కులాల కూపాలు.. తరాల పాపాలు!

‘నేనంటూ కాలగర్భంలో కలసిపోయాక నా గురించి ఏమనుకుంటారనేది నేను పట్టించుకోను.’ అని చివరి లేఖలో రాశాడు వేముల రోహిత్. బలవన్మరణక్షణాల్లోనూ బాధావేదనలు అర్థవంతంగా వ్యక్తం చేస్తూ నిష్క్రమించాడు. తన మృతదేహానికి అంత్యక్రియలు హడావుడిగా పూర్తిచేసి ఉనికేలేని తన కులం ఏమిటో తవ్వితీసేందుకు తలపడతారని వూహించివుండడు. నిరసనలతో కుుతకుత వుడుకుతూ రోహిత్ విషాదాంతంతో పరాకాష్టకు చేరిన హెచ్‌సియు ఉదంతం వివక్షా భారతానికి వికృత ఉదాహరణ. దాన్ని ప్ర్రతిఘటించే విశాల చైతన్యానికి సమరశీల సంకేతం కూడా. ఒక యూనివర్సిటీలో ఘటనలు దేశంలోనే సంచలనం కలిగించిన సందర్భం ఇటీవలికాలంలో లేదు. అయినా సరే- ఈ పరిస్థితి తీసుకువచ్చిన కేంద్ర ప్రభుత్వం బిజెపి నేతలు దాన్ని మరింత దిగజార్చడంలో తలమునకలవుతున్నారు తప్ప ఒక్క కన్నీటిబొట్టు విడవడానికి ఒక్క సానుతాప వాక్యం పలకడానికి సిద్ధంగాలేరు. ఉమ్మడి రాజధానిలో ఇదంతా జరుగుతున్నా ఉభయ చంద్రులూ వారి చుట్టూ పరిభ్రమించే తారా వారసులూ తొక్కిచూడలేదు. వామపక్ష ప్రగతిశీల సంస్థలూ విద్యార్థి సంఘాలూ ఆలోచనా పరులూ భుజం కలిపి నిలుస్తుంటే పాలక నేతల నుంచి కొందరు మీడియా మేధావుల వరకూ రంగులు బయిటపెట్టుకుంటున్నారు. గ్రేటర్ ఎన్నికల రణగొణధ్వనుల మధ్య శిెవార్లలో అన్నపానీయాలు మాని ఆందోళన చేస్తున్న ఆ బిడ్డల గుండె ఘోష వినిపించడం లేదు..
హెచ్‌సియులో ఒక విజ్ఞాన శాస్త్రాధ్యాపకుడు చేసినట్టు తామే తవ్వించుకున్న కుల కూపాల్లోనే వుండిపోయిన పండిత ముద్రాంకిత మండూకాలకు సామాజిక న్యాయభావన తలకెక్కదు. కాళిదాసు మేఘసందేశం, శ్రీహర్షుడు హంసరాయబారం రచిస్తే గుర్రం జాషవా తన వేదనా సందేశం పంపించేందుకు గబ్బిలాన్ని ఎంచుకోవడంలో యాదృచ్చికం కాదు. తలకిందులుగా వేళ్లాడే గబ్బిలమే సత్యాసత్యాలు తారుమారు చూడగలుగుతుంది. సమన్యాయం, ప్రజాస్వామిక దృక్పథం,మానవీయ విలువలను పక్కనపెట్టిన వారికి దళిత సమస్య తలకిందులుగా గోచరిస్తుంది. ఓట్ల కోసం ఏఏ కులాలను ఎలా కలుపుకోవాలని లెక్కలు వేస్తే తప్పుండదు. ఉపేక్షిత వర్గాలు ఉద్యమించడమే కులతత్వమై పోతుంది. విజ్ఞాన కేంద్రాలైన ఉన్నత విద్యాసంస్థల్లోనే కులం విలయతాండవం చేస్తున్నదని ప్రొఫెసర్ థోరాట్ కమిటీ వంటవిి ఎప్పుడో నివేదించాయి. ఇదే హెచ్‌సియులో ఇప్పటికి ఏడెనిమిది మంది బలైనారు. అక్కడ కులాలను బట్టి పిల్లలకు టూ స్టార్ త్రీ స్టార్ అని పేరు పెట్టి వెలివేతప్రారంభించడం పరిపాటి. ఈ ప్రభుత్వం వచ్చాక అంబేద్కర్ అధ్యయన కేంద్రాలను నిషేదించడం వంటి చర్యలు ఇంకా పెరిగాయి. ఈ నేపథ్యంలోనే దేశవ్యాపితంగా యూనివర్సిటీలలో దళితుల విద్యార్థి వేదికలు క్రియాశీలంగా పెరుగుతున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. వీటితో మరింతగా కలసి పనిచేయాలని వామపక్ష సంఘాలూ గుర్తించాయి. ఇందుకు కమ్యూనిస్టులనో లేక ప్రగతిశీల మేధావులనో