బాహుబలి గ్రాఫిక్స్.. ప్రపంచ బ్యాంకు రీమిక్స్.. అమరావతి అప్పుల ప్రాబ్లమ్స్..
ప్రపంచ బ్యాంకుకు చాలా ఇష్టమైన ముఖ్యమంత్రిగా గతంలో చంద్రబాబు నాయుడు పేరు సంపాదించుకున్నారు. దాన్ని సంతృప్తి పర్చడం కోసం తీసుకున్న చర్యలతో ప్రజా వ్యతిరేకత పెంచుకుని చివరకు అధికారం కోల్పోయారు. ఇప్పుడు మరో రూపంలో ప్రపంచ బ్యాంకు జోక్యం పెరుగుతుందని అధికార వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. రాజధాని నిర్మాణం, సమస్త అభివృద్ధి ప్రాజెక్టులు, పెన్షన్లు,వ్యక్తిగత వ్యవహారాలకు సంబంధించిన నిర్ణయాలు కూడా నివేదించాలని బ్యాంకు ప్రతినిధులు పట్టుపడుతున్నారట. దీనిపై కమిషనర్‌స్థాయి అధికారి ఒకరు అసహనం వ్యక్తం చేసినట్టు ప్రజాశక్తి కథనం ప్రచురించింది. అమరావతిపై రూపొందించిన కొన్ని నివేదికలు తమకన్నా ముందే ప్రపంచ బ్యాంకు చేతుల్లోకి పోతున్నాయని అధికారులు వాపోతున్నారు. ఆ ప్రతినిధులు చెప్పినట్టే చేయాల్సి వస్తున్నందుకు క్రిడా అధికారులు కూడా ఇబ్బంది పడుతున్నారట. అసలు అప్పు ఇచ్చేది తేలకముందే అన్నీ వారి చేతుల్లో పెట్టడమెందుకుని వారి ప్రశ్న. రాజధానిలో చైనా తరహా రోడ్ల నిర్మాణం జరగాలంటున్న ముఖ్యమంత్రి దానికోసం ప్రపంచ బ్యాంకుకు అనుబంధమైన ఎడిబి నుంచి అప్పురావాలంటే ఇవన్నీ తప్పనిసరి అనే భావనలో వున్నట్టు కనిపిస్తుంది. ప్రజలు వ్యతిరేకి
స్తున్న కొవ్వాడ అణుపార్కు,గోదావరి ఫుడ్‌పార్కు వంటివాటిపైనా ప్రపంచ బ్యాంకు నివేదికలు తెప్పించుకుంది.
మరోవైపున నోట్లరద్దుతో రియల్ రంగం కుదేలై పోవడం అమరావతిలో ప్రైవేటు పెట్టుబడుల ఆశలను ఆవిరి చేస్తున్నది. వీటిని డెవలప్ చేసి ఇవ్వడానికి 35 వేల కోట్లు కావాలని అంచనా.ఇక ఆ పైన రైతులకు ఇచ్చే పదివేల ఎకరాల ప్లాట్లను పరోక్షంగా రియల్టర్లే తీసుకుంటారని అనుకున్నది నిజమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఈ ప్లాట్లలో ఇళ్ల నిర్మాణానికి లక్షకోట్లపైనే కావాలి. ఇది గాక వ్యాపారపరమైన మరో 2100 ఎకరాల అభివృద్ధికీ కూడా దాదాపు 42వేల కోట్లు కావాలట. ఈ లెక్కలనీ బాగానే వున్నాయి గాని డబ్బు మాత్రం లేదు. హడ్కో మాత్రం 7500 కోట్ల రుణం ఇవ్వడానికి అంగీకరించింది. అప్పులు రాక, వ్యాపారవర్గాలు ఉత్సాహం చూపక అమరావతి ప్రణాళికలు ఆచరణకు రావడం కష్టసాధ్యమై పోతున్నది.
రాజధాని నిర్మాణ నమూనాలకు దర్శకుడు రాజమౌళిని సంప్రదించడం కూడా హాస్యాస్పదంగా వుంది.ఆయన దర్శకత్వ నైపుణ్యాన్ని గౌరవించాల్సిందే గాని బిల్డింగ్‌లకు సెట్టింగ్‌లకు హస్తిమశకాంతరం తేడా. నిజానికి కె.రాఘవేంద్రరావు ఎన్టీఆర్‌తో తీసిన సింహబలుడు, రాజమౌళి రామ్ చరణ్‌తో తీసిన మగధీర సెట్టింగులు పక్కనపెట్టుకుంటే మహిష్మతి చాలా వరకూ అర్థమవుతుంది. అయినా ఒక రాష్ట్ర రాజధానిని గ్రాఫిక్‌ల కింద చూస్తున్న తమాషా ఇక్కడే సాధ్యం. నేను మొదట్లో సరదాగా అనేవాణ్ని బాహుబలి సెట్టింగులు అని. అదే నిజం చేస్తారని మాత్రం వూహించలేదు.
చివరి విషయం ఏమంటే – రాజధాని టెండర్ల విషయంలో స్విస్ చాలెంజికి కోర్టు తిరస్కరణ తర్వాత ప్రభుత్వం కాస్త అటూ ఇటూ చేసి ఒక్క నిబంధన మినహా పాత ఫక్కీలోనే ముందుకు పోతున్నట్టు కనిపిస్తుంది. టెండరుదార్లకు సమయం ఇవ్వడం తప్ప తక్కినవన్నీ సేమ్ టు సేమ్ అంటున్నారు. ఇది కూడా సమస్యలకు దారితీయొచ్చు. బహుశా ఆ పేరుతో మరింత ఆలస్యం చేయాలని ప్రభుత్వ వ్యూహం కావచ్చు.