బిజెపికి,మోడీ నాయకత్వానికి పరీక్షే
ఫిబ్రవరి,మార్చి నెలల్లో జరగనున్న అయిదు రాష్ట్రాల ఎన్నికలు బిజెపికి ప్రత్యేకించి మోడీ మలిదఫా ఆశలకు అగ్నిపరీక్షే. ఉత్తర ప్రదేశ్‌లో తండ్రీ కొడుకుల సవాల్ అన్నట్టుగా వున్నా ఇప్పటికీ ఎస్పికి మొగ్గు వుందని సర్వేలు సూచిస్తున్నాయి. ఈ సమరంలో సహజంగా ముఖ్యమంత్రి యువనేత అఖిలేష్ యాదవ్ తండ్రిపై ఆధిక్యత సంపాదించగలిగారు. ఇక ప్రజల ఆదరణ ఎంత వుంటుందో చూడాలి.అయితే ఎస్పి దెబ్బ తిన్నా బిఎస్పి తదుపరి అవకాశం పొందుతుంది తప్ప బిజెపి ఆ స్తానంలో వున్నట్టు లేదు.లోక్‌సభ ఎన్నికల్లో 80కి 73(స్వయంగా71) స్థానాలుతెచ్చుకోకపోతే మోడీకి మెజార్టి లభించేది కాదు. అయితే తర్వాతి ఉప ఎన్నికల్లో ఎస్పి గెలుస్తూవస్తున్నది. ఇప్పుడు నోట్లరద్దు పోటుకు తోడు అసహనం, గోరక్షణ హత్యలు, విశ్వ విద్యాలయ వివాదాలు వంటివన్నీ యుపి కేంద్రంగానే జరిగాయి. కనుక అమిత్‌షా వంటి వారు ఎంత కష్ఠపడినా బిజెపి విజయం సాధిం
చడం సవాలే. కాంగ్రెస్ ఎలాగూ ప్రధాన పోటీదారు కాదు. అఖిలేష్ దానితో పొత్తుకు అనుకూలం గనక ఆ మేరకు లాభం కలగొచ్చు. ఉత్తరాఖండ్‌లోనైనా కాంగ్రెస్ విజయం సాధిస్తే అదే గొప్ప విషయం. కాంగ్రెస్‌కు అసలైన సవాలు పంజాబ్‌లో ఈ సారైనా అధికారానికి రావడం. అకాలీ బిజెపి ప్రభుత్వ వైఫల్యాలు అరోపణలు మాదకద్రవ్యాల సమస్య,సిక్కు మతతత్వం వంటి అనేక జటిల సమస్యలు అక్కడ సవాలుగా వున్నాయి. దీనికి తోడు గతంలో నాలుగు ఎంపి స్థానాలు గెలిచిన ఆప్ కూడా ప్రధాన పోటీదారుగా వుంది. ఈ త్రిముఖ పోటీ ఎవరికి లాభమో చూడాలి గాని మూడోసారి అకాలీలు గెలిచే అవకాశం మాత్రం దాదాపు వుండదని చెప్పొచ్చు.
ఇక గోవాలో గతంలో మనోహర్పరిక్కర్నాయకత్వాన విజయం సాధించిన బిజెపి ఇప్పుడు కూడా నమ్మకంగా వుంది. కాంగ్రెస్ కూడా అంతే బింకం చూపిస్తున్నది.మరోచిన్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంజాతి కలహాల సమస్యను ఎదుర్కొంటుంటే బిజెపి దానిపై దాడి చేస్తున్నది. ఇమొం షర్మిల ముఖ్యమంత్రి ఇబొబిసింగ్పై పోటీ చేస్తామని చెప్పడం కొత్త మలుపు. గత రెండుసార్లుగెలిచినట్టే ఇప్పుడు గెలుస్తామని కాంగ్రెస్ ముఖ్యమంత్రి అంటున్నారు.
.నోట్లరద్దు తర్వాత జరగడమే గాక దాదాపు మోడీ పదవీ కాలం మధ్యలో వుండగా వచ్చాయి గనక ఈ తీర్పు ప్రభావం ఆ తర్వాత జరిగే గుజరాత్‌పైనా తదుపరి వచ్చే ఎన్నికల పైనా వుంటుంది. బిజెపి బీహార్‌లో వలెనే యుపిలోనూ దెబ్బతిని, పంజాబ్‌ను కోల్పోయేట్టయితే వచ్చేసారి దాని జాతీయ అవకాశాలకు భారీ గండిపడినట్టే. కాంగ్రెస్ పంజాబ్‌ను తిరిగి తెచ్చుకోలేకపోతే దాని జాతీయ హౌదాకు గండం వచ్చినట్టే. సీట్లు ఓట్ల వివరాల్లోకి పోకుండా స్థూలంగా చూసినప్పుడు ఇది ఈ అయిదు రాష్ట్రాల ముఖచిత్రం