ఇద్దరి వూళ్లూ అంతంతే!

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌, ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వగ్రామాలపై ఇండియన్‌ ఎక్స్‌ప్రెస ఈ రోజు ్‌ రెండు ఆసక్తికరమైన వార్తలు ప్రచురించింది. సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లి నర్సన్నపేట గ్రామాలలో 530 ఇళ్లకు కెసిఆర్‌ సామూహిక ప్రారంభోత్సవం జరుపుతున్న నేపథ్యంలో అదే జిల్లాలో ఆయన స్వగ్రామం చింతమడక పరిస్థితిపై మొదటి పేజీ కథనం ఇచ్చింది. చింతమడకకు ఒక్క డబుల్‌ బెడ్‌రూం ఇల్లు కూడా మంజూరు కాలేదట. రోడ్లు కూడా పాడై వున్నాయి. ముఖ్యమంత్రి మావూరే గనక కొంచెం మార్పు వస్తుందనుకుంటే నిరాశే మిగిలిందని చాలామంది గ్రామస్తులు ఆవేదన ప్రకటించారు.
ఇక చంద్రబాబు తన స్వగ్రామం నారావారిపల్లె(చిత్తూరు జిల్లా)కు సంబంధించి ఒక ముఖ్యమైన విషయం చెప్పారు. ఎర్రచందనం స్మగ్లర్లలో చాలా మంది తమ స్వగ్రామంలో దాచుకుంటున్నారని చెప్పడానికి విచారంగా వుందన్నారు. ఎంత ప్రయత్నం చేసినా అక్రమ రవాణా ఎర్రచందనంలో పదో వంతు కూడా అధికార యంత్రాంగం పట్టుకోలేకపోతున్నదట. తమిళనాడుకూ ఎపికి చెందిన అవినీతిపరులైన నాయకులు చేతులు కలిపి ఈ దొంగరవాణా సాగిస్తున్నారట. మరి అంత భారీ ఎన్‌కౌంటర్‌ తర్వాత కూడా ఎందుకు ఈ అక్రమం ఆగలేదో అధినేతకే తెలియాలి.
ముఖ్యమంత్రులు ఏదో ఒక గ్రామానికే సంబంధించిన వారు కాదన్నది నిజమే గాని తమ స్వగ్రామాలలో కనీసం మిగతా వాటి స్థాయిలోనైనా చూసుకోకపోతే ప్రజల నమ్మకం ఏమయ్యేట్టు? అనడానికి తేలిగ్గా చూడ్డానికి ఇబ్బందిగా వుండదా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *