారి మధ్య వివాదాలు కూడా అందరికీ తెలుసు. అసలు 1985 ఎన్నికల ప్రచార క్రమంలో ఎన్టీఆర్ బాలకృష్ణ నా వారసుడు అని ప్రకటించగానే దుమారం లేచింది. వారిద్దరినీ ఒకే సభలో చూపేందుకు తీసుకువెళ్లిన చంద్రబాబే ఆ ప్రకటన వెనక్కు వెళ్లేలా చూశారని ప్రచారం జరిగింది. ఇప్పుడంటే వారిద్దరూ వియ్యంకులే అయినా బాలయ్యను సిఎం చేయాలని చంద్రబాబు వ్యతిరేకులు అప్పుడప్పుడూ అంటుంటారు. ఆయన కూడా చూద్దాం భవిష్యత్తులో ఏమవుతుందో అంటూనే బాలయ్య బావను బలపరుస్తుంటాడు. ఇవన్నీ చూశారు గనకే కెసిఆర్ ఏ సమస్య లేకుండా సూటిగా కెటిఆర్‌ను వారసుడుగా ప్రకటించే ప్రక్రియ పూర్తి చేశారు.
టిఆర్‌ఎస్‌లో మొదటి నుంచి హూ ఈజ్ నెక్స్ట్ చర్చ లోలోపల వుంది. ఉద్యమ కాలంలో హరీష్ రావు నెంబర్ 2గా పేరు పొందారు. అయితే ప్రభుత్వం ఏర్పడగానే ఇతర పార్టీల నుంచి చాలామంది సీనియర్లను తీసుకురావడంలోనే ఆ పరిస్థితి మార్చే ప్రయత్నం జరుగుతున్నదని ఆ పార్టీ నాయకులు చెప్పేవారు. స్వతహాగా చురుకైన హరీష్ ఇవన్నీ గమనిస్తున్నా వాస్తవాలు తెలుసు గనక సర్దుబాటుతనం కొనసాగించారు. ప్రభుత్వంలో గాని పార్టీలో గాని ఏదైనా భారీ కదలిక జరగాలంటే హరీష్ జోక్యం తప్పనిసరి అనిి చెబుతుండేవారు. మొన్నటి చండీయాగం సమయంలోనూ ఆయనదే పెద్ద పాత్ర. కెటిఆర్‌కు ఇలాటివి పెద్దగా నమ్మకాలు లేకపోవడం కూడా ఒక కారణం. ఇవన్నీవున్నా వారసత్వ నిర్ణయం కూడా జరిగిపోయిందని జిహెచ్‌ఎంసి ఎన్నికలతో అందరికీ అర్థమైంది. దీన్నిఅధికారికంగానే అధినేత హరీష్‌కు చెప్పారన్నది ఒక ప్రజా ప్రతినిధి కథనం.’ కొడుకునైతే వదులుకోలేను కదా, నీ పనులు నీవు చేసుకోవచ్చు. అందుకు ఎలాటి ఆటంకాలు వుండవు’ అన్నారని ఆ వర్గాల కథనం. మరోవైపున తన కుటుంబ సభ్యులకూ రాజకీయంగా హరీష్ అవసరాన్ని వివరించి చెప్పారని ఒక ఎంపి తెలిపారు. ‘ఇప్పుడు హరీష్ బాడీ లాంగ్వేజ్ చూడండి.. ఇది వరకటి హుషారు లేదు’ అని ఆయన వ్యాఖ్యానించారు.
అయితే హరీష్ రావు కూడా వ్యూహాత్మకంగా అడుగులువేయడంలో ఆరితేరిన నేతగనక తేలిగ్గా బయిటపడరు. పైగా అంతర్గత సమస్యలు వచ్చినపుడు ఆయన తెలుగుదేశం కాంగ్రెస్‌లపై తీవ్రంగా దాడి చేసి వేడిపెంచుతుంటారు. గతంలో కెసిఆర్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తాననడం గాని కొన్ని సందర్భాల్లో తీసుకున్న చర్యలు గాని హరీష్ ఆమోదించలేదు. వాస్తవానికి ఆయన ఒక దశలో వైఎస్‌కు బాగా దగ్గరైన రోజులున్నాయి. కాని పార్టీతోనే నిలబడి తనకంటూ ఒక ఫాలోయింగ్ పెంచుకున్నారు. ఇప్పుడు కూడా మంత్రిగా యువనాయకుడుగా తన అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి ఆయన తప్పక ప్రయత్నం చేస్తారు. బయిట ప్రత్యర్థి పార్టీలను చిత్తుచేసిన కెసిఆర్ ఈ క్రమంలో టిఆర్‌ఎస్‌లో రెండు అంతర్గత శిబిరాలు ఏర్పడటానికి కారకులైనారు. ఇప్పటికైతే ఎవరూ బయిటపడకపోవచ్చు గాని లోలోపల సందేహాలు దూరాలు పెరుగుతూనే వుంటాయి.

