అమ్ముడూ… కుమ్ముడూ…ఎందుకీ చిరో గమనం?
చిరంజీవి ఏడేళ్ల తర్వాత నటిస్తున్న చిత్రం ప్రచారానికి ఎంచుకున్న ట్రయలర్లు టీజర్లు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. నలుగురు లేదా అయిదుగురు హీరోల తెలుగుతెరపైకి చిరంజీవి రావడమే ఒక దుమారం. 1980లలో ఆయన రాకను మేము బాగా ఆస్వాదించాం. అరవై ఏళ్లు దాటినా కుర్రవేషాలేసిన ఎన్టీఆర్ ఏఎన్నార్‌ల వలె గాక ఆయన తనకు తానుగా మార్పుకోసం ప్రయత్నించారు. ఆ క్రమంలోనే గ్యాప్ తీసుకుని హిట్లర్ మాష్టర్ చూడాలని వుంది వంటి చిత్రాలు తీశారు. ఇక ఆ తర్వాత ఇంద్ర ఠాగూర్ అందరివాడు శంకర్ దాదా సీరిస్. జయాపజయాలు ఎలా వున్నా వీటిలో ఎక్కువ భాగం కమర్షియల్ ట్రాక్‌లోనే ఆయనను ఒకింత పెద్దవాడుగా చూపించాయి. అలాటి వ్యక్తి రాజకీయాల్లోకి వెళ్లి మళ్లీ తిరిగొచ్చినప్పుడు తీసే సినిమా కోసం బోలెడు నిరీక్షించి వందలాది కథలు విని చివరకు ఒక తమిళరీమేక్ తీసుకున్నారు. కత్తి అనే ఆ చిత్రం రైతులు భూముల విత్తనాల వంటి సమస్యలతో ముడిపడి వుంటుంది. ఒకే. దీన్ని జూనియర్ ఎన్టీఆర్‌తో తీయాలని ఒక దశలో అనుకుంటే ఆయన టిడిపి కోణంలో ఆలోచించి వెనకడు
గు వేశారట.అయితే చిరంజీవి స్థాయికి ఇది మంచి చిత్రమే. కాని టీజర్‌లో అమ్ముడూకుమ్ముడూ తప్ప మరొకటి దొరకలేదా? సినిమాలో అంటే మాస్ మసాలాకోసం పెట్టవచ్చు గాని ముందస్తు ప్రచారానికి కూడా ఆదేనా? ఒక స్థాయికి చేరిన చిరు ఇప్పుడు మళ్లీ అచ్చమైన కుర్రాడిగా తిరోగమించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ పని చేయడానికి రామ్ చరణ్ వున్నాడు చేస్తున్నాడు. వాణిజ్య ఫార్ములాలోనైనా హిట్టర్ లాటి లైనే మెరుగు. స్థిరం కూడా. ఇదే ఫక్కీ కొనసాగించాలంటే శ్రమతో పాటు కృత్రిమత్వం కూడా ఆటంకమై కూచుంటుంది.ఎంత చేసినా కొంతే అవుతుంది.ఆపైన అభిరుచులూ విలువలూ గట్రా సమస్యలూ రాకపోవు.