మోడీ సూచన.. కెసిఆర్ పాలన!
నోట్లరద్దుపై బిజెపి ముఖ్యమంత్రులను మించిపోయి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రధాని మోడీనికి కీర్తించడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. పైగా కేంద్రాన్ని బలపర్చడం తమ విద్యుక్తధర్మమన్నట్టు కూడా టిఆర్‌ఎస్‌నేతలు మాట్లాడారు. దీనీ వెనక వున్న రహస్యం ఆ పార్టీ ఎంఎల్‌ఎలు చెబుతూనే వున్నారు.నిధుల కొరత, నోట్లదెబ్బ, రాష్ట్రాలపై దాడి నేపథ్యంలో మోడీతో మంచిగా మెప్పించడమే శ్రేయస్కరమని కెసిఆర్ నిర్ణయానికి వచ్చారట.అనేక విధాల కేంద్ర నిధులను ఇతర పద్దుల కింద ఖర్చు చేసిన రీత్యా తమిళనాడు ప్రధాన కార్యదర్శిపై దాడి కూడా కొంత ప్రభావం చూపిందని ముఖ్యమంత్రికి దగ్గరగా వుండే ప్రజా ప్రతినిధి ఒకరు చెప్పారు. ఏమైతేనేం.. చేయగలిగింది లేనప్పుడు చేయి కలపడమే మంచిదన్న శకుని(శ్రీకృష్ణపాండవీయం) నీతిని ఆయన చేపట్టినట్టు కనిపిస్తుంది. అయితే దీన్నే భూసేకరణ చట్ట సవరణకూ వర్తింపచేయడం విశేషం. ప్రధానితో కూడా మాట్టాడానని వారి సలహా మేరకే ఇది చేశామని వివరణ ఇవ్వడం గుజరాత్‌లో తెచ్చిన సవరణను కూడా ప్రస్తావించడం ఈ కోణంలోనే చూడకతప్పదు.పైగా భూములకోసం జరిగే ఉద్యమాలన్నీ రాజకీయ కుట్రలని ఆయన తీవ్రంగా దాడి చేశారు.
మహాజన పాదయాత్ర మొదలుకాకముందే దానిపై ధ్వజమెత్తిన ముఖ్యమంత్రి ఈ సందర్భంలో మరోసారి సిపిఎంను పేరెత్తి విమర్శించడం ఆయన తీవ్రవ్యతిరేకతను చెబుతుంది. మల్లన్నసాగర్ విషయంలో ఏ సంబంధం లేని సిపి
ఎం నాయకులు వచ్చి రెచ్చగొట్టారట. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకైనా సంబంధం లేదని ఎలా చెబుతారు? పార్లమెంటు ఆమోదించిన 2013 చట్టం తాడూ బొంగరం లేనిదట. మరి అప్పుడు ఆ పార్టీవారు వ్యతిరేకించారా? తర్వాతనైనా సవరణలు సూచించారా? తెలంగాణలో విశృంఖలంగా భూమి సేకరించి పరిశ్రమాధిపతులకు వాణిజ్యవర్గాలకు ఇవ్వాలంటే ఆ చట్టం ఆటంకం గనకే ఇప్పటికి మూడు సార్లు దానిపై దాడి చేశారు.మొదట ఒక జివో తెచ్చారు. తర్వాత జీవో 123, ఇప్పుడు ఈ సవరణ. అన్నిటి లక్ష్యం ఒకటే. మార్కెట్ రేటుకు కొన్ని రెట్ల పరిహారం, సామాజిక ప్రభావ అంచనా, అందరికీ పునరావాసం, అనుకున్న లక్ష్యం నెరవేరకపోతే వాపసు అంటూ 2013 చట్టం చెబుతున్న అంశాలను పక్కనపెట్టడం. గతంలో చాలా సార్లు కోర్టులో తిరస్కరణకు గురైన ఈ ధోరణిని టి సర్కారు మార్చుకోకపోగా ఎదురుదాడి చేస్తున్నది. దీనిపై కాంగ్రెస్ టిడిపి సిపిఐ సిపిఎంలతో పాటు జెఎసి చైర్మన్ కోదండరాం కూడా తీవ్ర వ్యతిరేకత ప్రకటించడం సహజమే. బహుశా రానున్న రోజుల్లో ఈ ఉద్యమం ఉధృతమయ్యే అవకాశాలు చాలా వున్నాయి. మల్లన్నసాగర్ మాత్రమే గాక ఇతర అనేక సెజ్‌లు నిజ్‌లలోనూ ఇది సవాలు కానుంది. ప్రజా ఉద్యమాలపై అసహనం మాత్రం ఎప్పటికీ మంచిది కాదు.