తమిళనాడులో దుర్నీతి …..ఐటిదాడులలో ద్వంద్వనీతి
–
జయలలిత మృతి అనంతరం తమిళనాడులో జరుగుతున్న పరిణామాల వెనక కేంద్ర ప్రభుత్వ అదృశ్యహస్తం పనిచేస్తుందనడంలో సందేహం లేదు.అసలు జయ మరణించినట్టు జయటివి ప్రకటించి, కార్యాలయంపై పతకాలు అవనతం చేసిన తర్వాత కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు రంగ ప్రవేశం చేశారు. ఆ ప్రకటన వెనక్కు పంపించి పన్నీరు సెల్వం ఎంపిక తతంగం పూర్తి చేసిన తర్వాతనే ప్రకటన రప్పించారు. తర్వాత దశలో శశికళకూ పన్నీరుకు మధ్యన రాజకీయం నడిపిస్తూనే వున్నారు. 1987లో ఎంజిఆర్ మరణానంతరం ఏ బలం లేని జానకితో ప్రమాణ స్వీకారం చేయించి జయను దూరంగా వుంచేందుకు అప్పటి కేంద్ర ప్రభుత్వం చాలా తంటాలు పడింది. అప్పుడు రాజీవ్ గాంధీ చేసిందే ఇప్పుడు మోడీ సర్కారు కూడా చేస్తున్నది. పన్నీరు సెల్వం ప్రధానిని కలిసి మాట్లాడటం, ప్రధాన కార్యదర్శి పిఎస్ రామమోహనరావుపై దాడి, శశికళకు అనుకూలంగా పోస్టర్లు అంతా ఒక క్రమ పద్ధతిలో నడుస్తున్నాయి. రామమోహనరావుపై దాడి అక్రమ ధనం పట్టివేత చేయొచ్చు గాని అందుకోసం కేంద్రం సిఎష్‌ఐఎఫ్‌ను రంగంలోకి దించి అంత హడా
వుడి చేయాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆయన రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులో వున్నారు. గతంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయంపైనా ఇలాగే దాడి చేశారు. అదే మధ్య ప్రదేశ్‌లో వ్యాపాం కుంభకోణం వంటివాటిపై ఒక్కదాడి కూడా జరగదు! నోట్ల విషయంలో కూడా బిఎస్‌పిపై దాడి చేస్తారు గాని బిజెపి శాఖల నుంచి అధికమొత్తంలో వచ్చాయంటే పట్టించుకోరు. అధికార యంత్రాంగాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం ఇక్కడ బాహాటంగా కనిపిస్తున్న సత్యం. పలుచోట్ల బిజెపి నాయకుల దగ్గర మహారాష్ట్రలో ఒక మంత్రి దగ్గర కూడా నోట్లు దొరికినా తర్వాత ఏవో సమర్థనలతో బయిటపడ్డారు. ఇక ఇప్పుడు ప్రధాని మోడీ బినామి ఆస్తి చట్టం గురించి ప్రచారం ఎత్తుకున్నారు. యాభై రోజుల గడువు తర్వాత కూడా చెప్పడానికేమీ లేదు గనక ఈ బినామి పేరిట హడావుడి జరుగుతందని అర్థమవుతూనే వుంది. నోట్లరద్దు వల్ల టెర్రరిజం ఆగిపోయిందని మోడీ చెప్పడం అన్నిటికన్నా హాస్యాస్పదం. కాశ్మీర్‌లోనే పాక్ ప్రేరిత దాడి ఈ కాలంలోనే జరిగింది.
ఇది ఇలా వుంటే తమిళనాడులో పోస్టర్ల యుద్ధం తారాస్థాయికి చేరడం కోటరీ రాజకీయాలకు నిదర్శనం. జయలలిత క్యాలెండర్లు రద్దు చేసి మరీ శశికళ బొమ్మలు పెద్దవి చేయించారట. ఇక అండిపట్టిలో ముఖ్యమంత్రి పన్నీరు సెల్వన్ ఫ్లెక్సీని కూడా తీసేయించారట. అంలే నిజమైన పెత్తనం ఎవరి చేతుల్లో వుందో తెలియడం లేదా?