తిట్టిపోస్తే ప్రయోజనం వుండదు. రాహుల్‌గాంధీ వచ్చాడు గనక కాంగ్రెస్ ముద్ర వేసినా ఉపయోగం లేదు. ఆ లెక్కన ముందు కేంద్రం నుంచి అమిత్‌షానో అరుణ్‌జైట్లీనో లేక ఇన్ని నిర్వాకాలకు ఆద్వర్యం వహించిన అప్పారావును విసిగా నియమింపచేశారంటున్న వెంకయ్యనాయుడో వచ్చివుంటే పోయేది కదా! తాము రాకపోగా రోహిత్ గురించి పోరాడే విద్యార్థుల గురించి బిజెపి ఎబివిపి వారు మాట్లాడే మాటలు అసహనానికి అద్దంపడుతున్నాయి. బండారు దత్తాత్రేయ ప్రజలకు దగ్గరగా వుండేవాడున్నా ఆయన ఆరెస్సెస్ సిద్ధాంతాలను తప్పకుండా అనుసరించే వ్యక్తికూడా. ఎంఎల్‌సి రామచంద్రరావు కూడా శిష్టసమాజంలో మంచిపేరున్నవారే. కాని హెచ్‌సియులో ఎబివిపికి వ్యతిరేకంగా నిలిచిన విద్యార్థులపై విద్వేషం పురికొల్పడంలో వారి పాత్ర ప్రజా జీవిత ప్రమాణాలకు విరుద్ధం. నా ప్రతి విమర్శకూ లిఖిత పూర్వక ఆధారాలున్నాయి.
అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్‌పై ఎబివిపికి రాజకీయ వ్యతిరేకత వుండొచ్చు. ఆ మాటకొస్తే ఎస్‌ఎఫ్‌ఐ వంటివాటికి సంఘీభావం వున్నా వాటితో ఎప్పుడూ ఏకాభిప్రాయం వుందని చెప్పలేము. మొన్నటి ఎన్నికల్లో కూడా వాటి మధ్య అవగాహన లేదు. ఆవేశపూరితమైన వయస్సులో వారివైపునా ఏవైనా పొరబాట్లు వుండొచ్చు గాని జాతి ద్రోహ ముద్ర వేయడం తప్పు. ప్రభుత్వానికి దాదాపు అప్రూవర్‌గా మారి అనేక విధాల సహకరించిన యాకూబ్ మెమెన్‌నుఉరితీయడం సరికాదన్న అభిప్రాయం ప్రముఖులే వ్యక్తం చేశారు. యూనివర్సిటీలోనూ ఎఎస్‌ఎ దానిపై నిరసన ప్రదర్శన జరిపింది. అంతమాత్రాన జాతి వ్యతిరేకమై పోతుందా? ఉరిశిక్షపై చాలా వ్యతిరేకత వుంది. 2015లో లా కమిషన్ కూడా ఉరిని రద్దుచేయాలని భావించింది. దానిపైన కూడా దేశద్రోహే ముద్ర వేస్తారా? ఎబివిపి సుశీల్ కుమార్ కూడాౖ ఫేస్‌బుక్‌లో ఎఎస్‌ఎ గూండాలు అని రాస్తే రంగారెడ్డి జిల్లా బిజెపి నేత మాత్రం దత్తాత్రేయకు ఆ విధమైన ఫిర్యాదు చేశారు. ఆయన వెంటనే హెచ్‌సియు జాతి వ్యతిరేక శక్తుల అడ్డాగా మారిపోయిందంటూ కేంద్ర మంత్రి సృతి ఇరానీకి మరింత గట్టి లేఖ బనాయించేశారు. ఎబివిపి నాయకుడిపై దాడి చేసిన వారిపట్ల యూనివర్సిటీ అధికారులు చాలా మెతగ్గావ్యవహరిస్తున్నారని కూడా మందలింపుగా రాశారు. విద్యార్థి సంఘాల మధ్య సమస్యలలో కేంద్ర మంత్రులు జోక్యం చేసుకోవడం ఎక్కడి రాజనీతి? నిజానికి ఆ రోజున వారి మధ్య ఘర్షణ జరిగింది గాని దాడి జరగలేదని ప్రత్యక్ష సాక్షులైన భద్రతాధికారులు చెప్పినట్టు లిఖితపూర్వక ఆధారాలున్నాయి. గట్టిగా మందలించి వదలివేయాలని కూడా ఒక దశ లో భావించారు.