మంత్రులూ అధికారులలో అనాసక్తి

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడెప్పుడు మంత్రివర్గ విస్తరణ చేస్తారా అని ఆశగా ఎదురు చూసిన సీనియర్‌ నేతలు, ఆశావహులలో ఇప్పుడు తీవ్ర నిరాసక్తత నెలకొన్నది. అన్ని నిర్ణయాలూ ఆయనే తీసుకుంటున్నారు. లోకేశ్‌ చెప్పినట్టు మంత్రులు వినాల్సి వస్తున్నది. కేంద్రం ఇస్తున్న నిధులు అంతంతమాత్రం. మన వనరులు అసలే చాలవు. ఇలాటి పరిస్థితుల్లో మంత్రులమై మాత్రం చేసేదేముందని ఇటీవల కలిసిన కొంతమంది నిర్లిప్తంగా మాట్లాడారు. ఏదైనా చెప్పడానికే అవకాశం వుండటం లేదని నిరంతరం ప్రచార కార్యక్రమాలలో మునిగిపోయి పాలనను పట్టించుకోవడం లేదని వారు విమర్శించారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మాటలు వినడం వల్లనే ఇదంతా జరుగుతుందని కొందరు అంటుంటే ఆయన తన స్థానం కోసం రాష్ట్ర ప్రయోజనాలు ఫణం పెడుతున్నారని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తాను మంత్రి పదవి కోసం లాబీయింగ్‌ చేయడం దండగని విరమించుకున్నానని ఒక సీనియర్‌ నేత అన్నారు.ఉన్నవారు ఉద్ధరిస్తున్నదేమిటి? నారాయణ తప్ప మిగిలిన వారంతా ఉత్సవ విగ్రహాలై పోయారని కీలక పదవిలో వున్న మరో నాయకుడు చిరాకు పడ్డారు. నారాయణ మాట మీద నెల్లూరులో ఎంఎల్‌సి అభ్యర్థిగా నిలబెట్టిన వ్యక్తి ఓడిపోవడం తథ్యమని ఆ పార్టీ ప్రతినిధి ఒకరన్నారు. నారాయణ కూడా ముఖ్యమంత్రి చెప్పిన దాన్ని అమలు చేసే నమ్మకస్తుడే తప్ప అన్నీ ఆయనే నిర్ణయించడం లేదని మరొకరు వివరించారు. ముఖ్యమంత్రిని సంతోషపెట్టడం కోసం జగన్‌పై విపరీతంగా దాడి చేసిన మంత్రులు కూడా తమ పాత్రను పెద్దాయన గుర్తించడం లేదని వాపోయారు. ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి బాహాటంగానే అసంతృప్తి వెలిబుచ్చి ఆపైన సర్దుకున్నారు. మరో ఉప ముఖ్యమంత్రి హౌం శాఖ బాధ్యుడు కూడా అయిన చినరాజప్ప ఆ పదవికి తగిన ి నిర్ణయాత్మక పాత్ర నిర్వహించలేకపోతున్నారని ఆయన అనుయాయులే అంటున్నారు. ఇలాగే మిగిలిన మంత్రులపైనా రకరకాల అసంతృప్తులూ వున్నా ముఖ్యమంత్రి పనిచేసేవారిని చేయని వారిని ఒకే గాట కడుతున్నారనే బాధ చాలామందిలో కనిపిస్తుంది. ఇవన్నీగాక జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌కు చెప్పకుండా చేసేదేమీ వుండటం లేదు. ఆయన తండ్రి కన్నా టఫ్‌గా వుంటారు. ఇంకేం చేస్తాం అని ఒక సీనియర్‌ నాయకుడు వ్యాఖ్యానించారు. మంత్రులే గాక అధికారులు కూడా అదే విధంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి ప్రచారానికి పెద్దపీట వేస్తూ వాస్తవంగా ప్రజలకు మేలు చేసే అంశాలు వెనక్కు పోవడానికి కారకులవుతున్నారని ఐఎఎస్‌లు, జిల్లా స్థాయి అధికారులు ఉదాహరణలతో సహా చెబుతున్నారు. మరి చంద్రబాబు వీటిపై ఎప్పటికైనా దృష్టిపెడతారో లేదో!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *