ఒక కేసు సైన్యం గౌరవానికి కళంకం- మరొకటి రాజకీయాలకే సిగ్గుచేటు
అగష్టా హెలికాప్టర్ కొనుగోలు కుంభకోణంలో మాజీ వైమానిక దళాధిపతి ఎస్.పి.త్యాగి, ఆయన సోదరుడు సంజీవ్ త్యాగి, దళారి గౌతమ్ ఖైతాన్లు అరెస్టు కావడం ఘోరమైన అవినీతికి మరో ఉదాహరణ. దేశంలో సైనిక దళాల కొనుగోళ్లలో విపరీతమైన అవినీతి వేళ్లూనుకున్నట్టు అందరికీ తెలిసిందే. వాజ్పేయి ప్రభుత్వ హయాంలో తెహల్కా పరిశోధన దేశాన్నే కుదిపేసింది. తర్వాత వచ్చిన యుపిఎ 1 హయాంలో 2005లో ఈ కుంభకోణానికి అంకురార్పణ చేశారు. ఇందుకు సంబంధించి ఏకంగా త్రివిధదళాల్లో ఒకదానికి ఆధ్వర్యం వహించిన వ్యక్తి ఈ విధంగా అరెస్టు కావడం దేశచరిత్రలో ఇదే తొలిసారి. వీరికి కోర్టు నాలుగు రోజులు రిమాండు కూడా విధించింది. 6000 మీటర్ల ఎత్తులో ఎగరడానికి ఉద్దేశించిన హెలికాఫ్టర్ల కొనుగోలును 4500 మీటర్లకు తగ్గించారంటేనే దేశ భద్రతను ఎలా గాలికి వదిలేశారో అర్థమవుతుంది. పైగా ఇవి వివిఐపిల వినియో
గం కోసం కొనేవి కావడం మరింత ఆసక్తికరం. ఆ విధంగా చేయడం ద్వారానే బ్రిటన్కు చెందిన కంపెనీకి తద్వారా ఇటలీలోని దాని అనుబంధ సంస్థ ఫిన్మెకానికాకు అవకాశం కల్పించారు. 3767 కోట్ల విలువైన ఈ ఒప్పందంలో 12 శాతం ముడుపుల కింద కేటాయించినట్టు సిబిఐ ఆరోపణ. అయితే ఈ నిర్ణయం చాలా కాలం కిందటే సమిష్టిగా జరిగిందనేది త్యాగి వాదన.
ఇక తమిళనాడుకు చెందిన మాజీ కేంద్రమంత్రి దయానిధి మారన్, కళానిధి మారన్లపైనా సిబిఐ దాఖలు చేసిన చార్జిషీటు చేసిన కేసు కూడా చాలా సిగ్గుచేటైందే. టెలికాం శాఖా మంత్రిగా అధికార హౌదాను దుర్వినియోగ పర్చి తన నివాసంలో ఎక్సేంచి ఏర్పాటు చేసుకుని దాన్ని తమ కుటుంబానికి చెందిన సన్ టీవీ నెట్ వర్క్ డాటా సరఫరా కోసం వినియోగించడం మామూలు మనుషుల వూహకందదు. చైన్నె టెలిఫోన్స్ బిఎస్ఎన్ఎల్ మాజీ జనరల్ మేనేజర్ ఎంపి కె.బి.బ్రహ్మానందం,మరో మాజీ జిఎం వేలుస్వామి కూడా అరెస్టయిన వారిలో వున్నారు.
ఇలాటి ఘోరమైన అవినీతి వ్యవహారాలను అనుమతించింది గనకనే కాంగ్రెస్ను ప్రజలు మొన్నటి ఎన్నికల్లో దారుణంగా తిరస్కరించారు. అయితే ఇప్పటికైనా వాటిపై చెంపలేసుకుని విధానాలు మార్చుకోకుండా మళ్లీ ఆదరణ ఎలా లభిస్తుంది? మోడీ హయాంలో కుంభకోణాలు రాలేదని అంటున్నారు కరెక్టే గాని యుపిఎ కుంభకోణాలు కూడా చాలా ఆలస్యంగా కదా వెలుగు చూసింది? ఈ వ్యవహరాల వెనక వున్న దేశ విదేశీ కార్పొరేట్లతో సంబంధాలు కొనసాగిస్తున్న బిజెపి చెప్పే మాటలకూ విశ్వసనీయత ఏముంటుంది? బిజెపివారిపై వచ్చిన మేరకు తీసుకున్న చర్యలు కూడా లేవే? నోట్ల రద్దు తర్వాతా గాలి జనార్థనరెడ్డి పెళ్లికి వెళ్లివచ్చారే!