జానా’ పొరబాటు’- కెటిఆర్‌ ఎదురుపోటు- కాంగ్రెస్‌ టిఆర్‌ఎస్‌ గత బంధాల ప్రతిబింబం

తెలంగాణ ఆవిర్భావానికి సంబంధించి ప్రతిపక్ష నేత జానారెడ్డికీ, యువ మంత్రి కెటిఆర్‌కు ఈ రోజు శాసనసభలో జరిగిన చర్చ ఆసక్తికరమైంది. కాంగ్రెస్‌ టిఆర్‌ఎస్‌ల మధ్య రాజకీయ బంధాన్ని లడాయిని కూడా అది కళ్లకు కట్టింది. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌ నా తెలంగాణ అనడాన్ని తప్పు పడుతూ మన తెలంగాణ అనాలని జానా సూచించడంలో తప్పులేదు. ఒకవేళ రాజేందర్‌ ఉద్యమ కారుడుగా అన్నారనుకున్నా సీనియర్‌ నేతగా జానా కూడా తమ పార్టీని గురించి చెప్పి తమను తాము కలుపుకోవడానికి ప్రయత్నించవచ్చు.దీనిపై కెటిఆర్‌ రాజకీయ వివాదం చేసి వుండాల్సింది కాదు. మనందరిదీ అని సర్దుబాటు చేయాలి నిజానికి. కాని టిఆర్‌ఎస్‌ వ్యూహమే తెలంగాణ ఘనత యావత్తూ మాది అని చెప్పుకోవడం. జెఎసి చైర్మన్‌ కోదండరాంనే పక్కనపెట్టిన వారు కాంగ్రెస్‌ క్లెయిములను ఎలా మన్నిస్తారు? అయితే కెటిఆర్‌ మాటలకు జవాబు చెప్పే క్రమంలో జానారెడ్డి మరో అడుగు వేసి మేము పొరబాటు చేశామా అనిపిస్తుంటుంది అని నోరు జారారు. కేంద్ర రాష్ట్రాల్లో వున్న వాళ్లం కావాలంటే చిటికెలో అణచివేసి వుండేవాళ్లం అని వ్యాఖ్యానించారు. ఈ దశలో కెటిఆర్‌ దాడికి అవకాశం పెరిగింది. జానారెడ్డి అంటే గౌరవం అనిజోడిస్తూనే ే తెలంగాణ ఇవ్వడమే పొరబాటనుకుంటున్నారా? అణచివేసేవాళ్లం అనడం ప్రజాస్వామ్యమా అంటూ చెలరేగిపోయారు. ఈ దశలోనూ జానారెడ్డి లేచి తాను అన్నది టిఆర్‌ఎస్‌ దోరణి గురించి తప్ప తెలంగాణ ఇవ్వడానికి సంబంధించి కాదని స్పష్టంగానే చెప్పారు.టిఆర్‌ఎస్‌ తమలో లీనమైపోతుందని నమ్మడం పొరబాటని ఆయన పైకి అనలేరు కదా! ఆంధ్ర ఎంఎల్‌ఎలు రాజీనామా చేసినప్పుడు కెసిఆర్‌ తన ఇంటికి వచ్చిన విషయం మాత్రం గుర్తు చేశారు. నిజంగా ఇదో విచిత్రమైన రాజకీయ యుద్ధమే. ఆ లోతుపాతులు తెలుసుకోగల చతురుడు గనకే కెటిఆర్‌ మీ విజ్ఞతకే వదిలేస్తున్నానంటూ ముగించాడు. మామూలుగా అయితే అణచివేయడం అనే మాటపై దుమారం లేవదీసేవారు. నిన్నటి అవగాహనలపై రభస వద్దనే మానేశారనుకోవాలి. గతంలో మాజీ కేంద్రమంత్రి జైపాల్‌ రెడ్డి కెసిఆర్‌ నిరాహారదీక్షే బూటకమని విమర్శించారు. ఈ ఇద్దరు కాంగ్రెస్‌ పెద్దలూ ముఖ్యమంత్రులు రేసులో వుండిన వారని ఇక్కడ చెప్పుకుంటే వారి మాటల వెనక మధనం తెలుస్తుంది. అయితే కమ్యూనిస్టులో ఇతరులో సమస్యలపై వివరించాలన్నా సమయం ఇవ్వకపోవడం ప్రజాస్వామ్యం కాదని జానారెడ్డి చేసిన విమర్శలో వాస్తవం వుంది. మాకే దిక్కులేదని టిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఎలు ఎంఎల్‌సిలే వాపోతుంటే ఇక చెప్పేదేముంది?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *