గుజరాత్‌కు సుప్రీం చివాట్లు! ముఖ్యమంత్రిపై మోడీ రుసరుసలు!!
గుజరాత్‌కు సుప్రీం
చివాట్లు! ముఖ్యమంత్రిపై మోడీ రుసరుసలు!!
ప్రధాని నరేంద్రమోడీ రాజకీయ రంగస్థలం, బిజెపి ప్రచార వేదిక గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రస్థాయిలో అక్షింతలు వేయించుకుంది. ఎవరితో తెలుసా? సాక్షాత్తూ సుప్రీం కోర్టుతోనే! 2013 ఆహార భద్రతా చట్టాన్ని అమలు చేయడంలో అలసత్వాన్ని అత్యున్నత న్యాయస్థానం తూర్పార బట్టింది. మీరు ఈ దేశంలో భాగం కాదా?ఒక పార్లమెంటు చేసిన చట్టాన్ని అమలుచేయరా అని ప్రశ్నించింది. ఇదే గాక జాతీయ ఉపాధి హామీ చట్టం కింద పని దినాలు కల్పించడంలోనూ నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా వుండగానే కాగ్ నివేదిక విమర్శలు చేసింది. ఇప్పుడు అహారభద్రతాచట్టం విషయంలోనే అదే పరిస్థితి ఎదురైంది. గుజరాత్ అభివృద్ది గురించి అదేపనిగా ప్రచారం చేసేవారు అక్కడ ఉపాధి భూమి వ్యవసాయకార్మికుల సమస్యల విషయంలో తీవ్రమైన లోపం జరుగుతున్న వాస్తవాన్ని దాటేస్తుంటారు. సుప్రీం వ్యాఖ్యలతోనైనా అలాటి వారిలో మార్పు రావాలి. ఇదే సమయంలో కాంగ్రెస్‌కు బిజెపి కి ఉపాధి హామీ చట్టంపై వాగ్యుద్ధం నడుస్తున్నది. అరవై ఏళ్ల కాంగ్రెస్ పాలన వైఫల్యానికి ఈ చట్టం పెద్ద ఉదాహరణ అని ప్రధాని మోడీ గతంలో ధ్వజమెత్తారు. ఇటీవల ఆయన మాట్లాడుతూ రాజకీయ విజ్ఞత గల తను ఈ చట్టాన్ని రద్దుచేయడం జరగదని ప్రకటించారు. ఈ తేడాను రాహుల్‌గాంధీ ఎత్తిచూపుతూ అంతగా విమర్శించిన దాన్ని ఎందుకు అమలు చేస్తారని ప్రశ్నించారు. మరోవైపున ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఉపాధి హామీకి నిధులు పెంచుతామని ప్రకటించారు. గతంలో బడ్జెట్ సమయంలో దాని కేటాయింపులను గొర్రెతోకగా వుంచిన జైట్లీ కూడా ఇలాటి ప్రకటన చేయడం విశేషమే. ఇక్కడ కొసమెరుపు ఏమంటే ఉపాధి హామీ చట్టం వచ్చింది అప్పుడు యుపిఎ ను బలపరుస్తున్న వామపక్షాల ఒత్తిడి వల్లనేనన్నది అందరికీ తెలసిన సత్యం.కాని దానిపైన కాంగ్రెస్ బిజెపిలు పరస్పరం వాదులాడుకోవడం విచిత్రం.
ఆనందీ బెన్ సంతాన సమస్యలు
ఇది ఇలా వుంటే గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్‌ను మరో కారణంపై ప్రధాని నరేంద్ర మోడీ మందలించారు. ఆమె కుమారుడు శ్వేతాంక పటేల్, కుమార్తె అనూరల ప్రభుత్వ వ్యవహారాల్లో తలదూర్చడం విమర్శలకు దారితీస్తున్నది. కుమారుడు వ్యాపారాల్లోనూ కుమార్తె ఎన్జీవోల నిర్వహణలోనూ వున్నారు. అయితే వారు ముఖ్యమైన నిర్ణయాలను ప్రభావితం చేస్తుంటారని విమర్శలున్నాయి. అదేగాక ఆనందీబెన్ రెవెన్యూ పట్టణాభివృద్ధి శాఖలను తన దగ్గరే కొనసాగించుకుంటూ వారికి సహకరిస్తున్నారనే ఆరోపణ కూడా వుంది. ఇది దేశమంతటా వ్యాపించడంతో మోడీ ప్రత్యేకంగా అసంతృప్తి వ్యక్తం చేశారట. ఆమె పరిపాలన అలనాటి కేశూభారు పటేల్‌ను తలపిస్తున్నదని బిజెపి రాష్ట్ర నేతలు ఫిర్యాదు చేస్తున్నారట.
మొన్న పటేళ్ల ఆందోళన.. తర్వాత స్థానిక ఎన్నికల్లో ఎదురుదెబ్బ..ఇప్పుడు సుప్రీం ఆగ్రహం. సిఎంపై విమర్శలు.. మొత్తంపైన మోడీ గారి ఆదర్శ రాష్ట్రం అనేక విధాల సమస్యలనెదుర్కొంటున్నది.