తునిలో నిఘా ఇన్‌పుట్స్ వున్నాయి..

అంత విధ్వంసకాండ జరిగితే ఇంటలిజెన్స్ ఎందుకు పసిగట్టలేకపోయింది? అసలు ఇన్‌పుట్స్ వున్నాయా లేదా అని అడిగితే ‘వున్నాయి’ అనే జవాబు చెబుతున్నారు సంబంధిత అధికారులు. ముద్రగడ పద్మనాభం హఠాత్తుగా రాస్తారోకో ప్రకటించడంతో పరిస్థితి అదుపు తప్పిందని చెబుతున్న మాట నిజం కాదని దీన్ని బట్టి అర్థమవుతుంది. సభనుంచి నేరుగా రైలు పట్టాలపైకి వెళ్లే అవకాశం వుందని ముందే నిఘా విభాగం హెచ్చరికలు అందజేసింది. అయితే ఈ స్థాయిలో దహనకాండ కూడా జరుగుతుందని వూహించలేదు. పట్టాలపైకి ఎక్కుతారనుకున్నా తగు భ ద్రతా ఏర్పాట్లు చేయాలి కదా అంటే చేశారు.1500 మంది పోలీసులు అందుబాటులో వున్నారు అని ఒక ఉన్నతాధికారి చెప్పారు. ‘వారిని సంయమనం పాటించవలసిందిగా ఆదేశించాం. ఆ రోజున లాఠీచార్జీ లేదా కాల్పులు జరిగితే పరిస్థితి మరోలా వుండేది. ఆందోళనకారులు కోరుకున్నదదే. కావాలనే ఆ అవకాశం ఇవ్వలేదు.’ అని ఆయన అన్నారు. మరి అదే సంయమనం రాజకీయ వేత్తలు పాటించలేదు కదా అంటే నవ్వేశారు. మాజీ మంత్రి పళ్లం రాజు జోక్యం చేసుకుని ముద్రగడకు నచ్చజెప్పి వుండకపోతే ఆ రోజు పరిస్థితి చేయిదాటిపోయి వుండేదన్న అంచనాలో ప్రభుత్వం వుంది. రాత్రికి గనక బైఠాయింపు కొనసాగివుంటే సంఘ వ్యతిరేక శక్తులు తునిలోనే గాక ఇతర చోట్ల కూడా ఉద్రిక్తత పెంచేవారనీ, విజయవాడలోనూ అలాటి సంకేతాలున్నాయని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. కనుక కొంత వరకూ ప్రమాదం విస్తరించకుండా ఆపగలిగారన్న మాట. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాపు నాయకులతోనూ వీలైతే ఆందోళన కారులతోనూ మాట్లాడి కొంత వరకూ ఉపశమన చర్యలు తీసుకుంటారని భావిస్తున్నారు. హరి రామ జోగయ్య ఆఫర్ కూడా అందులో భాగమేనా అన్నది చూడాలి.
తెలుగుదేశంలోనూ అసంతృప్తి..
తుని ఘటనల తర్వాత తెలుగుదేశం పార్టీలోనూ అసంతృప్తి స్వరాలు వినిపిస్తున్నాయి. మరింత జాగ్రత్తగా వ్యవహరించి వుండాల్సిందన్న మాట వస్తున్నది. ఆ రోజున రైలు నిలిపేసేందుకు కాపునాడు ఆందోళనకారులు వెళ్తారని నిఘా వర్గాలు ఇన్‌పుట్స్ ఇచ్చినా ఎందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదనే ప్రశ్న ఎదురవుతున్నది. తమను అక్కడకు వెళ్లవద్దని శాసించి తమ వర్గానికి దూరం చేసినా అన్ని లక్షల మంది రాకుండా ఆపగలిగారా అని కొందరు నేతలు మాట్లాడుతున్నారు. కాపునాడుకు వెళ్లకపోయినా వాహనాలు ఆహారం పంపించడంలోనూ ఆర్థిక సహాయం అందించడంలోనూ పాలుపంచుకున్న తెలుగుదేశం నాయకులున్నారు. ఇలాటి ఘటనలు జరిగిపోయిన తర్వాత ఎంత జాగ్రత్తగా మాట్టాడినా ఆ వర్గంలో తలెత్తిన వ్యతిరేకత తగ్గదుకదా? హైదరాబాదులోనే కాపులు పొరబాటున కూడా మాకు ఓటు వేయరు అని అలాటి వారు చెబుతున్నారు. ఇప్పుడు మధ్యవర్తిత్వం కోసం ప్రయత్నం చేయడం తమను మాట్లాడమని పురమాయించడం వల్ల ప్రయోజనం లేదని కూడా వారి భావనగా వుంది. కాపుల రిజర్వేషన్లు కాపునాడు ఆందోళన విషయంలో మొదటి నుంచి నాయకత్వానికి స్పష్టత లేదనీ తక్కువ అంచనా వేసిందనీ వారు గట్టిగా విమర్శిస్తున్నారు.
ఇలాటి ఘటనలు జరిగితే వీలైనంత తక్కువ మాట్లాడాలి. కాని మా నాయకుడు సుదీర్ఘంగా మీడియా ముందు కూచుని అవసరం లేనివన్నీ ప్రస్తావించి చిక్కులు కొనితెచ్చుకుంటున్నారు. జగన్ పేరెత్తకపోయినా క్రిమినల్ అంటూ దాడిచేస్తే తను కూడా ఎదురు దాడికి దిగాడు. ఎవరికి నష్టం? కాపులు బిసీలను పోటీగా పెట్టి మాట్లాడటం, పులివెందుల మంచిది కాదు తుని మంచిది అనడం ముఖ్యమంత్రి చేయవలసిన పని కాదు అని ఒక సీనియర్ నాయకుడు వ్యాఖ్యానించారు