నిరంకుశం,జాతీయకరణకు పూర్తి విరుద్ధం,

నోట్లరద్దు నిర్ణయాన్ని చాలా మంది ఇందిరాగాంధీ చేపట్టిన బ్యాంకుల జాతీయకరణతో పోల్చడం అవగాహనా రాహిత్యమే. ఆమెలో చాలా పొరబాట్లు నియంతృత్వ చరిత్ర వున్నా రాజభరణాల రద్దు, బ్యాంకుల జాతీయ కరణ, స్వాగతించదగిన చర్యలు. వాటివల్ల బడాబాబుల సొమ్ము ప్రభుత్వం అధీనంలోకి ప్రజల ప్రయోజనాలకు అందుబాటులోకి వచ్చింది. ప్రధాని మోడీ ఇంతవరకూ అలాటి చర్య తీసుకున్నది లేకపోగా నోట్లరద్దు వల్ల పేద మధ్యతరగతి మనుషులు కష్టపడి సంపాదించిన లేదా పొదుపు చేసిన సొమ్ము బ్యాంకుల పాలైంది. తర్వాత కాలంలో ఇది కార్పొరేట్లకు రుణాల రూపంలో వెళ్లిపోతుంది. జాతీయకరణ వల్ల ప్రైవేటు బ్యాంకుల సొమ్ము ప్రభుత్వ సంస్థల్లోకి వస్తే ఇప్పుడు ప్రైవేటు బ్యాంకులకే ఎక్కువ నగదు ఇస్తున్నారని లెక్కలు చెబుతున్నాయి. అవి రెచ్చిపోయి ఆఫర్లు ఇస్తున్నాయి. ఆఖరుకు నగదు రహిత లావాదేవీలకు ఇచ్చే బహుమానాలు కూడా పేటిమ్‌ వంటి ప్రైవేటు సంస్థలకే మేలు చేస్తాయి. కాబట్టి ఇది విజాతీయకరణ. ఇందిరాగాంధీ తర్వాత అంత బలమైన నాయకుడుగా మోడీని అభివర్ణించేవారు కావాలంటే ఆమె ఎమర్జన్సీ రోజులనాటి ఏకపక్ష పోకడలతో పోల్చవచ్చు. ఎందుకంటే ప్రజలు సమస్యలపాలవుతున్నా మోడీ కనీససవరణలకు సిద్దం కాలేదు. ఇది ఆ రోజుల్లో సంజరు గాంధీ అమలు చేసిన బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లతో పోల్చవచ్చని పోర్బ్స్‌ పత్రిక బాగా చెప్పింది.
నిజానికి ప్రజల ఆర్తనాదాలు వారిపై ప్రభావం చూడకుండా అధినేత నిర్ణయం అమోఘమని సాహసికమని పొగడ్డమే నిరంకుశత్వ లక్షణం. దాన్ని కొంతైనా సవరించుకోకపోవడం దానికి పరాకాష్ట. అంతటితో ఆగక ప్రజలు సంతోషంగా వున్నారని ప్రకటించడం కళ్లకు గంతలు కట్టుకోవడమే. కనిపించిఏ ఘోరమైన తప్పులకు అధికారులు బ్యాంకులు కారణం అంటూ ఇంకా ఏదో మేలు జరుగుతుందని వూరించడం హాస్యాస్పదం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *