నోట్లచట్టాలపై కట్టుకథలకు చెల్లు- మళ్లీ కొత్తబిల్లు

నోట్లరద్దు పేరిట ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న ఏకపక్ష చర్యలో ఎవరినీ సంప్రదించకపోవడమే గాక చట్టపరమైన జాగ్రత్తలు కూడా పాటించలేదని ఇప్పుడు స్పష్టమై పోయింది. రిజర్వుబ్యాంకు చట్టం 26(2) ప్రకారం ఈ విషయంలో సక్రమంగా వ్యవహరించలేదు. కనుకనే నోట్లరద్దు వల్ల ఏదో మిగులు తేలుతుందని చెబుతున్న ప్రభుత్వం దాన్ని తీసుకోగల స్థితిలోనూ వుండదు. మూడు లక్షల కోట్ల విలువైన నల్లడబ్బు బ్యాంకులకు రాదు గనక అదంతా ఆర్‌బిఐ బ్యాలన్స్‌ షీట్‌లో లైబలటీని తగ్గిస్తుందని,తద్వారా ప్రభుత్వ బడ్జెట్‌లో ద్రవ్యలోటు తగ్గుతుందని బిజెపి మిత్రులు గొప్పగా వాదిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడున్న ఆర్‌బిఐ చట్టంలో ఆ విధమైన అవకాశమే లేదని గవర్నర్‌ ఊర్జిత్‌ పటేల్‌ స్పష్టం చేశారు.దానికి చట్ట సవరణ జరగాలి. నోట్లరద్దుకూ చట్టబద్దత కల్పించడంతో పాటు ఆర్‌బిఐ నుంచి బదలాయింపులకు నిబంధన చేర్చాలట. గతంలోనే చెప్పుకున్నట్టు ఇప్పుడున్న చట్టం ఒక సీరిస్‌ రద్దుకు తప్ప మొత్తంగా డినామినేషన్ల రద్దుకు అవకాశమివ్వడం లేదు. పైగా రద్దు తర్వాత ప్రజలు బ్యాంకులనుంచి తమ డబ్బు తాము తీసుకునే మొత్తాన్ని నియంత్రించేందుకు కూడా చట్టంలోని నిబంధనలు అవకాశమివ్వడం లేదు.ఈ అంశంపైనే కామన్వెల్త్‌ హ్యూమన్‌రైట్స్‌ ఇన్షియేటివ్‌ సంస్థ తరుపన న్యాయవాది ఇందిరాజైసింగ్‌ కేసు వాదిస్తున్నారు.

1978లో జనతా ప్రభుత్వం తెచ్చిన చట్టంలో వున్న మేరకైనా మోడీ నోట్లరద్దులో జాగ్రత్తలు తీసుకోలేదు. ఉదాహరణకు ఆ చట్టం సెక్షన్‌ 7 ప్రకారం తాము మార్చుకుంటున్న నోట్లకు సోర్స్‌ చెప్పాలి. సెక్షన్‌4 ప్రకారం వాటిని మరొకరికి ట్రాన్స్‌ఫర్‌ చేయకూడదు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నందువల్లనే 1996లో ఆచట్టంపై జయంతిలాల్‌ రతన్‌ వర్సెస్‌ రిజర్వుబ్యాంకు కేసులో సుప్రీం కోర్టు దాని ధృవీకరించింది. ఇప్పటికి వచ్చే సరికి చట్టబద్దతపైనా భిన్నాభిప్రాయాలున్నాయి. పైగా కీలకమైన పై రెండు అంశాలు నవంబరు 8 ఉత్తర్వులో లేవు గనకే నల్లడబ్బు బడాబాబులు నిక్షేపంగా ఇతరులను పంపి మార్చుకోవడం, జన్‌ధన్‌ ఖాతాల్లోకి మార్చడం సాధ్యమైంది. ఇది కూడా మోడీ సర్కారు చర్య డొల్లతనానికి నిదర్శనమే.

చివరగా ఇప్పటికి 12 లక్షల కోట్లు బ్యాంకులకు చేరినట్టు అధికార వర్గాలు నిర్ధారిస్తున్నాయి. కాని తాము ముద్రించింది మాత్రం 4.72లక్షల కోట్టు మాత్రమేనని ఒప్పుకుంటున్నాయి. కాబట్టి పరిస్తితి ఎంత దారుణంగా వుందో దీన్నిబట్టే తెలుస్తుంది. ఇది ద్రవ్యబిల్లు గనక మెజార్టి వున్న లోక్‌సభలో ఆమోదించుకోవచ్చు గాని ఎంత ఆరాచకంగా బాధ్యతా రహితంగా వ్యవహిస్తున్నారో తెలియడానికి ఇది మరో ఉదాహరణ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *