దీర్థకాలంలో మనమంతా చనిపోతాం..
మాజీ ఫ్రధాని మన్మోహన్ సింగ్ నోట్లరద్దుపై రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలు అర్థవంతంగా వున్నాయి. మామూలుగా మాట్లాడని వ్యక్తిగా మౌన మునిగా పేరున్న ఆయన అర్థశాస్త్ర కోవిదుడుగా సరళీకరణ పితామహుడుగా గుర్తింపుపొందారు. పదేళ్ల పాలనకు సారథిగా జరిగిన అనేక కుంభకోణాలకు ఆయన బాధ్యత కాదనలేనిది. నోట్లరద్దు ఉద్దేశం మంచిదైనా దాని అమలు తీరు అసమర్థ నిర్వహణకు పరాకాష్ట అని ఆయన అభిశంసించారు. దీనివల్ల ఆర్థిక పెరుగుదల మూడు శాతం వరకూ పడిపోతుందన్నారు. దేశీయ చిన్న వ్యాపారాలు చితికిపోతాయని కూడా హెచ్చరించారు. సహకార బ్యాంకులపై దెబ్బను ఎత్తి చూపించారు. ఇక బ్యాంకులకు రోజుకో విధమైన ఉత్తర్వులనిస్తూ ప్రభుత్వం వాటి విశ్వసనీయతకే గండి కొట్టిందని ఆక్షేపించారు. ప్రజల డబ్బుఎప్పుడైనా తిరిగిఇవ్వాల్సిన బ్యాంకులు ఈ విధంగా చేయడం ఏ దేశంలోనైనా జరిగిందా అని ప్రశ్నించారు.
నోట్లరద్దు చట్టబద్దమైన అతి పెద్ద లూటీ అనీ, ప్రజల సొమ్ము కొల్లగొట్టడమేనని ఆయన నిశితంగా విమర్శించారు. నోట్లరద్దు సమస్యలు తాత్కాలికమేనంటున్న పాలక పక్ష వాదనను ఉటంకిస్తూ దీర్ఘకాలంలో మనమంతా చనిపోతాం.. అన్న ఆర్థిక వేత్త సూక్తిని వినిపించారు.అందుకే ప్రధాని వాస్తవికమైన ఆచరణ యోగ్యమైన పరిష్కారాలు కనుగొనాల్సివుందని కోరారు.
ఆయన జీరో అవర్లోనే మాట్లాడటానికి డిప్యూటీ చైర్మన్ కురియన్ అనుమతినిచ్చారు గాని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఆయన చర్చలో భాగంగా మాట్లాడాలని ప్రత్యేకంగా ఎందుకుని ఆక్షేపించారు. తర్వాత కొంత రభస జరిగింది. పున:ప్రారంభమైన చర్చలో ఆయన తొలిగా ప్రసంగించారు. మాజీప్రధాని ప్రసంగం కొద్దిసేపే సాగింది కాని కాంగ్రెస్ సభ్యులు చాలా సార్లు చప్పట్టు కొట్టారు.
ఊహించినట్టే మాజీ ప్రధాని ప్రసంగంపై అరుణ్‌జైట్లీ ఆ తర్వాత సుదీర్ఘ ట్వీట్లు చేశారు. పేరు పెట్టి విమర్శించకుండా యుపిఎ పాలనలోనే నల్లడబ్బు విపరీతంగా పెరిగిందని కుంఢకోణాలకు ఆధ్వర్యం వహించిన వారే లూటీల గురించి మాట్లాడుతున్నారని దెప్పిపొడిచారు.