కాని మానవ వనరుల శాఖ ఏకంగా అయిదు లేఖలు రాసి మరీ చర్య తీసుకోవాలని ఒత్తిడి పెట్టారు. ప్రతిలేఖలో జాతి వ్యతిరేకులు అన్న ఆరోపణ చేస్తూనే వచ్చింది. కనుకనే ఇది ముమ్మాటికి వివక్షతో తీసుకున్న కక్ష పూరితచర్య అవుతున్నది. వారిని మొత్తంగా వెళ్లగొట్టాలని ఫాక్టొరల్ కమిటీ చెప్పిందట. దయార్ద్రహృదయుడైన విసి అప్పారావు హాస్టల్‌నుంచి పరిసరాల నుంచి మాత్రమే వెలివేసి సరిపెట్టాడట. ఈ మొత్తం క్రమంలో ి నెలలతరబడి ఈ పేద పిల్లలకు స్కాలర్‌షిప్పులు లేకుండా పోయాయి. రోహిత్ ఆర్థిక దుస్థితిని ఆఖరిలేఖలోనే రాశాడు. ఆత్మహత్య అవాంచనీయమే అయినా అప్పటికీ పాలకమండలిలో కదలికే లేదు. మోడీ నోరువిప్పాేకనే సస్పెన్షన్ నిలిపివేసినట్టు ప్రకటించి మళ్లీ కోర్టులో సమర్థించుకుంది. గత్యంతరం లేని స్థితిలో అప్పారావు తప్పుకోగా మొత్తంగా వెళ్లగొట్టాలని సిఫార్సుచేసిన శ్రీవాత్సవ ఆ స్థానం ఆక్రమించడమంటే అంతకన్నా అపహాస్యం ఏముంటుంది? సుశీల్ కుమార్ ఏదో కారణంతో ఆస్పత్రిలో చేరితే గాయాలతో చేరినట్టు చిత్రించి అతని తల్లిగారిని రంగంలోకి తెచ్చారు. మరోవైపు రోహిత్ తల్లి మేము మాలలం అని రోదిస్తున్నా లేనిపోని తవ్వకాలలో తరించడం సిగ్గుచేటు.
ఆంధ్రజ్యోతి ఈ విషయంలో వివిధ వాదనలకు చోటు కల్పించడమే గాక రోహిత్ దళిత మూలాలపై హిందూస్తాన్ టైమ్స్ వాస్తవ కథనాన్ని పునర్ముద్రించి మేలు చేసింది. బాల శ్రామికురాలుగా బందితురాలై బాల్యంలో మరో కులం వ్యక్తిని చేసుకుని తన వల్ల బాధలపాలైనానంటున్న రాధిక కథ నిజానికి తరతరాల వ్యథ. భారత మాత ముద్దుబిడనుకోల్పోయింది అని ప్రధాని కన్నీరుకారుస్తారు గాని నిజంగా ఆ బిడ్డను కన్న తల్లిని ఆదరించలేని ఈ పాలక వ్యవస్థను ఏమనాలి? ప్రైవేటీకృత ప్రపంచీకరణలో నిర్భాగ్య వర్గాల బాధలు పెరిగే దశలో మనమున్నాం. ఏకలవ్యుడి మహాభారతం నుంచి రోహితాస్యుని మోడీత్వ భారతం వరకూ కుల వ్యవస్థ కర్కశరూపం కరిగేది కాదని నిరూపిస్తున్న హెచ్‌సియు బలికేక దేశానికే ఒక హెచ్చరిక. నిమ్నజాతుల కన్నీటి నీరదములు పిడుగులై దేశాన్ని కాల్చివేస్తాయని జాషవా ఎప్పుడో చేసిన ఈ హెచ్చరిక నిజం కాకముందే అణగార్చబడిన వారి ఆగ్రహావేదనలు అర్థం చేసుకోవాలి. అండగా నిలవాలి. హెచ్‌సియులో పాక్షిక పాలకులను తొలగించి ప్రక్షాళన చర్యలు ప్రారంభించాలి. బాధితులను ఆదుకోవడమే గాక తగు పరిహారం కల్పించి ప్రధాన స్రవంతిలో భాగస్వాములను చేయాలి. ఇప్పుడు విద్యార్థుల మధ్య విభజన తెచ్చి సాధారణ పరిస్థితి నెలకొన్నట్టు చూపించుకున్నా మళ్లీ దిగజారడం అనివార్యం. కనుకనే కుటిల వ్యూహాలు కట్టిపెట్టి ప్రజాస్వామిక పరిష్కారాలు వెతకడం తక్షణం జరగాలి. న్యాయ విచారణకు ఆదేశించినా ముందు న్యాయం కోసం త్ణీసుకోవలసినచర్యలు తీసుకోవలసిందే . అంతేగాని విభాగాల వారిగానో, బిసి ఎస్‌సి ఎస్‌టి ఓసి ఇలా కులాల వారిగానో విద్యార్థులను విభజించాలని చూస్తే మరింత నష్టం. ఎబివిపిలో పనిచేసే విద్యార్తులైనా లేక రిజర్వేషన్లపై సరైన అవగాహన లేక అపార్థం చేసుకుని దూరమయ్యే అగ్రవర్ణ విద్యార్థులకైనా పరిస్థితిని సమగ్రంగా వివచించి సాధారణ వాతావరణం తీసుకురావాలి తప్ప రాజకీయ దృష్టితో వ్యూహాలు పన్నడం ి కేంద్రానికి కూడా తగని పని. ఆంధ్రజ్యోతి గమనం- 29.1,..15